ఈ ‘రవాణా’ కాష్ఠం చల్లారదా?



కరెక్టుగానే చదివారు.. రావణ కాష్ఠం కాదు..  రవాణా కాష్ఠం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు రవాణా కాష్ఠం అంటుకుంది. అది రావణ కాష్ఠంలా మండుతోంది. అది ఎప్పుడు చల్లారుతుందో, అసలు చల్లారుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. తమ రాష్ట్రంలో ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ వాహనలు పన్ను చెల్లించాలని అంటూ ఈ కాష్ఠాన్ని మొదట తెలంగాణ ప్రభుత్వమే రగిలించింది. తెలంగాణ ప్రభుత్వం రవాణా పన్ను వసూలు చేస్తున్నప్పుడు మేం మాత్రం ఎందుకు ఊరుకోవాలని అంటూ ఏపీ ప్రభుత్వం కూడా తమ సరిహద్దుల దగ్గర రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. దాంతో రెండు రాష్ట్రాల ప్రజలకు బాదుడు తప్పడం లేదు. ప్రజల సంగతి ఎలా వున్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఆదాయం సమకూరుతోంది.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య అర్ధ శతాబ్దానికి పైగా జరిగిన సంసారబంధం కారణంగా ఒక ప్రాంతం మరో ప్రాంతం మీద ఆధారపడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రాష్ట్రానికి పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుంటుంది కాబట్టి తమ రాజధానికి వెళ్ళడానికి తాము రవాణా పన్ను చెల్లించాల్సి రావడమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో వుంది. రాజధానికి వెళ్ళడానికి రవాణా పన్ను చెల్లించడం అనేది ఎంతవరకు సమంజసమో గౌరవనీయ న్యాయస్థానం చెప్పాల్సి వుంది.

మరి న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించేలోపు పన్ను వసూళ్ళు అయితే యథావిధిగా జరుగుతూనే వున్నాయి. ఈ రవాణా పన్ను కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. రవాణా పన్ను సాకు చెప్పి వ్యాపారులు అన్ని వస్తువుల ధరలనూ పెంచే ప్రమాదం వుందని అనుమానిస్తున్నారు. రవాణా పన్ను అనేది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇచ్చే మార్గంగా వుండొచ్చేమోగానీ, రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ విధానం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ రవాణా కాష్ఠం సాధ్యమైనంత త్వరగా చల్లారితే బావుండని కోరుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu