Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిమూర్ దండయాత్రలు.. జిహాద్ పేరుతో రక్తపాతం, దోపిడీలు
posted on: Jun 21, 2026 12:39PM

తిమూర్ పేరు వినగానే మధ్యయుగ ఆసియా చరిత్రలో రక్తపాతం, భయానక దండయాత్రలు, నగరాల నాశనం, సామూహిక హత్యలు గుర్తుకు వస్తాయి. తాను ఇస్లాం ధర్మరక్షకుడు , ‘జిహాద్ యోధుడు అని ప్రకటించుకుంటూనే, అపార ధనసంపద, రాజకీయ ప్రతిష్ఠ, సామ్రాజ్య విస్తరణ కోసం తిమూర్ నడిపిన యుద్ధాలు నరమేధాన్ని మిగిల్చి, రక్తచరిత్ర రాశాయి. తామర్లేన్ అని కూడా పిలిచే అతడు మధ్య ఆసియాకు చెందిన అత్యంత క్రూరుడిగా మిగిలిపోయాడు. ముఖ్యంగా 1398–99లో భారతదేశంపై చేసిన దండయాత్ర, ఢిల్లీ నగరంపై చేసిన దారుణ దాడి, భారత చరిత్రలో ఒక మలుపు. 1398లో అతను భారతదేశంపై దండయాత్ర చేపట్టాడు. ఈ దండయాత్ర భారత చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన దాడులలో ఒకటి.
1330ల దశకంలో, నేటి ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలోని కేశ్ పరిసరాల్లో తిమూర్ జన్నించాడు. 1370లో సమర్కండ్ కేంద్రంగా తిమురీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మధ్య ఆసియా, పర్షియా, ఇరాక్, కాక్కేసస్, రష్యా ప్రాంతాలపై వరుస దండయాత్రలు చేసి, గెంగిస్ ఖాన్ మాదిరి అందర్నీ భయభ్రాంతుల్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కఠిన సున్నీ ముస్లిం, ఇస్లాం పతాకధారి అని, తనను తాను ప్రకటించుకున్న తిమూర్, తన స్వీయ చరిత్ర గ్రంధం మల్‌ఫుజాత్ -ఐ- తిమూర్‌లో భారతదేశంపై దాడికి మతపరమైన కారణాలను కూడా ప్రస్తావించాడు. అతను తనను ఇస్లాం పరిరక్షకుడిగా చిత్రీకరించుకుంటూ, "అవిశ్వాసులపై జిహాద్" చేస్తున్నానని చెప్పుకున్నాడు.
14వ శతాబ్దం చివరికి ఢిల్లీని పాలిస్తున్న తుగ్లక్ వంశం తీవ్ర అంతర్గత కలహాలు, తిరుగుబాట్లు, ప్రాంతీయ విభజనలతో బలహీనపడింది. అప్పట్లో నాసిరుద్దీన్ మహ్మూద్ షా తుగ్లక్ పేరు మాత్రమే సుల్తాన్. అసలు అధికారాన్ని మల్లూ ఇక్బాల్ ఖాన్ వంటి అమీరులు వెలగబెట్టేవారు. సామంతులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ, కేంద్రానికి కేవలం పేరుకే విధేయత చూపేవారు. అలాంటి సమయంలో తిమూర్ దృష్టి అప్పట్లో అత్యంత ధనిక నగరమైన ఢిల్లీపై పడింది. ఢిల్లీలో పన్నుల వసూళ్లు, వాణిజ్యం, బంగారం, రత్నాలు, హస్తకళల సంపద ఇవన్నీ త్రిమూర్‌ని ఆకర్షించాయి. ఢిల్లీలో ఉంది ముస్లిం పాలకులే అయినప్పటికీ, వారి రాజ్యంలో హిందువులకు కొంత మత స్వేచ్ఛ, సామాజిక స్థానం కల్పిస్తుండటం త్రిమూర్‌కి అవకాశంగా మారింది. హిందువుల పట్ల అతి ఉదారత చూపిస్తున్నారన్న సాకుతో ఢిల్లీ సుల్తాన్‌పై జిహాదీ పేరుతో దండయాత్ర ప్రకటించారు. తిమూర్ దండయాత్రకు జిహాద్ ఒక ముసుగు మాత్రమే; అసలు లక్ష్యం ఢిల్లీ సంపద దోపిడీ, రాజకీయ ప్రతిష్ఠ. సొంత చేసుకోవడం.
ఆ క్రమంలో 1398లో తిమూర్ సేనలు ఢిల్లీ వైపు కదిలాయి. తిమూర్ సుమారు 90,000 సైన్యంతో ఇండస్ నదిని దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. మార్గమధ్యంలో పంజాబ్ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలపై దాడులు, దోపిడీలు, సామూహిక హత్యలకు పాల్పడ్డారు. తులంబా, ముల్తాన్, ఇతర పట్టణాలు విధ్వంసానికి గురయ్యాయి. తులంబా పట్టణాన్ని పూర్తిగా దోచుకుని, నివాసితులను సామూహికంగా హతమార్చారు. ముల్తాన్ పట్టణం కూడా తిమూర్ సైన్యానికి లొంగిపోయి, తర్వాత దోపిడీ, హింసకు గురైంది. లోనీ వద్ద 1 లక్ష మంది ఖైదీలను హతమార్చారు.
ఢిల్లీ సమీపంలోని లోనీ ప్రాంతంలో తిమూర్ సైన్యం చేతికి చిక్కిన లక్ష మంది హిందూ ఖైదీలు ఢిల్లీ సుల్తాన్‌తొ యుద్ధానికి ముందు ఒకే రోజులో హతమార్చమని తిమూర్ ఆదేశించాడని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.
అప్పటికి ఢిల్లీ సుల్తాన్ సైన్యంలో సుమారు 120 యుద్ధ ఏనుగులు, కవచాలతో, విషపూత దంతాలతో సిద్ధంగా ఉన్నాయి. దాంతో తిమూర్ తన గుర్రపు దళాల చుట్టూ గోతులు తవ్వించి, ఏనుగుల దాడిని అడ్డుకోవడానికి రక్షణ వ్యూహం పన్నాడు. ఒంటెలపై గడ్డి, కట్టెలు కట్టి, వాటిని అగ్నికి ఆహుతి చేసి, భయంతో పరుగులు పెట్టేలా చేసి, ఏనుగులపైకి వదిలాడు. దాంతో ఏనుగులు భయంతో తమ సైన్యాన్నే తొక్కేయడంతో, ఢిల్లీ సైన్యం గందరగోళానికి గురై ఓడిపోయింది. విజయం తర్వాత, ఢిల్లీ నగరంపై తిమూర్ సైన్యం ఐదు రోజులపాటు దోపిడీ, హత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా కొనసాగించింది. లక్షలాది మందిని హతమార్చి, దేవాలయాలు, ఇతర ఆస్తుల ధ్వసంతో ఢిల్లీ శ్మశానంలా మారింది.
ఢిల్లీ సుల్తానేట్ అప్పటికే బలహీనంగా ఉండటం, తిమూర్ దాడి ఆ సామ్రాజ్యాన్ని మరింత చీల్చి, జౌన్పూర్, మాల్వా, గుజరాత్ వంటి ప్రాంతీయ రాజ్యాల ఎదుగుదలకు దారితీసింది. స్వయంగా భారతదేశాన్ని ఏలే ఉద్దేశం లేని తిమూర్ దోపిడీ సొత్తు, బానిసల, శిల్పుల తరలింపు తర్వత సమర్‌కండ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. తిమూర్ వంశస్థుడైన బాబర్, 1526లో పానిపట్ యుద్ధం ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసినప్పుడు, తిమూర్ వారసత్వాన్ని తన రాజకీయ న్యాయబద్ధతకు ఆధారంగా చూపించాడు. ఈ విధంగా, 1398 దండయాత్ర, 1526 మొఘల్ ప్రవేశానికి ఒక లెజిటిమసీ బ్రిడ్జ్‌గా పనిచేసింది. ఢిల్లీ నగరం జనాభా, ఆర్థిక వ్యవస్థ, కళాకారులు, వాణిజ్య వర్గాలు అన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి.
శిల్పులు, రాతి మేస్త్రీలు, కళాకారులను బానిసలుగా సమర్‌కండ్‌కు తరలించి, అక్కడి నిర్మాణాలకు ఉపయోగించినట్లు చరిత్ర చెపుతోంది. ఆధునిక భారతదేశంలో తిమూర్ పేరు, ఢిల్లీ దండయాత్ర, హిందువులపై జరిగిన సామూహిక హత్యలు, ఇవన్నీ మతపరమైన చర్చల్లో, రాజకీయ వాదోపవాదాల్లో తరచుగా ప్రస్తావనకు వస్తున్నాయి. కొంతమంది మధ్యయుగ యుద్ధాల క్రూరత పేరుతో ఆ ఘటనలను జనరలైజ్ చేయడానికి చూస్తుంటే, మరికొందరు హిందువులపై జరిగిన మతపరమైన హింస అని స్ఫష్టంగా వాదిస్తున్నారు.
తిమూర్ చరిత్ర మనకు చెప్పే ప్రధాన పాఠం .. మతం, జాతి, సామ్రాజ్య గర్వం పేరుతో హింసను న్యాయీకరించినప్పుడు, చివరికి మానవత్వమే ఓడిపోతుంది. తిమూర్ దాడులతో జరిగిన ప్రాణనష్టం, విధ్వంసం భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.
ఒక్కముక్కలో చెప్పాలంటే తిమూర్ దండయాత్రలు, ముఖ్యంగా 1398 ఢిల్లీ దోపిడీ, భారత చరిత్రలో ఒక స్పష్టమైన ‘జెనోసైడల్’.. అంటే ఒక సామూహిక హత్యాకాండ అధ్యాయం. ఢిల్లీ నగరం, హిందూ జనాభా, స్థానిక ముస్లిం సమాజం అందరూ ఈ దండయాత్ర బారిన పడి తీవ్రంగా నష్టపోయిన వారే. అందుకే దాన్ని జనరలైజ్ చేయడం కాదు, స్పష్టంగా, బాధ్యతతో, వాస్తవాలను యథాతథంగా చెప్పాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





