Top Stories

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..రోడ్లపై భారీ వరద

  హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.. అన్ని ప్రధాన రోడ్లమీదకి వరద నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు.. రాత్రి వరకు వర్షం ఇదే మాదిరిగా పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమ యిపోయినాయి.. అమీర్పేటలోని మైత్రివనం అమీర్పేట మెట్రో స్టేషన్ కిందిభాగం పూర్తిగా నాలుగు అడుగుల వరకు వరద నీరు చేరిపోయింది.. దీంతో పాటు సారధి స్టూడియో పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వరద నీరు వచ్చి చేరింది.. నాంపల్లి జూబ్లీహిల్స్ లోని పలు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది.. మరోవైపు పలు మల్లెపల్లి చౌరస్తాలోని పలు కాలనీలు నీట మునిగి పోయాయి.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో భారీ చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్థంగా మారిపోయింది..అలాగే  నాంపల్లి స్టేషన్ రోడ్ లోని కమత్ హోటల్ లోకి  వర్షపు నీరు చేరు కుంది.హోటల్ లో లంచ్ చేయడానికి వచ్చిన  కస్టమర్లు వరద నీరు చూసి షాక్ అయ్యారు.ఈ భారీ వర్షానికి నాంపల్లి గాంధీభవన్ పక్కన ఉన్న సాయి కృప అపార్ట్మెంట్ లోకి భారీగా వరదనీరు చేరుకుంది.కొన్ని ప్రాంతాల్లో అయితే 10 సెంటీమీటర్ల వర్షం నమోదయింది.. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతం మొత్తం కూడా బీభత్సం అయిపోయింది.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..రోడ్లపై భారీ వరద Publish Date: Aug 4, 2025 6:59PM

జగన్ సెక్యూరిటీలో సొంత సైన్యం... క్యాడర్ కోసమే అంటున్న నేతలు

  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది. ఇప్పటికే పదిమంది రిటైర్డ్ ఆర్మీని జగన్ పెట్టుకున్నారు. అలాగే జెడ్ ప్లస్ కేటగిరి లో 58 మంది సిబ్బంది తో రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు భద్రత ఏర్పాటు చేస్తోంది. జగన్ సెక్యూరిటీలో మార్పులు ఎల్లుండి డోన్ పర్యటన నుంచి అందుబాటులోకి రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.  అయితే జగన్‌పై ఎవరైనా దాడి చేస్తారన్న నేపథ్యంలో కాకుండా.. వైసీపీ కార్యకర్తల దృష్ట్యా సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తొంది. అయితే జనగ్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు ఆయన దగ్గరకు ఎక్కువ సంఖ్యాలో రావడంతో.. కార్యకర్తల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సెక్యూరిటీ జగన్ పర్యటనల్లో ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటుందని వైసీపీ అభిప్రాయ పడుతుంది. మరోవైపు జగన్ పర్యటనల్లో టీడీపీ ప్రభుత్వం సరైనా శాంతిభద్రత కలిగించక పోవడం వల్లే సొంత సెక్యూరిటీని నియమించున్నామని వైసీపీ నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం జగన్‌కు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫేల్ అవుతోందని విమర్శిస్తున్నారు. అయితే.. జగన్ ఇది వరకు చేసిన పర్యటనల్లో హెలిప్యాడ్ పై వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేయడం, రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోవడం వంటి అంశాల దృష్ట్యా జగన్ కు వైసీపీ అధిష్టానం ప్రైవేట్ సెక్యూరిటీ నియమించినట్లు తెలుస్తోంది.
జగన్ సెక్యూరిటీలో సొంత సైన్యం... క్యాడర్ కోసమే అంటున్న నేతలు Publish Date: Aug 4, 2025 6:47PM

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్ పర్సన్‌గా ఉపాసన నియామకం

  తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ లో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ, అభివృద్ధి తదితర అంశాలఫై దృష్టి సారిస్తారు.   సభ్యులుగా విటా డానీ (డానీ ఫౌండేషన్), మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సన్ నెట్ వర్క్స్ సిఇఓ కావ్య మారన్,  సి. శశిధర్ (విశ్వ సముద్ర), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్), రవికాంత్ రెడ్డి (వాలీబాల్), బైచుంగ్ భూటియా (ఫుట్ బాల్), అభినవ్ బింద్రా (షూటింగ్), క్రీడల శాఖ అధికారులు బి. వెంకట పాపారావు,  ఇంజేటి శ్రీనివాస్ లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.  తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ కో చైర్మన్ ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ప్రపంచంలో తెలంగాణ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి చైర్ పర్సన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్ పర్సన్‌గా ఉపాసన నియామకం Publish Date: Aug 4, 2025 6:15PM

రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం : మంత్రి మండిపల్లి

  ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ‘శ్రీ శక్తి’ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ ఇలా మొత్తం 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 1,950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు.  ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీములు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకాన్నికి మహిళలు మొగ్గు చూపారు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికయినా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్‌లలో కూడా ఈ పథకం అమలులో ఉటుందని మంత్రి స్పష్టం చేశారు.  
 రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం : మంత్రి మండిపల్లి Publish Date: Aug 4, 2025 5:45PM

కాళేశ్వరం నివేదికపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

  కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు. అది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ పేర్కొన్నారు. కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చుని భయపడవద్దని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం పనికిరాదు అన్న వాడు అజ్ఞాని..  ప్రాజెక్టుపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు.  కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం కంటే ముందే మీడియాకు లీకు కావడం చర్చనీయాంశమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను నిర్మించారు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం ఈ ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్ విచారణ జరిపింది. చివరకు జులై 31వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఆగస్టు 1వ తేదీన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.   
కాళేశ్వరం నివేదికపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు Publish Date: Aug 4, 2025 5:14PM

సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు. 374 పరుగల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక దశలో  సునాయాసంగా విజయం సాధిస్తుందా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ధారాళంగా పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. హ్యారీ బ్రూక్, జోరూట్ లు సెంచరీలతో చెలరేగడంతో 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించేస్తుందని అంతా భావించారు. అయితే జోరుమీదున్న ఇంగ్లాండ్ కు ప్రసిద్ధకృష్ణ, మహ్మద్ సిరాజ్ లు కళ్లెం వేశారు. ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట ముగించిన ఇంగ్లాండ్.. నాలుగు వికెట్లు చేతిలో ఉండటంతో అలవోకగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు పదునైన బంతులతో ఇంగ్లాండ్ దూకుడుకు కళ్లెం వేశారు.  ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ జెమీ స్మీత్  ఓవర్టన్ లను సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. జోష్ టంగ్ ను ప్రసిద్ధ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గాయంతో బాధపడుతున్న క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ దశలో ఇంగ్లాండ్ కు విజయానికి 17  పరుగులు అవసరం. గాయంతో ఉన్న వోక్స్ కు స్ట్రైక్ ఇవ్వకుండా అట్కిన్సన్ ఓవర్ కీప్ చేస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు. ఓ సిక్సర్ బాదిన అట్కిన్సన్ ఇంగ్లాండ్ విజయంపై ఆశలను పెంచేశాడు. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన స్థితిలో అట్కిన్సన్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేసి ఇండియాకు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు.  స్కోర్లు.. ఇండియా తొలి ఇన్నింగ్స్  224, రెండో ఇన్నింగ్స్ 396 ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 247, రెండో ఇన్నింగ్స్ 367 ఫలితం ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం  నాలుగు వికెట్లను 29 పరుగులకే కూల్చేసింది.  
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్ Publish Date: Aug 4, 2025 5:01PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సచివాలయ ఉద్యోగులు, శాఖాధిపతులకు వర్తించనుందని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు అమరావతికి వచ్చారు. వారికి కొంత హెచ్‌ఆర్‌ఏ పెంచి ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. అమరావతి పరిధిలో నివసించే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. ఆ వసతి సౌకర్యాన్ని మరో ఏడాది తాజాగా పొడిగించింది. ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాద్‌లో ఉండడం.. ఉద్యోగులు మాత్రమే అమరావతిలో ఉంటుండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ Publish Date: Aug 4, 2025 4:44PM

ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం.. సిరీస్ సమం

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు. 374 పరుగల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక దశలో సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించింది. అయితే ఇండియన్ పేసర్లు  మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు ఇంగ్లాండ్ కు కళ్లెం వేశారు. మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు పగడొట్టి ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్నారు. ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులతో  ఉన్న ఇంగ్లాండ్.. చివరి రోజు నాలుగు వికెట్లు చేతిలో ఉండగా  35 పరుగులు చేస్తే చాలు అన్న స్థితిలో చివరి రోజు ఆట మొదలైంది. అయితే ఎక్కడా పట్టు వదలని టీమ్ ఇండియా చివరి నాలుగు వికెట్లను 29 పరుగులకే కూల్చేసింది.  
ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం.. సిరీస్ సమం Publish Date: Aug 4, 2025 4:41PM

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం..నలుగురికి సీరియస్

  అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో  ప్రమాదం చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు అప్రమత్తమై అస్వస్థతకు గురైన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదంలో లూపిన్ ఫార్మా యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిలో సాయి షిఫ్ట్ ఇంచార్జ్, గణేష్ కెమిస్ట్, రాఘవేంద్ర, నాయుడులను షీలా నగర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.    
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం..నలుగురికి సీరియస్ Publish Date: Aug 4, 2025 4:15PM

బీఆర్ఎస్ నుంచి కవితకు ఉద్వాసన?

భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కవితను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని గట్టిగా చెబుతున్నారు.  తాజాగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కవితకు ఉద్వాసన చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి జగదీశ్వరెడ్డిని ఉద్దేశించిన లిల్లీపుట్ వ్యాఖ్యలతో  కవిత  లక్ష్మణ రేఖను పూర్తిగా దాటేశారని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా కవిత  కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా, జగదీశ్ రెడ్డిపై ప్రత్యక్షంగా చేసిన వ్యాఖ్యల తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జగదీశ్ రెడ్డి, కేటీఆర్ లు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు జరిగిన ఈ భేటీలో  కవితకు ఉద్వాసన చెప్పాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ బయటపెట్టినట్లు చెప్పారు.  కవిత ఇటీవల జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన లిల్లీపుట్ వ్యాఖ్యలు పార్టీలో పెను సంచలనానికి తెరలేపాయి. తెలంగాణ ఉద్యమంతో కానీ, బీఆర్ఎస్ తో కానీ జగదీశ్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని? కవిత ప్రశ్నించారు.  ఆయన ఓ లిల్లీపుట్ నాయకుడంటూ దుయ్యబట్టారు. తానెవరో తెలియకుండానే ఇంత కాలం బీఆర్ఎస్ లో ఉన్నారా అంటూ నిలదీశారు.  అలాగే మరో నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డిపై కూడా విమర్శల వర్షం కురిపించారు.  వీళ్లంతా పార్టీలో చేరి పదవులు అనుభవించి ఇప్పుడు తనపై విమర్శలు చేసే స్థాయికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   అక్కడితో ఆగని కవిత.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపైనా పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  పార్టీలోని అగ్ర స్థాయిలో ఉన్న నేతలు తన కార్యకలాపాలపై నిఘా పెట్టారని పరోక్షంగా కేటీఆర్, హరీష్ రావులపై ఆరోపణలు గుప్పించారు.   ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్లు పలువురు కవితపై చర్య తీసుకోవాలని కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. కవిత తీరు వల్ల పార్టీకి తీవ్ర నష్టంవాటిల్లోతోందని వివరించారనీ, దీంతో ఆమెకు ఉద్వాసన పలకడమే మేలని కేసీఆర్ కూడా చెప్పారనీ పార్టీ వర్గాలు అంటున్నాయి.  కేసీఆర్ త్వరలోనే ఆమెకు పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతారని అంటున్నారు.  
బీఆర్ఎస్ నుంచి కవితకు ఉద్వాసన? Publish Date: Aug 4, 2025 4:10PM

లిల్లీ పుట్ వ‌ర్సెస్ చెల్లీపుట్!

తొమ్మిదో తేదీ రాఖీ పండ‌గ వ‌స్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మ‌రంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా క‌విత మరిన్ని అస్త్రాలు సంధించ‌డంతో గులాబీ ద‌ళాలు మ‌రింత‌ నీర‌స‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిలాంటి వారి చేత త‌న‌ను తిట్టించ‌డం వెన‌క పెద్ద నాయ‌కుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్.  నేను ఎవ‌రా? నేనెవ‌రో తెలీకుండానే జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఇన్నాళ్లూ పార్టీలో ఉన్న‌డా? అంటూ నిలదీయడమే కాకుండా.. జగదీశ్ రెడ్డిని   లిల్లిపుట్ అంటూ సంబోధించి..   త‌న అక్కసు మొత్తం తీర్చుకున్నారు కల్వకుంట్ల కవిత.  ఇప్ప‌టికే కాళేశ్వ‌రం మీద సిట్ వేస్తారన్న  వార్త‌లు విన‌వ‌స్తున్నాయ్. అసెంబ్లీలో చ‌ర్చ‌కు ఆస్కార‌ముంది. మూడ్రోజుల పాటు స‌భ పెట్టి స‌భ్యులంద‌రికీ నివేదిక ఇచ్చి సిట్ వేయ‌డ‌మా?  చ‌ర్చ‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డ‌మా? అన్న‌ది తేల్చ‌నున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేల‌ను అభిప్రాయం అడిగి తెలుసుకోనున్నారు. అస‌లేం జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కు తెలిసేలా స‌భ‌లో స‌మ‌గ్ర చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.  ఒకప‌క్క తండ్రి ప‌రువు ఈ స్థాయిలో పోతుంటే.. త‌న‌య దానిని అడ్డుకోవ‌ల్సింది  పోయి.. రోజుకో ర‌చ్చ‌. దీంతో ప్ర‌త్య‌ర్ధులు దించే గున‌పాల‌న్నా బలమైన గాయాలు తగులుతున్నాయి కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు అంటున్నారు. ఇంటి మ‌నిషైన క‌విత వెన‌క నుంచి అనుకోని స‌మ‌యంలో అనుకోని విధంగా దించుతున్న ఈ గున‌పాల నొప్పి మ‌రింత ఎక్కువ‌గా ఫీల‌వుతున్నార‌ట అధినేత కేసీఆర్.  ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. త‌న త‌ర్వాత అంత‌టి  స్థాయిలో త‌న‌ కొడుకు కేటీఆర్ ఈ పార్టీకి కాబోయే రాజు ప్ర‌స్తుత యువ‌రాజు. అలాంటి యువ‌రాజు ప‌ట్ల క‌నీసం గౌర‌వ మ‌ర్యాద‌లు చూప‌కుండా క‌విత పరోక్షంగా చేస్తున్న కామెంట్లు కేసీఆర్ కి గ‌ట్టిగానే త‌గులుతున్న‌ట్టు స‌మాచారం. ఒక స‌మ‌యంలో చంద్రబాబులా తాను కూడా ఒక్క‌డ్నే క‌ని ఉంటే ఈ గొడ‌వ‌లే లేక పోయేవ‌ని ఫీల‌వుతున్నార‌ట పెద్ద సారు. అంత‌గా క‌విత సూటి పోటి మాట‌లు ఆయన గుండెల్లో  స‌లుపుతున్నాయట. ఇంకో స‌స్పెన్స్ ఏంటంటే వ‌చ్చే రాఖీ పండ‌క్కి సోద‌రి త‌న సోద‌రుడికి రాఖీ క‌డుతుందా క‌ట్ట‌దా? ఇదొక చ‌ర్చ  న‌డుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆమె కేటీఆర్ కేంద్రంగా అనేక కామెంట్లు చేసి ఉన్నారు. ఈ క్ర‌మంలో అన్న‌కు చెల్లె రాఖీ క‌డ‌త‌దా క‌ట్ట‌దా? అన్న చ‌ర్చ కూడా పార్టీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్న‌ట్టు స‌మాచారం.    ఇక తాజా క‌బ‌ర్ విష‌యానికి వ‌స్తే త‌న‌ను క‌విత లిల్లీ పుట్ అన్న విష‌యంపై చ‌ర్చించ‌డానికి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ కి వ‌చ్చారు. త‌న ఉద్య‌మ ప్ర‌స్తానం గురించి తెలీకుండా పార్టీని జిల్లాలో నాశ‌నం చేశాడంటూ ఆమె తిట్ట‌డంపై కేసీఆర్ తో క‌ల‌సి చ‌ర్చించేలా తెలుస్తోంది.
లిల్లీ పుట్ వ‌ర్సెస్ చెల్లీపుట్! Publish Date: Aug 4, 2025 3:47PM

హైదరాబాద్‌లో కుండపోత వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో రోడ్లులన్నీ జలమయం అయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ, పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
హైదరాబాద్‌లో కుండపోత వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్ Publish Date: Aug 4, 2025 3:45PM

కేసీఆర్ మరోసారి చండీయాగం..మోక్షం కలిగేనా?

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చండీయాగం చేయాలని నిర్ణయించారు. నేటి నుంచి ఎల్లుండి వరకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఈయాగం చేయనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కవిత వ్యవహారం, రాజకీయ ప్రతికూల వాతవరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడు నెలలుగా పార్టీ అంతర్గత సమస్యలతో గులాబీ బాస్ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది.  కీలక నేతలతో మాట్లాడుతున్నట్లు ఆయన ఏ మాట బయటకు చెప్పలేదని అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలను క్షుణ్ణంగా వింటున్నారట. ఏ మాట బయటపెడితే ఎలాంటి సమస్యలు వస్తాయోనని భావించి సైలెంట్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో చండీయాగం చేపట్టారని అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై కవిత నేటి నుంచి 72 గంటలపాటు నిరాహార దీక్షకు దిగుతున్నారు.  అన్ని గంటలపాటు కేసీఆర్ చండీయాగం చేస్తున్నారు.  దీనివెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది  ప్రత్యర్థులు నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. పార్టీలో ప్రతికూల పరిస్థితి కాళేశ్వరం కమీషన్ విచారణ, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసుల కారణంగా పండితుల సూచన మేరకు అధినేత చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 15 మంది ఋత్వికులు కేసీఆర్‌, శోభ దంపతులు ప్రధాన కర్తలుగా యాగాన్ని నిర్వహించనున్నారు.
కేసీఆర్ మరోసారి చండీయాగం..మోక్షం కలిగేనా? Publish Date: Aug 4, 2025 3:26PM

2014-19 కాలంలో బెస్ట్ ఎంపీ ఎవరో తెలుసా?

సాధారణంగా, ఏ పార్టీ అయినా  పార్టీకి కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే లేదా ఎంపీని ప్రోత్సహిస్తుంది. పదవులిచ్చి గౌరవిస్తుంది. అసెంబ్లీలో,  లోక్ సభలో స్వేచ్ఛగా మాట్లాడి పార్టీ గొంతు, రాష్ట్ర సమస్యలు వినిపించడానికి అవకాశాలు ఇస్తుంది.  అయితే.. వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. ఆ పార్టీ  ఎకో సిస్టమే వేరు.  ఆ పార్టీలో నేతలకు దక్కే ప్రాధాన్యత పూర్తిగా అధినేత జగన్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. పనితీరు ప్రతిభ అన్నవి ఈ పార్టీలో ఎందుకూ కొరగావు. అందుకే 2014-2019 మధ్యలో ఉత్తమ పనితీరు కనబరిచిన  ఎంపీగా గుర్తింపు పొందిన  రఘు రామ కృష్ణరాజు వైసీపీలో వేధింపులకు గురయ్యారు. అన్యాయంగా అరెస్టై కస్టోడియల్ టార్చర్ ను అనుభవించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఔను సభలో హాజరు, సభలో ప్రజాసమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం గళమెత్తిన నేతలకు ర్యాంకింగ్ ఇచ్చే పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే ఏజెన్సీ తాజాగా 2014 -2019 మధ్య కాలంలో ఉత్తమ పనితీరు కనబరిచిన లోక్ సభ సభ్యుడిగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తిగా రఘురామకృష్ణం రాజును గుర్తించింది.  2014 - 2019 మధ్య కాలం అంటే ఏపీలో జగన్ అధికారంలో ఉన్న కాలం. ఆ కాలంలో రఘురామకృష్ణం రాజు వైసీపీ ఎంపీ అన్న సంగీతి తెలిసిందే. ఆ ఐదేళ్లూ రఘురామకృష్ణం రాజు లోక్ సభలో వంద శాతం హాజరుతో దేశంలోని ఎమ్మెల్యేలందరి కన్నా ముందు వరుసలో ఉన్నారు. అలాగే ప్రజా సమస్యలు లేవనెత్తడం, వారి పరిష్కారం కోసం గళమెత్తడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.   పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది.  అటువంటి రఘురామకృష్ణం రాజును వైసీపీ నానా విధాలుగా వేధించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారంటూ ఇబ్బందులకు గురి చేసింది. చివరకు నాలుగేళ్ల పాటు ఆయన తన నియోజకవర్గానికి, కనీసం ఆంధ్రప్రదేశ్ కు రావడానికి అవకాశం లేకుండా చేసింది. అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేసింది. ఆ వేధింపులు భరించలేక.. రఘురామకృష్ణం రాజు 3034 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి.. తెలుగుదేశం గూటికి చేరి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.  
2014-19 కాలంలో బెస్ట్ ఎంపీ ఎవరో తెలుసా? Publish Date: Aug 4, 2025 3:22PM

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన..ఎందుకంటే?

  సీఎం రేవంత్‌రెడ్డికి హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన  కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ క్రీడా రంగ అభివృద్ధికి ఉద్దేశించిన  ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ... సీఎం రేవంత్ కు థ్యాంక్స్ చెప్పారు.  సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి, క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కు ధన్యవాదాలు తెలిపారు. క్రీడారంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025'ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను రూపొందించింది.
సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన..ఎందుకంటే? Publish Date: Aug 4, 2025 2:52PM

బీఆర్ఎస్ పై నేతల్లో తొలగుతున్న భ్రమలు.. కుటుంబ కలహాల ప్రభావం

తెలంగాణ రాజకీయాల్లో  ఒక వెలుగు వెలిగిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందా?  పార్టీ పరిస్థితి, మనుగడపై ఆ పార్టీ  రాష్ట్ర స్థాయి నాయకుల్లోనే గందరగోళం నెలకొందా?  అంటే బీఆర్ఎస్  శ్రేణులే ఔనంటున్నాయి. అధికారం కోల్పోయిన తరువాత  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఏదో అప్పుడప్పుడు ఎర్రవల్లి వచ్చిన నాయకులతో చిట్ చాట్ నిర్వహించడం తప్ప ఆయన పార్టీ వ్యవహారాలలో కానీ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కానీ క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. పార్టీ కార్యక్రమాలన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఇక్కడే పార్టీ నాయకుల్లో విభేదాలు, అసంతృప్తులు మొదలయ్యాయి. కేటీఆర్, కవిత మధ్య అంతరం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయితే వీటి పరిష్కారంపై కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చివరకు తన కుమార్తె,  ఎమ్మెల్సీ కవిత పార్టీలో పరిస్థితిపై లేఖరాసినా కేసీఆర్ స్పందించక పోవడంతో..  కొందరు ఆ లేఖ ను లీక్ చేశారు. దీంతో కేసీఆర్ సంతానం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రచ్చకెక్కయి. ఈ నేపథ్యంలోనే కవిత జిల్లాల పర్యటనలు చేశారు. ఈ పర్యటనల్లో తాము పాల్గొనాలా వద్దా అనే విషయంపై అధినేత కేసీఆర్ నుంచి అనుమతి కోసం ప్రయత్నిస్తే.. ఆయన  కేటీఆర్ ను సంప్రదించమని చెప్పి చేతులెత్తేశారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు అన్నీ కేటీఆర్ చేతుల్లోకి వెళ్లాయి. దీనిపై పార్టీలోని కొందరు అసంతృప్తితో ఉన్నారు. అందరినీ కలుపుకుని పోకుండా  కేటీఆర్ కొందరికే అందుబాటులో ఉండటంపై మెజారిటీ నాయకులు అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ కు చెప్పలేక సతమతమవుతున్నారు. కేటీఆర్ శైలి  నచ్చక వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు చూసుకొని పార్టీలో కొనసాగాలా లేక వైదొలగాలా అనే మీమాంసలో ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కూడా జిల్లాల్లో నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. ఈ పరిణామాలన్నీ పార్టీని గందరగోళంలో పడేస్తున్నాయి.
బీఆర్ఎస్ పై నేతల్లో తొలగుతున్న భ్రమలు.. కుటుంబ కలహాల ప్రభావం Publish Date: Aug 4, 2025 2:46PM

అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా

  తెలంగాణ శాసన సభ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. సభాపతి గడ్డం ప్రసాద్‌ను కలవడానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం శాసనసభ కార్యాలయానికి వెళ్లింది. అయితే స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల శాసన సభ్యులను డిస్‌క్వాలిఫై చేయాలని నినానాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.  కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నాను కవర్‌ చేయకుండా మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. శాసనసభ ఆవరణలో మీడియా ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. మీడియా ప్రతినిధులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.  
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా Publish Date: Aug 4, 2025 2:22PM

యెమెన్‌లో ఘోర విషాదం.. సముద్రంలో పడవ బోల్తా.. 68 మంది మృతి

సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో  68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు.  ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది. యెమెన్‌ వద్ద సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు.  12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.   54 మృతదేహాలు ఖాన్ఫర్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చాయి. మరికొన్ని మృతదేహాలు వేరే ప్రాంతంలో కనిపించాయి. వీటిని మార్చురీకి తరలించారు. గల్లంతైన  74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా..  ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన వలసదారులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు పనుల కోసం వెడుతుంటారు. స్మగ్లర్లు వారిని పడవల ద్వారా రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ల మీదుగా అరబ్ దేశాలకు తరలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పడవల్లో  సామర్థ్యానికి మించి వలసదారులను  ఎక్కించుకుంటూ ఉంటారు. ఓవర్ లోడ్ కారణంగా ఆ పడవలు తరచూ  ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. పెద్ద సంఖ్యలో వలసదారులు చనిపోతూ ఉంటారు. గత కొన్ని నెలల్లోనే వందల మంది వలసదారులు పడవ బోల్తా  ఘటనల్లో చనిపోయారు. మార్చి నెలలో ఏకంగా నాలుగు బోట్లు బోల్తా పడ్డాయి.  186 మంది గల్లంతయ్యారు. ఈ విషయాలను ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్   వెల్లడించింది.
యెమెన్‌లో ఘోర విషాదం.. సముద్రంలో పడవ బోల్తా.. 68 మంది మృతి Publish Date: Aug 4, 2025 1:38PM

రాష్ట్రపతి ముర్ముతో మోడీ, షా వరస భేటీల వెనక మర్మమేంటి??

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒకే రోజున గంటల వ్యవధిలో భేటీ కావడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి వరుస భేటీల వెనక కారణాలు తెలియనప్పటికీ గంటల వ్యవధిలోనే ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి..  ప్రధాని నరేంద్ర మోదీ వరసగా రెండు రోజులు అంటే శని, ఆది(ఆగష్టు 2, 3) వారాలలో రాష్ట్రపతితో భేటీ అయ్యారు.   అలాగే..   ఆదివారం (ఆగష్టు 3) ప్రధాని, హోం మంత్రి అమిత్ షా వెంట ఒకరు రాష్ట్రపతితో సమావేశమైన తర్వాత కాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ  కూడా రాష్రపతితో  భేటీ అయ్యారు.  అలాగే..  ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గత రెండు రోజులో ఎన్డీఏ భాస్వామ్య పక్షాల నాయకులతో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం  అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినాయకుడు నితీష్ కుమార్  తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరో వంక జులై 21న మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల  12 వరకు జరగనున్నాయి. ఇటీవలే ఆపరేషన్‌ సిందూర్‌పై ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది.  ఈ నేపథ్యంలో  కేంద్ర  ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం ఏదో తీసుకోనుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్త మవుతున్నాయి. ప్రధాని, హోంమంత్రిులు గంట వ్యవధిలో ఒకే రోజు వేర్వేరుగా రాష్ట్రపతితో భేటీ ఆ అనుమానాలకు మరింత బలం చేకూరేలా చేసింది. అయితే..  రాష్ట్రపతితో ప్రధానమంత్రి, హోంమంత్రి సమావేశాల వెనుక గల కారణాలు ఏమిటన్నది తెలియక పోయినా,  ఉమ్మడి పౌర  స్మృతి (యుసీసీ) వంటి కీలక నిర్ణయం తీసుకోవచ్చనీ అందుకే  ప్రధాని, హోం మంత్రితో పాటుగా ఉన్నతాధికారులు రాష్ట్రపతితో భేటీ అయ్యుండవచ్చనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే..  ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవుల పర్యటనల అనంతరం ప్రధాని లాంఛనంగా మాత్రమే  రాష్ట్రపతితో ప్రధాని సమావేశం అయ్యారనీ,  అదే విధంగా  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా నేపధ్యంలో సెప్టెంబర్ 9న  ఉప రాష్ట్ర పతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ రాష్టపతిని స్వయంగా కలిసి ఆ వివరాలను తెలియచేసి ఉండవచ్చని అంటున్నారు. కాగా..  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఉప రాష్ట్రపతి పదవికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్  పేరు ఇంచు మించుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే రాష్ట్రపతి  ద్రౌపతి ముర్మతో సమావేశం అయి ఉంటే ,ఆది సాధారణ సమావేశం అనుకోవచ్చును కానీ..  ప్రధాని ఆ వెంటనే హోమ్ మంత్రి .. ఆతర్వాత కాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీలు కూడా రాష్ట్రపతితో సమావేశం కావడంతో ఏదో జరగబోతోందన్న వ్యుహాగానాలు వినిపిస్తున్నాయి.  
రాష్ట్రపతి ముర్ముతో మోడీ, షా  వరస భేటీల వెనక  మర్మమేంటి?? Publish Date: Aug 4, 2025 1:23PM

బీహార్ టు త‌మిళ‌నాడు.. ఓట‌ర్ల మార్పు చేర్పుల గొడ‌వేంటి?

బీహార్ లో 65 ల‌క్ష‌ల ఓట్లు గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదంలో  ఉంటే..  త‌మిళ‌నాడులో ఆరున్న‌ర ల‌క్ష‌ల ఓట్లు కొత్త‌గా వ‌చ్చి చేరాయ‌ట‌. ఈ ఓట్లు ఎక్క‌డివాని చూస్తే ఇవి వ‌ల‌స వ‌చ్చిన వారివిగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యం అని ప్ర‌శ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎంపీ, మాజీ మంత్రి చిదంబ‌రం. ఎందుకంటే వ‌ల‌స వ‌చ్చిన‌ వాళ్ల‌కు ఇక్క‌డేం జ‌రుగుతుందో తెలీదు. ఇక్క‌డి రాజ‌కీయాలు అస‌లే ప‌ట్ట‌వు. వారిది త‌మ‌దీ వేరు వేరు భావ‌జాలాలు. అలాంటి భావ‌జాలం సూటు కాని వారు ఇక్క‌డ క‌నీసం ఇల్లూ వాకిలీ కూడా లేకుండా... ఓటు హ‌క్కు పొంద‌డం అంటే అది ఇక్క‌డి రాజ‌కీయాల‌ను తీవ్ర ప్ర‌భావితం చేయ‌డ‌మేనంటున్నారు చిదంబరం.  ఇప్పుడు కొత్త‌గా న‌మోదు చేసిన ఈ ఓట‌ర్ల‌కు బీహార్ రాజ‌స్థాన్ వంటి ప్రాంతాల్లో ఖ‌చ్చితంగా సొంతిల్లు ఉంటుంది. ఎక్క‌డ సొంతిల్లుంటే అక్క‌డ వారికి ఓటు హ‌క్కు ఉన్న‌ట్టు లెక్క‌. అలాంటి హ‌క్కును వాడుకోవ‌ల్సింది పోయి.. ఇలా ఇక్క‌డే ఉన్నారు క‌దాని వారికి ఓటు హ‌క్కు క‌ల్పించ‌డమేంటి? అన్న‌ది చిదంబ‌రం ప్రశ్న.  ఈ విష‌యంపై ఆయ‌న సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్  చేశారు. ఈసీపై మ‌నం రాజ‌కీయంగానే కాదు, చ‌ట్ట ప‌రంగానూ పోరాడాల్సి ఉంద‌ని అన్నారు. ఇక డీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఒక‌రు.. అవును ఇది స‌మంజ‌సం కాదు. ఈ ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.  ఇక బీహార్ ప‌రిస్థితి చూస్తే తమిళనాడుకు పూర్తి భిన్నంగా ఉంది.  ఇక్క‌డ చివ‌రి ఓట‌రు జాబితా ప‌రిశీల‌న జ‌రిగింది 2003లో. ఆ త‌ర్వాత జ‌ర‌గ‌నే లేదు. అందువ‌ల్ల అప్ప‌టి ఓట‌ర్లు ఇప్పుడెవ‌రున్నారో తెలీద‌ని చెబుతోంది ఈసీ. కొంద‌రు వీరిలో చ‌నిపోయిన వారు కూడా ఉన్నార‌ని.. దీంతో వీరంద‌రినీ తొల‌గించాల్సి ఉంద‌నీ చెబుతోంది. అలాగే బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన వారు కూడా ఇక్క‌డి ఓట‌ర్ల‌లో క‌ల‌గ‌ల‌సి పోయార‌నీ..  8 కోట్ల ప్ర‌జ‌లున్న బీహార్ అంటే జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే రాష్ట్రం. కాబ‌ట్టి తామీ విష‌యం ఒక సవాలుగా తీసుకుని ప‌ని చేస్తున్న‌ట్టు ఈసీ చెబుతోంది.  అయితే ఈ విష‌యం మీద ఇటు ఆర్జేడీ వంటి పార్టీల‌తో పాటు పౌర సంఘాలు కూడా కోర్టుల‌కెక్కాయి. అయితే సుప్రీం కోర్టు స‌ర్ గా పిలిచే ఈ స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ కి సుప్రీం అనుమ‌తించింది. అంతే కాదు.. డాక్యుమెంటేష‌న్ విధానం స‌రిగా అమ‌లు చేయాల‌ని సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మీ ఐడీ కార్డుల‌ను చూపించి ఓటర్ల జాబితాలో చోటు ద‌క్కించుకోవాల‌ని అంటోంది. అది సాధ్యం కాని ప‌ని. గ్రామీణ బీహార్ లో చాలా వ‌ర‌కూ స‌రైన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు లేని వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీరి ఓటు హ‌క్కు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇలా జ‌రుగుతుంద‌ని తాము అస్స‌లు ఊహించ‌లేద‌ని మండి ప‌డుతున్నాయి ప్ర‌జా సంఘాలు. కార‌ణం ఇలా నిరూపించుకోవాలంటే కొంద‌రికి సాధ్య‌మ‌య్యే పనే కాదు. ఎందుకంటే ఇప్ప‌టికీ కుల, ఆదాయ వంటి సాధార‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలే స‌రిగా ఇవ్వ‌డం లేదు. వారొక ప‌క్క ఇవ్వ‌క- వీరొక ప‌క్క తీసుకోలేక మీ పౌర‌స‌త్వం నిరూపించుకున్నాకే మీకు ఓటు అంటారు. త‌ర్వాత దేశ బ‌హిష్క‌ర‌ణ చేస్తారంటూ తీవ్ర స్థాయిలో మండి పుడుతున్నారు పౌర సంఘాల నేత‌లు.  తాజా ప‌రిస్థితులేంట‌ని చూస్తే ఆర్జేడీ యువ‌నేత తేజ‌స్వీయాద‌వ్ కి ఈసీ నోటీసులు జారీ చేసింది. మీరు ఓట‌రు జాబితాలోంచి తొల‌గించామ‌ని చెబుతున్న కార్డు ఈసీ జారీ చేసిందికాదంటూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆయ‌న‌కే రివ‌ర్స్ లో కౌంట‌ర్ వేసింది. దీంతో ఈ నెల 8న ఇండియా కూట‌మి ఈసీ వ‌ద్ద‌కు ర్యాలీ తీయ‌నుంది.  ఇక రాహుల్ గాంధీ సైతం శ‌నివారం పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 70 నుంచి వంద స్థానాల వ‌ర‌కూ ఎన్డీయే గెలిచే ఛాన్సే లేద‌ని అన్నారాయ‌న‌. మోడీ కూడా స‌రైన మెజార్టీతో గెల‌వ‌లేదు. 15 సీట్ల తేడాతో అస‌లు ఎన్డీయే తిరిగి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని బాంబు పేల్చారు రాహుల్. మ‌రి చూడాలి ఈ ఓట్ల గొడ‌వ ఎక్క‌డ తేలుతుందో .
బీహార్ టు త‌మిళ‌నాడు.. ఓట‌ర్ల  మార్పు చేర్పుల గొడ‌వేంటి? Publish Date: Aug 4, 2025 12:46PM

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. సరిగ్గా టేకాఫ్ కు ముందు గుర్తించిన వైనం

ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం టేకాఫ్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యం అయ్యింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు సాంకేతిక లోపం బయటపడింది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి భట్టు దేవానంద్ వంటి ప్రముఖులు ఉన్నారు. విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. విమాన ప్రయాణం అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సినట్లుగా పరిస్థితి తయారైందం
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. సరిగ్గా టేకాఫ్ కు ముందు గుర్తించిన వైనం Publish Date: Aug 4, 2025 12:37PM

ఒక ప్ర‌స్తానం ముగిసింది.. గురూజీ శిబూ సొరేన్ ఇక లేరు!

గురూజీ అని అంద‌రి చేత ప్రేమగా పిలిపించుకునే జార్ఖండ్ ముక్తి మోర్చా వ్య‌వ‌స్థాప‌కుడు శిబూసోరెన్ ఇక లేరు. 81 ఏళ్ల వ‌య‌సులో వృద్దాప్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.  ఈ విష‌యాన్ని జార్ఖండ్ సీఎం, శిబుసొరేన్ త‌న‌యుడు, హేమంత్ సొరేన్ త‌న‌ ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియ చేశారు.  దిశోమ్ గురూజీ మ‌న‌ల్ని విడిచి వెళ్లిపోయారు. ఇవాళ త‌న‌కంతా శూన్యంగా క‌నిపిస్తోంద‌ని త‌న పోస్టు లో తీవ్ర విషాదం వ్య‌క్తం చేశారాయ‌న‌. జార్ఖండ్ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో, గిరిజ‌న స‌మ‌స్య‌ల పోరాటంలో, మ‌డ‌మ తిప్ప‌ని పోరాట యోధుడిగా.. శిబుసోరెన్ కి పేరుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న 8 సార్లు లోక్ స‌భ కు, రెండు సార్లు రాజ్య స‌భకు ఎన్నికైన శిబుసొరేన్ ,  జార్ఖండ్ సీఎంగా ఎన‌లేని సేవ‌లందించారు.  చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున మ‌ద్ధ‌తునిచ్చిన శిబుసొరేన్ తెలంగాణ‌కు సైతం ఆత్మీయులే. ఈ విష‌యం ప్ర‌స్తావిస్తూ త‌న నివాళి తెలియ చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. వ‌డ్డీ  వ్యాపారుల ఆగ‌డాలను అరిక‌ట్ట‌డంలో, మాద‌క ద్ర‌వ్యాల వ్యాపారుల‌పై పోరు స‌ల‌ప‌డంలో శిబుసోరెన్ త‌న‌దైన ముద్ర‌వేశార‌ని అన్నారు సీఎం రేవంత్. ఆదివాసీ స‌మాజానికి శిబు సోరెన్ చేసిన మేలు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేమని పేర్కొన్నారు. జార్ఞండ్ సీఎం హేమంత్ సోరెన్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రేవంత్ రెడ్డి త‌న ప్ర‌గాఢ‌ సానుభూతి తెలిపారు. జార్ఖండ్ లోని గొడ్డలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ, తాను ఎంపీగా ఉన్న ప్రాంతం గురూజీ ప్రాంతమే. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన ఆలోచనలతో ఎవరికైనా ఇబ్బంది కలిగిన సందర్భం లేదు. శిబు సోరెన్‌తో కలిసి ఎంపీగా పనిచేసే అవకాశం చాలా ఏళ్లు లభించింది. ఆయన ఎల్లప్పుడూ మాకు మార్గదర్శనం చేశారు. గొప్ప నేతను కోల్పోయామ‌ని అన్నారు. 2020లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత శిబు సోరెన్ రాజకీయాల్లో అంత యాక్టివ్ గా కనిపించలేదు. అయితే, ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి నిరంతరం మార్గదర్శనం చేస్తూ వ‌చ్చారు. శిబు సోరెన్ వయసురీత్యా వచ్చే సమస్యలతో బాధపడటమే కాకుండా, కిడ్నీ సంబంధిత సమస్యల కూడా ఆయనను వేధించాయి.  గత కొన్నాళ్లుగా శిబు సోరెన్ వీల్ చైర్ కే పరిమితమయ్యారు. జెఎంఎం జాతీయ సమావేశంలో కూడా ఆయన వీల్ చైర్లోనే వచ్చారు. శిబుసొరేన్ లోటు పూడ్చ‌లేనిదనీ, శిబు సొరేన్ లాంటి  మార్గ‌ద‌ర్శి గురువు త‌మ‌ను విడిచి వెళ్ల‌డం  పూడ్చలేని లోటని సాధార‌ణ ప్ర‌జ‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. ఆయ‌న‌కు  ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు.
ఒక ప్ర‌స్తానం ముగిసింది.. గురూజీ శిబూ సొరేన్ ఇక లేరు! Publish Date: Aug 4, 2025 12:14PM

కలెక్టర్ దంపతుల సైకిల్ సవారీ

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు సైకిల్ పై ప్రయాణించారు. జిల్లా కేంద్రమైన మెదక్ నుంచి అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని రామాయంపేట వరకూ సైకిళ్లపై ప్రయాణించి వచ్చారు.  రామాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులను పరామర్శించారు. అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు.  కలెక్టర్ దంపతులు మెదక్ నుంచి రామాయంపేట  వరకూ సైకిళ్లపై రావడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యకరం అన్న సందేశం చాటేందుకే వారు సైకిల్ పై 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చారని తెలుస్తోంది.  
కలెక్టర్ దంపతుల సైకిల్ సవారీ Publish Date: Aug 4, 2025 11:57AM

అమెరికా బ్లాక్ మెయిలింగుకి తలొగ్గని భారత్!

భారత్, రష్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా  బెదిరింపు అస్త్రాలు సంధిస్తూనే ఉంది. రష్యాను ఏకాకిని చేయాలనో? లేక భారత్‌ను తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనో? కారణం ఏదైతేనేం అమెరికా అధికార ప్రతినిధులు ఒకరి తర్వాత మరొకరు భారత్ కు హెచ్చరికలు  జారీ చేస్తూనే ఉన్నారు. భారత్, రష్యా చమురు వాణిజ్యం, అమెరికా టారిఫ్‌లు, ఒత్తిడి వ్యూహాలు ఇప్పుడు గ్లోబల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా భారత్, రష్యాతో చమురు కొనుగోలు విషయంపై ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అమెరికాకు అసలు నచ్చుతున్నట్టు కనిపించడం లేదు. ఈ కారణంగా ట్రంప్ సీనియర్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ కూడా తాజాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆర్థిక సహాయం చేస్తోందని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలని ట్రంప్ గట్టిగా చెప్పారని మిల్లర్ అన్నారు. భారత్, రష్యా నుంచి చమురు కొంటూ ఈ యుద్ధానికి ఫైనాన్స్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాని  విషయమని స్టీఫెన్ మిల్లర్ ఓ మీడియా షోలో పేర్కొన్నారు. అంతేకాదు.. భారత్, రష్యా నుంచి చమురు కొనే స్థాయి చైనాతో సమానంగా ఉందని, ఇది చాలా షాకింగ్ విషయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూలై 30న ట్రంప్ భారత్‌పై పాతిక శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొంటున్నందుకు భారత్‌ను టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు..  భారత్, రష్యాలు  డెడ్ ఎకానమీస్ అని వ్యాఖ్యానించారు. భారత్ రష్యాతో ఏం చేసినా పట్టించుకోనని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోకపోతే.. రష్యా చమురు కొనే దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ  భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనడం ఆపే సూచనలు కనిపించడం లేదు. భారత ప్రభుత్వ వర్గాలు రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.  2021లో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్‌లో కేవలం 3 శాతం చమురు మాత్రమే రష్యా నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు అది  35-40 శాతానికి పెరిగింది. అయితే స్టీఫెన్ మిల్లర్ ట్రంప్, మోడీ సంబంధాల గురించి ప్రస్తావించారు. ట్రంప్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన సంబంధం ఉందని గుర్తు చేశారు. ఈ స్నేహపూరిత వ్యాఖ్యల సంగతి పక్కనపెడితే..   చమురు వాణిజ్యం విషయంలో అమెరికా ఇండియాపై ఒత్తిడి పెంచే విషయంలో    అస్సలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నది. అదే సమయంలో భారత్ కూడా అమెరికా ఒత్తిడికి ఇసుమంతైనా తలొగ్గేందుకు సిద్ధంగా లేదు. 
అమెరికా బ్లాక్ మెయిలింగుకి తలొగ్గని భారత్! Publish Date: Aug 4, 2025 11:21AM

కేసీఆర్ ఫామ్ హౌస్ లో చండీయాగం..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చండీయాగం నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో సోమవారం (ఆగస్టు 4) నుంచీ ఆగస్టు 6 వరకూ చండీయాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.   మొత్తం 15 మంది ఋత్వికులు కేసీఆర్ దంపతులు   కర్తలుగా యాగాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉండటం,  కాళేశ్వరం విచారణ, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తు తదితర అంశాలతో కేసీఆర్, బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో  పండితుల సూచన మేరకు కేసీఆర్‌ చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తం మీద కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చండీయాగం నిర్వహించ తలపెట్టడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, సంచలనంగా కూడా మారింది. 
కేసీఆర్ ఫామ్ హౌస్ లో చండీయాగం.. Publish Date: Aug 4, 2025 11:01AM

ఫిర్ ఏక్ బార్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ !

పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని, సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టమైన గడవు విధించిన నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్మరక్షణలో పడిందా? అందుకే ఏదో విధంగా ఈ గండం నుంచి కట్టేక్కేందుకు వ్యూహాలు రచిస్తోందా? మళ్ళీ మరోమారు  ఆపరేషన్ ఆకర్ష్  పై దృష్టిని కేంద్రీకరించిందా? అంటే  హస్తం పార్టీ  వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం  ఉచ్చు నుంచి తప్పించుకునేదుకు  అవసరమైన మేరకు మరింత మంది బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు మరోమారు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  అయితే, ప్రస్తుతానికి అది కూడా ఒక ఆప్షన్ గా మాత్రమే పార్టీ నాయకత్వం భావిస్తోందంటున్నారు.   పార్టీ ఫిరాయించిన పెద్దలను కాపాడేందుకు  అదొక్కటే మార్గం అని మాత్రం అనుకోవడం లేదని  అంటున్నారు. అయితే..  ప్రస్తుత రాజీకీయ వాతావరణంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేంతటి  సాహసం చేస్తారా?  తెలంగాణ రాజకీయాల్లో అనిశ్చితి పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ప్రస్తుత సమయంలో  తాత్కాలిక ప్రయోజనాల కోసం  ప్రలోభాలకు లొంగి రాజకీయ భవిష్యత్ ను ఫణంగా పెట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాహసిస్తారా? అంటే రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు.  అదలా ఉంటే..  ప్రస్తుత లెక్కల ప్రకారం  బీఆర్ఎస్. శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనం చేసుకోవాలంటే మరో 16మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేయవలసి ఉంటుంది.  గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్  39 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే.. 2024లో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్  సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జూబ్లీ హిల్స్ ఎమ్మల్యే మాగంటి చనిపోవడంతో ఆ సీటు ఖాళీగా వుంది. ఇక పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. అదలా ఉంటే, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీ ఫిరయిస్తేనే  అనర్హత వేటు నుంచి తప్పించుకోగలరు. కాదంటే  వేటు పడుతుంది. ఆ లెక్కన, అనర్హత వేటు తప్పాలంటే, మరో 16 (మొత్తం 26) మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరవలసి ఉంటుదని అంటున్నారు.   ఇప్పుడున్న పరిస్థితిలో ఒకేసారి 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే కాంగ్రెస్ నాయకులు అదెంత పని చిటికేస్తే పోలో మంటూ వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ గా ఉన్నారని అంటున్నారు.  నిజానికి  సుప్రీం కోర్టు తీర్పు కోసం  కాంగ్రెస్ నాయకత్వం, ఆపరేషన్ ఆకర్ష్  కు చిన్న విరామం ఇచ్చిందే తప్ప  శాశ్వతంగా చుక్కపెట్టలేదని  అంటున్నారు. నిజానికి..  గతంలోనే పీసీసి అధ్యక్షుడు  మహేష్ కుమార్ గౌడ్ ఆపరేషన్ ఆకర్ష్ ఒక నిరంతర ప్రక్రియ.. ఎప్పుడూ ఆగదని చెప్పారు.  ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా పార్టీలోకి వస్తానంటే తీసుకుంటాం..  అందులో తప్పేముందని అన్నట్లు చెపుతున్నారు. అయితే..  విశ్వసనీయ సమాచారం ప్రకారం,ఆపరేషన్ ఆకర్ష్ పునరుద్దరణకు సంబంధించి, కాంగ్రెస్ పెద్దలు ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేను అనర్హత వేటు నుంచి తప్పించేందుకు  ఉన్న న్యాయపరమైన ప్రత్యామ్నాయాలపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించి..  మరో మార్గం లేనప్పుడు మాత్రమే ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగించాలని పార్టీ పెద్దలు అలోచిస్తున్నట్లు చెపుతు న్నారు.అయితే..  ఒక్క బీఆర్ఎస్ నుంచే కాదు, ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్  సిద్ధాంతాలు, రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చి వస్తామంటే.. గాంధీ భవన్ తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయని, పార్టీ పెద్దలు చెప్పడం కొసమెరుపు.
ఫిర్ ఏక్ బార్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ! Publish Date: Aug 4, 2025 10:45AM

కుంకీ ఏనుగులు పని మొదలెట్టేశాయ్!

ఆంధ్రప్రదేశ్ లో కుంకీ ఏనుగులు పని మొదలు పెట్టేశాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పంటపొలాలు, గ్రామాలపై ఏనుగుల గుంపు పడి విధ్వంసం సృష్టిస్తుండటం, కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా కలిగిస్తున్న నేపథ్యంలో ఏనుగుల బెడద నుంచి గ్రామాలను, పొలాలను కాపాడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో  కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించారు. ముఖ్యంగా ఏనుగుల బెడద చిత్తూరు జిల్లాను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కుంకీ ఏనుగులు తమ తొలి ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించాయి.   చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ గస్తీ నిర్వహించిన  కుంకీ ఏనుగులు పలమనేరు ప్రాంతంలో తిరుగుతున్న ఎనిమిది ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించాయి.  
కుంకీ ఏనుగులు పని మొదలెట్టేశాయ్! Publish Date: Aug 4, 2025 10:29AM

జార్ఖండ్ మాజీ సీఎం శిబూసొరేన్ కన్నుమూత

జార్ఖండ్ మాజా ముఖ్యమంత్రి శిబూ సొరేన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ( ఆగస్టు 4) ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ నెలలో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచీ ఆక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు హేమంత్ సొరేన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.   జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన శిబు సొరేన్..  ఆ లక్ష్య సాధన కోసమే జార్ఖండ్ ముక్తిమోర్జా పార్టీని స్థాపించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పని చేశారు. 2004 నుంచి 2006 వరకూ కేంద్ర మంత్రిగా పని చేశారు.   శిబు సోరెన్ మృతి పట్ల  జార్ఖండ్ ముఖ్యమంత్రి, శిబు సొరేన్ కుమారుడు హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  గురూజీ  మనను విడిచి వెళ్లారంటూ సామాజిక వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. తన తండ్రి మరణంతో తాను శూన్యంలో ఉన్నానని పేర్కొన్నారు.  
జార్ఖండ్ మాజీ సీఎం శిబూసొరేన్ కన్నుమూత Publish Date: Aug 4, 2025 10:16AM

కేంద్ర మంత్రి గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు కాల్ వచ్చింది.ఆదివారం (ఆగస్టు 3) గుర్తు తెలియని అగంతకుడి నుంచి గడ్కరీ నివాసంలో బాబు పెట్టినట్లు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు.   వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ గడ్కరీ నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు. అయితే బెదరింపు కాల్ చేసిన అగంతకుడి ఆచూకీ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.   కాల్ వచ్చిన  ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు గంటల వ్యవధిలోనే బెదరింపు కాల్ చేసిన వ్యక్తి ఆచూకీ కనుగొన్నాయి. బెదరింపు కాల్ చేసిన నాగ్‌పూర్‌లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్‌ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.  
కేంద్ర మంత్రి గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు Publish Date: Aug 4, 2025 10:01AM

 జామకాయ మధ్యలో విత్తనాలు తినకుండా పడేస్తుంటారా ? దిమ్మ తిరిగే నిజాలివి..!

  జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. యాపిల్ పండులో ఉండే పోషకాలకు సమానమైన పోషకాలు ఉండటం వల్ల,  యాపిల్ పండు కంటే తక్కువ ధరలో దొరకడం వల్ల జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. జామపండు పోషకాల నిధి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జామపండు మధ్యలో విత్తనాల భాగం అంటే చాలామందికి నచ్చదు.   ఈ విత్తనాల భాగాన్ని తొలగించి కండ భాగాన్ని తింటుంటారు.  అయితే జామపండులో నిజమైన బలం దాని మధ్యలో ఉంటుందట. పరిశోధకులు దాని విత్తనాలపై పరిశోధన చేసి ఇందులో చాలా  శక్తి ఉంటుందని స్పష్టం చేశారు.  దీని  గురించి తెలుసుకుంటే.. జామ గింజలు ఎందుకు పారేస్తారు? కిడ్నీలో రాళ్లు వస్తాయనే భయంతో చాలా మంది జామ గింజలను పారేస్తుంటారు. కానీ జామ విత్తనాల గురించి చేసిన పరిశోధనలు చాలా షాకింగ్ ఫలితాలను వెల్లడించాయి. ప్రయోజనాలు.. జామ గింజలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రమాదకరమని నిరూపించే ALT,  AST ఎంజైమ్‌ల స్థాయిలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది . జామ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి ఇవి పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు  వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడతాయి. అంటే జామ పండ్లను బాగా తినేవారికి వృద్దాప్యం తొందరగా రాదు. జామ గింజల్లో కాల్షియం, జింక్, కాపర్ , ఫాస్పరస్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలకు చాలా అవసరం. లేకపోతే బలహీనత మొదలవుతుంది. ఇది తీవ్రంగా మారితే  బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. . ఈ వ్యాధిలో ఎముకలు చాలా బలహీనంగా మారతాయి, సులభంగా విరిగిపోతాయి. జామపండు మొత్తం ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది రెండు రకాల ఫైబర్‌లను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. సరైన జీర్ణక్రియ ఉంటే  ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, పైల్స్ మొదలైన సమస్యల ప్రమాదం దానికదే తగ్గుతుంది. ఈ లాభాలతో  పాటు శరీరానికి ప్రోటీన్ కూడా లభిస్తుంది. విత్తనాలను ఇలా కూడా.. జామ విత్తనాలను నేరుగా జామ పండుతో తినడం ఇష్టం లేకపోతే..  జామ విత్తనాలను పండు నుండి వేరు చేయాలి.  వీటిని ఎండబెట్టాలి.  తరువాత వీటిని దోరగా వేయించి నిల్వచేసుకోవాలి.  వీటిని అప్పుడప్పుడు తినవచ్చు. అంతే కాకుండా ఈ విత్తనాలను స్పైసీ పౌడర్ లా కూడా తయారుచేసుకుని తీసుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 జామకాయ మధ్యలో విత్తనాలు తినకుండా పడేస్తుంటారా ? దిమ్మ తిరిగే నిజాలివి..! Publish Date: Aug 4, 2025 9:30AM