అపాయింటెడ్ డే విషయంలో టీఆర్ఎస్ హడావిడి ఇందుకే...
posted on: May 6, 2014 1:02PM
.jpg)
తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. జూన్ 2 అపాయింటెడ్ డే విషయంలో స్టే ఇవ్వలేమని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. ఇక జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడటం ఖాయం. అయినప్పటికీ టీఆర్ఎస్‌లో ఏదో టెన్షన్ వుంది. అపాయింటెడ్ డేని జూన్ 2న కాకుండా మే 16 వ తేదీకి మార్చాలని కొత్త పాట అందుకుంది. ఎన్నికల ప్రక్రియ మే 15వ తేదీతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజుకే అపాయింటెడ్ డేట్ వుండాలని టీఆర్ఎస్ అంటోంది. ఈ మేరకు హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పదిహేను రోజులకు అపాయింటెడ్ డేట్ వుంటే నష్టమేంటి? వచ్చిన తెలంగాణని ఎవరైనా లాక్కెళ్తారా? తెలంగాణని ఎవరూ లాక్కెళ్ళరుగానీ, అధికారాన్ని మాత్రం తమ చేతుల్లోంచి కాంగ్రెస్ పార్టీ లాక్కెళ్తుందని టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు. ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం వుందని టీఆర్ఎస్ నాయకులు నమ్ముతున్నారు. అలాగే సర్వేల స్పెషలిస్టు అయిన లగడపాటి రాజగోపాల్ కూడా తెలంగాణ కుర్చీ టీఆర్ఎస్‌దేని తేల్చి చెప్పాడు. ఇన్ని అనుకూల అంశాలున్నా టీఆర్ఎస్ అసాయింటెడ్ డే ముందుకు జరపాలని హడావిడి చేస్తున్నది ఎందుకంటే, కాంగ్రెస్ బారి నుంచి తప్పించుకోవడానికే. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి, కొత్త రాష్ట్రం ఏర్పడటానికి మధ్య 17 రోజుల వ్యవధి వుంది. ఈ వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాజకీయాలైనా చేయగలదు. టీఆర్ఎస్‌ని చీల్చే అవకాశాలు కూడా వున్నాయి. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగల సత్తా వున్న కాంగ్రెస్ పార్టీకి 17 రోజులు దొరికాయంటే టీఆర్ఎస్‌ని కకావికలు చేసి, అధికారం చేజిక్కించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కాంగ్రెస్‌కి అంత టైమ్ ఇవ్వకుండా మే 16నే అపాయింటెడ్ డేట్ వుండేలా చేసి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.





.webp)

.webp)


