మోడీ ఆహ్వానిస్తే కేంద్రమంత్రిగా చేరేందుకు రెడీ: కవిత

 

నిన్న మొన్న దాక మోడీ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని...మోడీ గీడీ జాన్తానై...అంటూ హూంకరించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హటాత్తుగా తన పల్లవి మార్చేసి స్వచ్ఛ భారత్... స్వచ్చ తెలంగాణా...స్వచ్చ హైదరాబాద్...అంటూ మోడీ ప్రవేశపెట్టిన పధకాలన్నిటినీ భుజానికి ఎత్తుకోవడం ప్రజలకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నా, అదంతా తన కుమార్తె కవితమ్మకు కేంద్రమంత్రి పదవి ఇప్పించుకోనేందుకేనని ప్రతిపక్షాలు తేల్చిపడేశాయి. కానీ వారివన్నీ ఒట్టి ఊహాగానాలే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదని నిన్న మొన్నటి వరకు వాదించిన కవితమ్మ ఇప్పుడు “మంత్రివర్గంలో చేరమని మోడీ ఆహ్వానిస్తే దాని గురించి ఆలోచిస్తామని” శాస్త్రోక్తంగా ప్రకటించేశారు. అంటే ప్రతిపక్షాలు చెప్పిందే నిజమేనని స్పష్టమవుతోంది.

 

అదే నిజమయితే త్వరలో తెరాస కూడా ఎన్డీయే కూటమిలో చేరడం ఖాయమని భావించాల్సి ఉంటుంది. లేకుంటే కవితమ్మను కేంద్రమంత్రిగా చేయవలసిన అవసరం ఎన్డీయేకి లేనేలేదు. కానీ, తెరాసను ఎన్డీయే కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తే, ప్రస్తుతం తెరాస ప్రభుత్వంపై వీర పోరాటం చేస్తున్న తెలంగాణా బీజేపీ నేతలు అందుకు అంగీకరిస్తారా? వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు తెలంగాణా రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుదామని కలలు కంటున్న బీజేపీ, ఇప్పుడు కవితను ప్రభుత్వంలోను, తెరాసను ఎన్డీయే కూటమిలో చేర్చుకొన్నట్లయితే అప్పుడు రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఏమిటి? ఒకవేళ తెలంగాణలో తెరాసతో పొత్తులు పెట్టుకొంటే అప్పుడు తెదేపాతో తెగతెంపులు చేసుకొంటుందా? తెగ తెంపులు చేసుకొంటే తెలంగాణాలో తెదేపాను వ్యతిరేకిస్తూ, ఆంధ్రాలో దానితో పొత్తులు కొనసాగించడం సాధ్యమేనా? అనే ప్రశ్నలకు బీజేపీ అధిష్టానం సమాధానం ఆలోచించవలసి ఉంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu