తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ..దోషులకు శిక్ష పడాల్సిందే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం
posted on: Feb 7, 2026 10:41AM

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవించి తీరాల్సిందే. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ మహాపాపం. దీని వెనుక ఎవరున్నా సరే శిక్ష అనుభవించాల్సిందే. ఈ మాటలన్నది టీటీడీ మాజీ మాజీ ఈవో, రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణ్యం అన్నారు. ఇది సామాన్యభక్తుడిగా తన కోరిక అన్న ఆయన తప్పు చేసినవారు అంగప్రదక్షిణ చేస్తారో, లేదంటే కోనేటిలో మునిగి ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వారే నిర్ణయించుకోవాలన్నారు.
లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్లు 2024లో సీఎం చంద్రబాబు తనకు చెప్పారని గుర్తు చేసుకున్న ఎల్వీ ప్రసాద్.. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిందనీ, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐతో పాటు సిట్ కూడా దర్యాప్తు చేపట్టిందన్న ఆయన ఈ విషయంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అన్నది కేవలం తప్పిదం కాదనీ, మహాపాపమనీ, అత్యంత దుర్మార్గమైన చర్య అనీ ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చి దోషులకు శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అసలు తప్పే జరగలేదన్నట్లుగా కొందరు మాట్లాడటం విచారకరమన్న ఆయన తప్పు చేసినవారిలో ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదనీ, శిక్షలు పడవనే ధైర్యంతో వ్యవహరిస్తున్నారనీ పేర్కొన్నారు.


.webp)



