ప్రతిపక్షాల ఐఖ్యత చూసి తెరాస ప్రభుత్వం భయం పడుతోందా?
posted on Sep 23, 2015 7:55AM
.jpg)
ఈరోజు నుండి తెలంగాణా శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. మొదట మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కొన్ని రోజుల క్రితం మరణించిన ఎమ్మెల్యే కృష్ణా రెడ్డికి శ్రద్దాంజలి ఘటించిన తరువాత ఉభయసభలకి ఐదురోజులు శలవు తీసుకొంటాయి. మళ్ళీ 29వ తేదీ నుండి సమావేశాలు మొదలవుతాయి. ఈరోజు మధ్యాహ్నం బి.ఏ.సి. సమావేశంలో శాసనసభ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయం ఖరారు అవుతుంది.
ఈసారి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల వద్ద అవసరమయిన ‘సబ్జెక్ట్’ ఏమీ లేదని, అయినప్పటికీ శాసనసభ్యులు అందరూ తమతమ నియోజక వర్గాలలో సమస్యలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం సేకరించుకొని సభకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల వద్ద ‘సబ్జెక్ట్’ ఏదీ లేదని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తే ప్రతిపక్షాలను చూసి భయపడవద్దని ఆయన తన సభ్యులకు దైర్యం చెపుతున్నట్లుంది. ఎందుకంటే, రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న ఆత్మహత్యల గురించి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి.
అదేవిధంగా జి.హెచ్.యం.సి. పరిధిలో సుమారు 25లక్షల ఓట్లను తొలగించడంపై కూడా అన్ని పార్టీలు ఏకమయ్యాయి. మావోయిస్ట్ అజెండాని అమలుచేస్తున్నామని చెప్పుకొంటున్న తెరాస ప్రభుత్వం వరంగల్లో భూటకపు ఎన్కౌంటర్ చేయడం వంటి అనేక అంశాలపై అన్ని పార్టీలు ఏకమై పోరాటాలు చేస్తున్నాయి. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నికయిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చాలా ఆక్టివ్ అయింది. కనుక కాంగ్రెస్ పార్టీ ఇదివరకులా శాసనసభలో మెత్తగా వ్యవహరించే అవకాశాలు లేవు.
ఓటుకి నోటు కేసులో నెలరోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ఆయన కూడా తెరాస ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయడం తధ్యం. కనుక శాసనసభలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం తెరాస ప్రభుత్వానికి ఈసారి చాలా కష్టం అవ్వవచ్చును. బహుశః అందుకే కేసీఆర్ తన ఎమ్మెల్యేలని భయపడవద్దని చెపుతున్నట్లుంది తప్ప నిజంగా ప్రతిపక్షాల వద్ద సబ్జెక్ట్ లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.