అప్పటి టీటీడీ ఛైర్మన్‌కు తెలిసే జరిగింది : సీఎం చంద్రబాబు
posted on: Feb 5, 2026 3:03PM

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏక సభ్య కమీషన్‌ని నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అసభ్యంగా మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతలు బూతులు తిడితే భరించాలా...రౌడీయిజం చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం లేదు, సీఎం, డిప్యూటీ సీఎం అంటే లెక్కలేదని ఆయన అన్నారు. నెయ్యిలో కల్తి లేదని సీబీఐ రిపోర్ట్ లో ఎక్కడా చెప్పలేదు..కరడుకట్టిన నేరస్థుడిలా జగన్ మాట్లాడారు. దేవుడికి అపచారం జరిగినప్పుడు ముక్తకంఠంతో ఖండించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు అన్నారు.
దేవుడితో పెట్టుకోవడం మంచిది కాదని ముఖ్యమంత్రి హితవు పలికారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీయాలని కావాలని చేసిన కార్యక్రమం ఇది. అప్పటి టీటీడీ ఛైర్మన్ పీఏ ఖాతలో రూ. 4కోట్లకు పైగా నగదు జమైంది. అంతా అప్పటి టీటీడీ బోర్డు ఛైర్మన్‌కు తెలిసే జరిగిందని సీఎం తెలిపారు. దోషులను శిక్షిస్తాం...ఎవరినీ వదిలిపెట్టం..దేవుడి పవిత్రత, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఒకప్పుడు ఏడు కొండలు కాదు.. రెండు కొండలని శాసన సభలో మాట్లాడారు. వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని ఆనాడే చాలా స్పష్టంగా చెప్పాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నారు. విగ్రహాల ధ్వంసాన్ని ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే ఎదురుదాడికి దిగారని చంద్రబాబు తెలిపారు. ఆలయంలో చోరీ జరిగితే అది తప్పు అనే భావన లేదని ముఖ్యమంత్రి అన్నారు. 219 దేవాలయాలపై దాడి చేశారని ఆయన తెలిపారు.


.webp)



