మహానాడు వేదికపై చంద్రబాబు పక్కన ట్రాన్స్ జెండర్ ఎవరో తెలుసా?

posted on: May 28, 2026 4:06PM

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు పండుగలో ఎన్నో రాజకీయ సమీకరణాలు, భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. అయితే.. అన్నిటికంటే మిన్నగా.. మహానాడు రెండవ రోజు వేదికపై ఆవిష్కృతమైన ఒక అపురూప దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.  మహానాడు ముఖ్య వేదికపై చంద్రబాబు నాయుడి పక్కనే ఆసీనురాలైన ఆ ట్రాన్స్ జెండర్ పేరు  వర్షిణి.

మహానాడు సభ జరుగుతున్న సమయంలో, సాధారణంగా అగ్ర నాయకులు మాత్రమే ఉండే ఆ వేదికపై చంద్రబాబు నాయుడు వర్షిణిని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఎంతో ఆత్మీయంగా,  మాట్లాడారు.  చంద్రబాబు అంతటి  నాయకుడు తనతో   మాట్లాడుతూ, తన కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటుంటే వర్షిణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు   కనిపించాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సామాన్యులను, ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురయ్యే ట్రాన్స్ జెండర్  వర్గానికి చెందిన వారిని ఇంతగా గౌరవించడం చూసి సభికులు సైతం హర్షం వ్యక్తం చేశారు.  

ఇంతకీ ఈ వర్షిణి ఎవరు?  మహానాడు వేదికపైకి వచ్చే అవకాశం ఎలా దక్కిందనే విషయానికి వస్తే..  దీని వెనుక ఒక ఆదర్శవంతమైన కథ ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి  బరిలోకి దిగి,  మాజీ మంత్రి విడదల రజినిపై ఘన విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెట్టిన సరికొత్త ఫైర్‌బ్రాండ్ మహిళా నాయకురాలు గల్లా మాధవి పీఏ.  

గల్లా మాధవి సమాజంలో మార్పు కోసం ఒక సాహసోపేతమైన, అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ట్రాన్స్‌జెండర్ అయిన వర్షిణిని తన పర్సనల్ అసిస్టెంట్  (పీఏ)గా నియమించు కున్నారు. వర్షిణికి పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడి నాయకత్వం పట్ల ఎనలేని అభిమానం, అంకిత భావం ఉన్నాయి. తన పని పట్ల ఎంతో నిబద్ధతతో వ్యవహరించే వర్షిణి, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలవాలనే బలమైన కోరికను   ఎమ్మెల్యే గల్లా మాధవి వద్ద వ్యక్తం చేశారు. వర్షిణి కోరికను గౌరవించిన గల్లా మాధవి..  మహానాడు వేదికగా చంద్రబాబుతో వర్షిణి భేటీ అయ్యేలా సహకరించారు.  సమాజంలో వెనుకబడిన, వివక్షకు గురవుతున్న వర్గాలకు రాజకీయంగా మరియు సామాజికంగా సమాన గౌరవం దక్కినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని ఈ దృశ్యం నిరూపించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...