స్టాక్ మార్కెట్లలో రేపూ ట్రేడింగ్.. ఎందుకంటే
posted on: Jan 31, 2026 11:40AM

ఆదివారం అయినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్సీ, నిఫ్టీలు ఫిబ్రవరి 1న కూడా పూర్తి స్థాయిలో పని చేయనున్నాయి. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఆదివారం (ఫిబ్రవరి 1) కూడా రోజూ లాగే ఉదయం 9గంటల 15 నిముషాల నుంచీ సాయంత్రం మూడున్నర గంటల వరకూ ట్రేడింగ్ నిర్వహించనున్నాయని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారికంగా తెలిపింది.
అయితే ఈ ట్రేడింగ్ విషయంలో కొన్ని షరతులు ఉంటాయని వివరించింది. అవేమిటంటే.. జనవరి 30న కొన్న షేర్లను బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అంటే ఆదివారం (ఫిబ్రవరి 1)న విక్రయించడానికి వీలు ఉండదు. అలాగే ఫిబ్రవరి 1న కొన్న షేర్లు ఆ మరుసటి రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 2) విక్రయించడానికి అవకాశం ఉండదు. కాగా బడ్జెట్ ముందు ప్రవేశ పెట్టే ఆర్థిక సర్వేను ఇప్పటికే పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా విత్త మంత్రి నిర్మాలా సీతారామన్ రికార్డు స్థాయిలో 9వ సారి ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై అన్ని వర్గాలలో తీవ్ర ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉన్నాయి.






