ముస్లిం ఓట్ల కోసం టీఆర్ఎస్ వేర్పాటువాద రాజకీయం!

 

ముస్లిం ఓట్ల కోసం టీఆర్ఎస్ వేర్పాటువాద రాజకీయం! ఓట్ల కోసం తెలుగుజాతిని విభజించిన పార్టీగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తాజాగా ముస్లిం ఓట్ల కోసం వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో పట్టు సాధించిన టీఆర్ఎస్ హైదరాబాద్‌లో మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయింది. హైదరాబాద్‌లో ప్రతి అడుగులోనూ విస్తరించి వున్న సీమాంధ్రుల కారణంగా టీఆర్ఎస్ హైదరాబాద్‌లో పట్టు సాధించడం కలలో మాట. అందుకే కేసీఆర్ ముస్లింలను తనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా హైదరాబాద్‌పై రాజకీయంగా పట్టు సాధించాలని పథకరచన చేశారు.

 

కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల స్థిరాస్తులపై కన్ను వేశారు. సీమాంధ్రులకు చెందిన అనేక భవనాలను కూలగొట్టించారు. అయితే కేసీఆర్ హైదరాబాద్‌లోని ఆస్తులను ధ్వంసం చేయరాదని గ్రేటర్ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. అది కేసీఆర్ విధ్వంసకాండకు బ్రేకు వేసింది. రాబోయే ఎన్నికలలో హైదరాబాద్ కార్పొరేషన్‌ని కూడా సొంతం చేసుకున్న పక్షంలో హైదరాబాద్‌లో తన ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేయవచ్చని కేసీఆర్ భావించారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఓటర్లు దక్కకపోయినా ముస్లిం ఓట్లు దక్కించుకుంటే తాను హైదరాబాద్‌పై పట్టు సాధించవచ్చని ఆలోచించారు.

 

ఈ ఏడాది డిసెంబర్‌లో రాబోతున్న హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. దానికోసం భారతదేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే వ్యాఖ్యలు చేయడానికి కూడా టీఆర్ఎస్ నాయకులు వెనుకడుగు వేయడం లేదు. మజ్లిస్‌ని కాకా పట్టడం, ముస్లింని ఉప ముఖ్యమంత్రిని చేయడం, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇఫ్తార్ విందుల్లో పాల్గొని హామీలు ఇవ్వడం, పాకిస్థాన్ కోడలు అయిన సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం... ఇవన్నీ ఓట్ల రాజకీయాలలో భాగమే! మరాఠీ తండ్రికి 1989లో జన్మించి, పాకిస్థానీని పెళ్ళి చేసుకుని, దుబాయ్‌లో స్థిరపడి సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎలా అవుతుందో కేసీఆర్‌కే తెలియాలి.

 

అయితే వీటన్నిటినీ రాజకీయ ఎత్తులు, పైఎత్తుల్లో వేసే పాచికలుగా భావించి ఊరుకోవచ్చు. అయితే ముస్లిం ఓట్లను సాధించడం కోసం దేశ సమగ్రతకే భంగం కలిగే వ్యాఖ్యలు చేయడం మాత్రం క్షమార్హం కాదు. అలాంటి దేశద్రోహపూరిత వ్యాఖ్యలు చేయడానికి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎంపీ కవిత ఒడిగట్టారు. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ని భారతదేశం దురాక్రమించిందని అనడం, కాశ్మీర్‌ను వదులుకోవడానికి, అంతర్జాతీయ సరిహద్దులు మార్చుకోవడానికి భారతదేశం సిద్ధపడాలని ఆమె చెప్పడం చాలా దారుణం. కరడుగట్టిన వేర్పాటువాద తత్వానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం.

 

పాకిస్థాన్‌కి అనుకూలంగా వున్న ఈ వేర్పాటువాద వ్యాఖ్యలు ముస్లింలను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి చేసినవి మాత్రమే కాదు.. దేశంలో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడానికి కూడా చేసిన వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తోంది. ఓట్ల కోసం వేర్పాటువాద ప్రకోపాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్‌ని దేశభక్తిపరులైన ముస్లింలు ఎంతమాత్రం నమ్మరు. టీఆర్ఎస్ నాయకులు తాము చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యాన్ని త్వరలో చెల్లించుకోక తప్పదు!