అమీర్‌పేటలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ
posted on: Dec 3, 2018 10:13AM

అమీర్‌పేట్‌లో నిన్న అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సనత్‌నగర్ నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వీరారెడ్డి, సాంబశివ, కొలిశెట్టి శ్రీనివాస్ అమీర్‌పేట్‌లోని సిల్వర్ పార్క్ హోటల్లో వేర్వేరు గదుల్లో బస చేశారు. అర్ధరాత్రి వేళ అమీర్‌పేట్‌లోని లాడ్జి వద్దకు వచ్చిన కూటమి బలపర్చిన సనత్‌నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతుండటాన్ని గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దాంతో అక్కడున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నలుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మరో టీడీపీ కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై అశోక్‌ను తోసివేశారు. సమాచారం తెలుసుకున్న గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీడీపీ నాయకులకు చెందిన రెండు కార్లతో పాటు.. వారు బస చేసిన హోటల్లోని మూడు గదుల్లో సోదాలు చేశారు. ఓ కారులో రూ.2 లక్షలు లభించగా.. మూడు గదుల్లో మరో 2 లక్షల 74 వేల రూపాయల్ని సీజ్ చేశారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు చెందిన అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు ఆధారాలైతే లభించలేదని, సరైన పత్రాలు చూపించకపోవడంతో టీడీపీ కార్యకర్తలకు చెందిన రూ.4.74 లక్షలను సీజ్ చేశామని చెప్పారు.






