తెలంగాణా అంశం తెరాస బలహీనతగా మారిందా?
posted on: Sep 11, 2014 1:52PM
.jpg)
తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు తెరాస ప్రతీ ఎన్నికలలో తెలంగాణా అంశాన్ని ప్రధానంగా లేవనెత్తి దానితో ముడిపడున్న సున్నితమయిన ప్రజల భావోద్వేగాలను తట్టి లేపడం ద్వారా దానినొక బలమయిన ఆయుధంగా వాడుకొంటూ తమ ప్రత్యర్ధులపై పైచేయి సాధించేది. అప్పటికి తెలంగాణా రాష్ట్రం ఏర్పడనందున ప్రజలు కూడా తెరాస చేస్తున్నఈ వాదనను ఎన్నడూ తప్పు పట్టలేదు. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడు నెలలు పైనే అయినప్పటికీ, కేసీఆర్ తో సహా తెరాస నేతలందరూ కూడా మెదక్ లోక్ సభకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో కూడా తెలంగాణా అంశాన్నే వాడుకోవడం చూస్తుంటే అది అధికార తెరాస పార్టీకి బలంగా కాక ఒక బలహీనతగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక ఇంతవరకు కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు లేదా చేయబోతున్నట్లు దృడంగా నమ్ముతున్నారు. తను నమ్మడమే కాకుండా పార్టీని, ప్రజలను కూడా నమ్మమని కోరుతున్నారు. అటువంటప్పుడు, తన మాటలను, చేతలను ప్రజలు విశ్వసిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి దొరికిన ఈ అద్భుత అవకాశాన్ని ఆయన ఎందుకు జారవిడుచుకొంటున్నారో, మళ్ళీ తెలంగాణా అంశం ఎత్తుకొని ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికలలో గెలవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేసీఆరే చెప్పాలి. గత మూడు నెలలుగా తమ ప్రభుత్వం సాధించిన లేదా ఇకపై సాధించబోతున్న గొప్పకార్యాల గురించి చెప్పుకొని, తమ మూడు నెలల పాలనపై ఈ ఉప ఎన్నికలలో ప్రజల తీర్పు కోరి విజయం సాధించగలిగితే తెరాసకు, తెలంగాణా ప్రభుత్వానికి కూడా చాలా గౌరవప్రదంగా ఉండేది.
తెలంగాణావాదం ఉపయోగిస్తూ ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో తెరాస గెలిచినట్లయితే, అప్పుడు ‘ఇది తమ మూడు నెలల పరిపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు’ అని కేసీఆర్ తో సహా తెరాస నేతలందరూ చెప్పుకోకుండా ఉండరు. తెరాస అవలంభిస్తున్న ఈ ద్వంద వైఖరి వలన ఆ పార్టీ రాజకీయంగా లబ్ది పొందగలదేమో కానీ ఈ విధంగా ప్రతీ ఎన్నికలలో కూడా తెలంగాణా అంశం వాడుకోవడం దాని బలహీనతకు అద్దం పడుతోందని చెప్పవచ్చును.



.jpg)
.jpg)

.webp)



