రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం

posted on: Apr 27, 2026 9:01PM

 

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా పెద్ద గోల్కొండ నుండి తుక్కుగూడ వైపు, ఔటర్ రింగ్ రోడ్  సమీప ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వాన స్థానికులను ఒక్కసారి గా ఉలిక్కిపడేలా చేసింది. కొద్ది నిమిషాల పాటు మంచు కురిసినట్టుగా తెల్లగా వడగండ్లు కురవడంతో రహదారులు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. వడగండ్ల పరిమాణం గణనీయంగా ఉండటంతో రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వాహనదారులు రోడ్డుపక్కనే ఆగి ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వర్షం తగ్గిన తర్వాత కూడా వడగండ్లు రాళ్లలా రహదారులపై అలాగే ఉండిపోవడంతో స్థానికులకు కొంతసేపు రాకపోకలు కష్టంగా మారాయి. వర్షం ఆగిపోయిన తర్వాత కూడా రోడ్లపై రాళ్లలా పేరుకుపోయిన వడగండ్లు , అలాగే చెట్ల కొమ్మలపై వడగండ్లు పువ్వు లాగా  కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యంతో ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రైతులు కూడా తమ పంటలపై ఈ వడగండ్ల వాన ప్రభావం పడిందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ వడగండ్ల వానతో ప్రజలు ఆశ్చర్యానికి గురవడంతో పాటు, వాతావరణ మార్పుల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు..

google-ad-img
    Related Sigment News
    • Loading...