టిప్పు సుల్తాన్ పాలన.. చరిత్ర పొరల్లో దాగిన చేదు నిజాలు!

posted on: May 11, 2026 10:39AM

 భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తులలో మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఒకరు. ఒకవైపు ఆంగ్లేయులను ఎదిరించిన  మైసూరు పులిగా  కొందరు కీర్తిస్తుంటే.. మరోవైపు మలబార్, కూర్గ్ ప్రాంతాల్లో ఆయన సాగించిన మతపరమైన హింస, దేవాలయాల విధ్వంసం, బలవంతపు మతమార్పిడులు ఆయన పాలనలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. చారిత్రక ఆధారాలు, సమకాలీన లేఖలు, పురాతత్వ శాఖ రికార్డుల ఆధారంగా టిప్పు సుల్తాన్ కాలం నాటి హింసాత్మక ఘటనలపై ఒక ప్రత్యేక విశ్లేషణ.

టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా మలబార్, కూర్గ్  ప్రాంతాలపై జరిపిన దాడులు కేవలం రాజకీయ విజయాలకే పరిమితం కాలేదు. సర్ విలియం లోగన్ రాసిన మలబార్ మాన్యువల్ ప్రకారం..  మలబార్‌ ప్రాంతంలో సుమారు 70 వేల మంది హిందువులను బలవంతంగా మతమార్పిడి చేయించారు. అలాగే..  కూర్గ్ ప్రాంతంలో 40 వేల మంది మంది కొడవులను బందీలుగా పట్టుకుని వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్లు టిప్పు స్వయంగా తన లేఖలలో పేర్కొన్నారు. ఈ మతమార్పిడికి గురైన వారి వారసులు నేటికీ  కొడవ మాపిళ్లలుగా పిలువబడుతున్నారు. వీరు ఇస్లాంను అనుసరిస్తున్నప్పటికీ..  తమ పూర్వీకుల హిందూ ఇంటిపేర్లను ఇప్పటికీ కొనసాగిస్తుండటం గమనార్హం. టిప్పు సైన్యానికి జారీ చేసిన ఆదేశాల్లో జిల్లాలోని ప్రతి ప్రాణిని తగలబెట్టండి, బలవంతంగానైనా మతమార్పిడి చేయండి అనే క్రూరమైన ఆజ్ఞలు ఉన్నాయని చరిత్రకారుడు లూయిస్ బి. బోరీ పేర్కొన్నారు.
 
టిప్పు సుల్తాన్ పాలనలో దక్షిణ భారతదేశంలో వేల సంఖ్యలో దేవాలయాలు ధ్వంసమయ్యాయని మైసూరు గెజిటీర్ గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటిష్ పురాతత్వ శాఖ మాజీ డైరెక్టర్ బి. లూయిస్ రైస్ నమోదు చేసిన వివరాల ప్రకారం.. టిప్పు సుల్తాన్ మరణించే సమయానికి ఆయన రాజధాని శ్రీరంగపట్నంలో కేవలం రెండు హిందూ దేవాలయాలు  మాత్రమే మిగిలి ఉన్నాయి.

 కర్నాటక మేల్కోటేలో దాదాపు పన్నెండు వందల మంది మాండ్యం అయ్యంగార్ బ్రాహ్మణులను నరకచతుర్దశి రోజున ఊచకోత కోశారు. ఈ విషాదానికి గుర్తుగా మేల్కోటే ప్రజలు నేటికీ దీపావళి పండుగను జరుపుకోరు.  ఇక గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం, త్రిప్రాయర్ శ్రీరామ దేవాలయం, రాజరాజేశ్వర శివదేవాలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు టిప్పు దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. శ్రీరంగపట్నంలోని హనుమాన్ దేవాలయం, పెనుకొండలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వంటి వాటిని  మసీదులుగా రూపొందించినట్లు..  వాటి స్తంభాలపై ఇప్పటికీ కనిపిస్తున్న హిందూ శిల్పాలు సాక్ష్యమిస్తున్నాయి.

మలబార్ ప్రాంతంలో నాయర్లు,  బ్రాహ్మణులపై టిప్పు సుల్తాన్ అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బలవంతంగా గోమాంసం తినిపించడం, మతపరమైన ఆచారాలను ధిక్కరించడం వంటి చర్యల వల్ల ప్రాణభయంతో సుమారు 30 వేల మంది హిందువులు తమ ఆస్తులను వదిలి ట్రావెన్‌కోర్ సంస్థానానికి వలస వెళ్లవలసి వచ్చింది. టిప్పు తన కమాండర్లకు రాసిన లేఖలలో  దాదాపు అందరు హిందువులూ ఇస్లాంలోకి మారారు, మిగిలిన వారిని కూడా ముగిస్తాం అని పేర్కొనడం.. టిప్పు సుల్తాన్ మతోన్మాదానికి నిదర్శనమని ఆయన విమర్శకులు అంటారు. 

చివరిగా టిప్పు సుల్తాన్ చరిత్రను విశ్లేషించేటప్పుడు ఆయన అందించిన కొన్ని పరిపాలనా సంస్కరణలు, ఆంగ్లేయులపై పోరాటాన్ని కొందరు ప్రస్తావిస్తారు.. అయితే  ఆయన పాలనలో సామాన్య హిందూ ప్రజానీకం, దేవాలయాలు,  స్థానిక సంస్కృతులపై జరిగిన దాడులను విస్మరించలేము. ప్రాథమిక మూలాధారాలు, సమకాలీన రికార్డులు చూపిస్తున్న ఈ చేదు నిజాలు టిప్పు సుల్తాన్  మరొక కోణాన్ని చూపుతున్నాయి.  చరిత్రను కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, బాధితుల పక్షాన నిలబడి చూడటం ద్వారానే సమగ్రమైన సత్యం వెలుగులోకి వస్తుంది.

-సీతారాం కంఠం నేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా పోర్టల్‌ https://www.teluguone.com ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి.  మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...