పెద్దపులి ఇంకా దొరకలేదు.. రాజమహేంద్రవరం, రాజానగరంలో టెన్షన్ టెన్షన్

posted on: Feb 5, 2026 11:42AM

రాజమహేంద్రవరంలో పులి సంచారం కొనసాగుతోంది. జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ పెద్దపులి రాజమహేంద్రవరం పరిసరప్రాంతాలలో గత నాలుగు రోజులుగా యథేచ్ఛగా సంచరిస్తోంది. ఈ పెద్దపులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పెద్దపులి రోజుకు 15 నుంచి 20 కిలో మీటర్ల ప్రయాణిస్తూ రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది.

మంగళవారం రాత్రి దివాన్ చెరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కొబ్బరితోటలోకి చొరబడిన పెద్దపులి బుధవారం అంటే నిన్న రాత్రికి రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మ తల్లి కొండ సమీపంలోని జీడిమామిడి తోటలో నక్కి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పెద్దపులిని పట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకూ జీడిమామిడి తోటలోనే పులిని బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అంటున్నారు. పులి సంచారంపై ప్రజలు భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదన్న అటవీ శాఖ అధికారులు రాత్రి వేళల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.  ఇలా ఉండగా రాజానగరం  భూపాలపట్నం ప్రాంతంలో పులి ఒక పశువు ని చంపినట్లు అధికారులు గుర్తించారు.

పెద్దపులిని రెచ్చగొట్టే విధంగా ఎవరూ వ్యవహరించవద్దని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే పులికి ఎటువంటి హానీ తలపెట్టే ప్రయత్నాలకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నారు. పులికదలికలను ఎవరైనా గమనించినట్లైతే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. పొలాలు, తోటలు, అటవీ ప్రాంతాల వైపు ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. ఇక జిల్లా యంత్రాంగం పులి సంచరిస్తున్న ప్రాంతాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...