నారా మాట.. కోర్టుతో ఏమొస్తది.. బోగస్ కు చెక్.. బేజారు బజార్.. టాప్ న్యూస్@7PM
posted on Dec 20, 2021 6:17PM
ఆడ పిల్లలంటే ఆట వస్తువులు కాదు.. స్త్రీలను గౌరవించాలి.. ఏ మహిళనూ అలా అవమానించకూడదంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరోక్షంగా వైపీసీ నాయకులకు చెంపపెట్టులాంటి హెచ్చరిక చేశారు. అసెంబ్లీలో భువనేశ్వరిపై అధికార పార్టీ నేతలు చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై ఆమె మొదటిసారి స్పందించారు. చాలా హుందాగా.. ఉన్నతంగా.. రియాక్ట్ అయ్యారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోనని.. తాను బాధ పడటం లేదని నారా భువనేశ్వరి అన్నారు.
---------
టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలను ఎత్తివేశారు. ESI స్కామ్‌లో అచ్చెన్నాయుడుకి ఇదివరకు హైకోర్టు బెయిల్ లభించింది. ACB కోర్టులో విచారణ ముగిసేవరకు దేశం విడిచి వెళ్లరాదని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అచ్చెన్నాయుడి విజ్ఞప్తి మేరకు కండిషన్‌ను హైకోర్టు ఎత్తివేసింది.
----
కోర్టుతో రాయలసీమకు వచ్చేదేమీ లేదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తే కూడా సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలవలేని పరిస్థితి, పరిశ్రమలు పెట్టాలంటే మనం ఏం అడుగుతామో అనే భయం పారిశ్రామికవేత్తలకు ఉందన్నారు. రాయలసీమకు న్యాయం చేయాలనిపిస్తే న్యాయ వ్యవస్థ పెట్టడంతో కాదు.రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నారు రఘురామ.
--------
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టికెట్ ధరల నియంత్రణపై జీఓ 35 రద్దు అందరికీ వర్తిస్తుందని ఏజీ తెలిపింది. గత విచారణలో పిటిషనర్లకు మాత్రమే ఈ జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైకోర్టుకి తెలిపింది. ధరల నియంత్రణపై కొత్త కమిటీ ఏర్పాటు, వివరాలు తెలియజేయడానికి ప్రభుత్వం హైకోర్టుని సమయం కోరింది
----
ఎవరెన్ని కష్టాలు పెట్టినా..నియోజకవర్గంలో అనగతొక్కాలని చూసినా అవమానాలు చేసినా, జగనన్న మీద అభిమానంతో జగన్ అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం సీతారామపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. సీఎం జగన్ అధికారంలోకి వస్తారని ప్రతిపక్ష నేత ఊహించి ఉండరన్నారు. వైయస్సార్ చనిపోయాక తమకు తిరుగుండదనుకున్నారని చెప్పారు.
-------
ఆహార భద్రత బాధ్యత కేంద్రానిదేనని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తమది గొంతెమ్మ కోర్కె కాదన్నారు. బీజేపీ నేతలవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రైతులకు రూ.50 వేల కోట్లు ఇచ్చామన్నారు. కిషన్‌రెడ్డి యాసంగి వడ్లను కొంటారా లేదో చెప్పాలన్నారు. బీజేపీ నేతల్ని గల్లాపట్టి నిలదీయాలని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
-------
తెలంగాణ వచ్చాక ఇక ఉద్యమాల అవసరం ఉండదనుకున్నాం కాని స్వయం పాలనలో రైతులు రోడ్ల మీద, కేసీఆర్ ఏసీ గదుల్లో నిద్రపోతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు వడ్ల కొనుగోలు సమస్య లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వచ్చాక వడ్ల సమస్య సృష్టించిదన్నారు.ధాన్యం కొనుగోలుకు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని మండిపడ్డారు
--------
ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే సరికొత్త టెస్టింగ్ కిట్ ను భారత వైద్య పరిశోధన మండలి ఆవిష్కరించింది. ఈ కిట్ ను, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డిబ్రూగఢ్ లోని ఐసీఎంఆర్ రీజనల్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది. దీనితో త్వరితగతిన ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే వీలుంది. కిట్ ను వాణిజ్య పంథాలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలను ఐసీఎంఆర్ ఆహ్వానిస్తోంది.
-----
ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేలా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. లోక్ సభలో విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ముక్తకంఠంతో ఆరోపించాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం వైఖరి ఉందని మండిపడ్డాయి.
-------
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో మళ్లీ టెన్షన్లు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు.. తమ స్టాకులను అమ్ముకుంటూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈరోజు మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,189 పాయింట్లు నష్టపోయి 55,822 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 371 పాయింట్లు కోల్పోయి 16,614కి దిగజారింది.
-----
యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 275 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 468 పరుగుల టార్గెట్ ను ఛేదించడానికి బరిలో దిగిన ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌటైంది. క్రిస్ వోక్స్ అత్యధికంగా 44 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో జై రిచర్డ్సన్ 5 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2, నాథన్ లైయన్ 2 వికెట్లు చేజిక్కించుకున్నారు.