Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టాలీవుడ్ చరిత్ర మారిపోనుందా!
posted on: Nov 12, 2016 9:32AM
.jpg)
మోదీ అంటే ఒకప్పుడు సినీవర్గాలకు ఓ ఆరాధన. సినీ సెలబ్రెటీలు అందరూ కూడా వీలు కుదిరినప్పుడల్లా మోదీని ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ ఇప్పుడు అదే సినిమా రంగానికి ఓ షాక్ ఇచ్చారు మోదీ. నల్లధనాన్ని ఒక్కసారిగా రద్దుచేయడంతో ముఖ్యంగా రెండు రంగాలు నష్టపోతాయని అంచనా వేస్తున్నారు. వాటిలో ఒకటి రియల్ ఎస్టేట్ కాగా మరొకటి సిని పరిశ్రమ.
ఒకప్పుడు సినీ పరిశ్రమకు పొలం డబ్బులో, వ్యాపారంలోని లాభాలో పెట్టుబడిగా ఉండేవి. మరికొందరు అంచలంచులుగా ఒకో మెట్టూ ఎక్కతూ నిర్మాత స్థాయిని చేరుకునేవారు. లేదా నటులే నిర్మాతలుగా మారేవారు. శ్రమ విలువ, జీవితం విలువల మీద అవగాహనకి తోడు, కళ మీద అభిరుచి కూడా ఉండటంతో ఇలాంటి నిర్మాతలు తీసిన చిత్రాలు పదికాలాలపాటు నిలిచేవిగా ఉండేవి. వాటిలో ఉన్న విలువల విషయంలో ఏమాత్రం రాజీ పడేవారు కాదు. అందుకే ఆనాటి నిర్మాతలైన బీ.ఎన్.రెడ్డి, రామానాయుడు, అక్కినేని వంటివారి గురించి ఇప్పటికీ చెప్పుకొంటూ ఉంటాం.
ఎప్పుడైతే సినిమా ఒక ఫక్తు వ్యాపారంగా మారిపోయిందో, అప్పటినుంచీ అది దిగజారడం మొదలైందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అక్రమంగా సంపాదించిన ఈజీమనీ, నల్లధనం సినిమాల్లోకి ప్రవహించడం మొదలుకాగానే విలువల వలువలు జారిపోయాయి. ఎలాగొలా రూపాయికి రూపాయి సంపాదించాలనే తపన పెరిగిపోయింది. జూనియర్ ఆర్టిస్టుగా పూట గడవనివారు సైతం నల్లధనానికి బినామీలుగా మారి నిర్మాతలైపోయారు. రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు, సారా వ్యాపారస్తులు.... నిర్మాతలుగా చెలామణీ అయ్యేందుకు తహతహలాడిపోయారు. ఫలితంగా లక్షల్లో ఉండాల్సిన వ్యాపారం కాస్తా కోట్లకి ఎగిసిపోయింది. కమెడియన్లకి సైతం లక్షల కొద్దీ పారితోషికాలు ఇచ్చేంత డబ్బు ప్రవహించింది. సినిమా సూపర్ హిట్టు అయితే మంచిదే, ఒకవేళ అట్టర్ ఫ్లాపై కోట్ల కొద్దీ నష్టం వచ్చినా... మరో పది సినిమాలు తీసేంత ధైర్యం ఈ నిర్మాతలకి ఉండేది. అలాగని ఇప్పటి తరంలో నిజాయితీగా సంపాదించిన డబ్బుతో సినిమా తీసేవారు లేరని చెప్పడం లేదు. కాకపోతే అలాంటివారం సంఖ్య నానాటికీ తగ్గిపోతోందన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని వాస్తవం.
ఇప్పుడు మోదీ దెబ్బకి కొన్నాళ్లపాటు నల్లధనం కరువైపోతుంది. కనీసం కోట్లు విసిరి సినిమా తీసేంత ధైర్యం బడాబాబులకి ఉండదు. దీంతో మరో పదేళ్ల పాటు టాలీవుడ్‌లో భారీ బడ్జెటు సినిమాలు తీయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించక తప్పదు. ఇలాంటి సమయంలో ప్రతిభ మీద ఆధారపడే చిన్న సినిమాకి మళ్లీ మంచి రోజులు వస్తాయంటున్నారు. నిజాయితీ, అభిరుచి కల్గిన నిర్మాతలు ఆచితూచి నిర్మించే చిత్రాలు కనిపిస్తాయంటున్నారు.


.jpg)



