కేసీఆర్ వారసుడు ఎవరు? కె.టీ.ఆర్. లేక హరీష్ రావు?

 

ఈనెల 24వ తేదీన హైదరాబాద్, లాల్ బహద్దూర్ స్టేడియంలో తెరాస ప్లీనరీ సమావేశాలు చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెరాస అధికారంలోకి మొట్ట మొదటిసారి జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు కనుక రాష్ట్రం నలుమూలల నుండి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష పదవికి జరుగబోయే ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంచనప్రాయమే.

 

కానీ ఈసారి జరుగబోయే ప్లీనరీ సమావేశాలలో కేసీఆర్ కుమారుడు కె.తారక రామారావుని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధికారిక కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం తగినంత సమయం కేటాయించలేకపోతున్నందున, ఆ బాధ్యతలు తన కుమారుడికి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సమావేశాలలో కేసీఆర్ తన కుమారుడు కె.తారకరామారావునే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించినట్లయితే, అతనే తన వారసుడని ప్రకటించినట్లే భావించవచ్చును. కానీ అదే జరిగితే ఆయన తన మేనల్లుడు హరీష్ రావు కంటే కుమారుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లువుతుంది.

 

నీటి పారుదల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న హరీష్ రావు తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టును చాలా సమర్ధంగా నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకొన్నారు. హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడయిన డా. రాజయ్యను చాలా అవమానకరంగా మంత్రిపదవిలో నుండి తప్పించినందుకు ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్లీనరీ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు తారక రామారావుకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లయితే హరీష్ రావుకి ఇక పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఎప్పటికీ మూడవ స్థానానికే పరిమితం కావలసి ఉంటుంది. మరి దీనిని ఆయన జీర్ణించుకోగలరో లేదో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu