కాంగ్రెస్, వైకాపా, తెరాసలు కూటమిగా ఏర్పడనున్నాయా?

 

ఇంతకాలం వైకాపా, తెరాసాలు ఒకదాని ప్రసక్తి మరొకటి తేకుండా చాలా జాగ్రత్త పడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఒకదాని పరిధిలోకి మరొకటి ప్రవేశించలేదు. కనుక ఇంతవరకు ఒకరి వల్ల మరొకరికి ఎటువంటి సమస్యలు లేవు, సవాళ్లు లేవు. కనుక ఇంతకాలం వారి స్నేహం బాగానే సాగిపోయింది. కానీ ఇప్పుడు జగన్ తనకు బాగా అచ్చివచ్చిన షర్మిలాస్త్రాన్ని తెలంగాణా మీదకి అంటే తెరాస మీదకి సందించారు. అయినప్పటికీ ఆ బాణం ఎవరినీ గాయపరచకుండా తెలంగాణాలో తమ పార్టీ పరిస్థితి ఏమిటో అంచనా వేసుకొని వెనక్కి తిరిగి వచ్చేసింది.

 

అదేవిధంగా కేసీఆర్ కానీ తెరాస నేతలు గానీ ఎవరూ కూడా ఆమె యాత్రపై కిమ్మనలేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా లో ఓదార్పు యాత్రకి వచ్చినప్పుడు ఆయన రైల్లోంచి కాలు క్రిందపెట్టడానికి కూడా ఒప్పుకోని తెరాస, ఇప్పుడు షర్మిల యాత్రకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అసలు ఆమె వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా గమనించనట్లు ఊరుకొన్నారు. ఆమెను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తే బహుశః ఆమె పరామర్శ యాత్రకు అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని భావించి ఊరుకోన్నారేమో తెలియదు. అదేవిధంగా షర్మిల కూడా తెలంగాణా ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయకుండా సమస్యలున్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని చిన్న విజ్ఞప్తి చేసి వచ్చేసారు.

 

ఆ రెండు పార్టీల ఈ తీరు గమనిస్తే, తెలంగాణాలో తెదేపా, బీజేపీలను ఎదుర్కొనేందుకు మున్ముందు కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాయేమోననే అనుమానంగా ఉంది. రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగు ఇక బాగుపడే అవకాశాలు కనుచూపుమేర కనబడటం లేదు కనుక అది కూడా తప్పనిసరిగా తమతో చేతులు కలపవచ్చని, అప్పుడు తెదేపా-బీజేపీలను ఎదుర్కోవడం తేలికవుతుదని వారు భావిస్తున్నారేమో. మళ్ళీ త్వరలో మొదలయ్యే పరామర్శ యాత్రలో కూడా తెరాస, వైకాపాలు ఇదే తీరుగా వ్యవహరించినట్లయితే ఈ అంచనాలు నిజమని నమ్మవచ్చును.