నటి త్రిషకు కాబోయే భర్తకు బెదిరింపు కాల్స్

 

ప్రముఖ సినీనటి త్రిషకు కాబోయే భర్త వరుణ్‌మణియన్‌ తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ చెన్నైలోని తేనాంపేటలో గల పోలీసుస్టేషన్‌లో నిన్న ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజ్ ను తీసుకోమని త్రిష కోరినట్లు మీడియాలో ప్రచారం జరిగింది కానీ అవన్నీ ఒట్టి ఊహాగానలేనని కొట్టిపడేశారు. ఒకవేళ ఆయన అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే చంపేస్తామని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా ఆయనను బెదిరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది. సినీ తారలు రాజకీయాలు, క్రికెట్ రంగాలపై మోజు పెంచుకొని వాటిలో ప్రవేశించడం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఇక ఐ.పి.యల్. సంగతి చెప్పనే అక్కరలేదు. అనేకమంది బాలివుడ్ నటీనటులు, రాజకీయనాయకులు అందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా పేరుకి పేరు డబ్బుకి డబ్బు ఆర్జించాలని ఆరాటపడుతున్నారు.

 

నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు సినీ, వ్యాపార రంగాల నేపద్యం నుండి వచ్చిన త్రిష, వరుణ్‌మణియన్‌ కూడా ఐ.పి.యల్. మోజు పెంచుకొని ఉండి ఉంటే ఆశ్చర్యమూ లేదు. అది నేరమూ కాదు. కానీ ఐ.పి.యల్. ఫ్రాంచైజ్ కొనేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడమే ఆశ్చర్యంగా ఉంది. దానిని బట్టి ఐ.పి.యల్. వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో? దానికి ఎంత పోటీ ఉందో అర్ధమవుతోంది. ప్రజలను రంజింపజేయడానికి సృష్టించిన ఐ.పి.యల్. క్రికెట్ పోటీలలో ఇటువంటి అనారోగ్యకరమయిన ఆలోచనలు, ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరగడంతో క్రమంగా దాని ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పుడు అది ఒకరినొకరు చంపుకోనేంత వరకు వెళ్లిందంటే అది ఎంత దిగజారిపోయిందో, ఎంత వికృత స్థాయిలో జరుగుతోందో అర్ధమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu