రేపటి నుండి రాజధాని కోసం తుళ్ళూరు భూసేకరణ మొదలు

posted on: Dec 30, 2014 1:43PM

 

రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన 20 బృందాలు తుళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూసేకరణ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాయి. తుళ్ళూరు మండలంలో చాలా గ్రామాల ప్రజలు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నందున ఆ ప్రాంతాలలో భూసేకరణ సందర్భంగా ఉద్రిక్తతలు ఏర్పడవచ్చును. అందువలన రెవెన్యూ శాఖ డిప్యూటీ కలెక్టరు, తసిల్దారు, సర్వేయర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి వారికి భూసేకరణ విధివిధానాలు, ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారం వంటి అంశాలపై ముందుగానే శిక్షణ కూడా ఇచ్చింది.

 

ఒక్కో బృందానికి సుమారు 1400 ఎకరాల భూసేకరణ బాధ్యత అప్పగించడం ద్వారా ఈ ప్రక్రియలో ఒక ప్రాంతంలో ఆటంకాలు ఎదురయినప్పటికీ ఆ ప్రభావం మరో ప్రాంతం పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంది. ఆ విధంగా అత్యధిక భాగంలో భూసేకరణ పూర్తయినట్లయితే, అవరోధాలు ఎదురయ్యే ప్రాంతాలలో సమస్యలు పరిష్కరించుకొనేలోగానే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.

 

ఇక రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు పూనుకొంటున్న ఈ సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం ఇదివరకు యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన కటినమయిన షరతులతో కూడిన భూసేకరణ చట్టంలో అటువంటి నిభంధనలను సరళతరం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా ఇదివరకు చట్టంలో ఉన్న ‘భూసేకరణకు భూయాజమాని ఆమోదం తప్పనిసరి’ అనే షరతును తొలగించేందుకు ఆమోదముద్ర వేసింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవసరమయితే సవరించిన కొత్త చట్ట ప్రకారం రైతులకు ఇష్టం ఉన్నా లేకున్నా భూసేకరణ చేసే వెసులుబాటు ఏర్పడింది. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తోంది గనుక ఆ చట్టం ప్రయోగించవలసిన అవసరం ఉండకపోవచ్చును. ప్రభుత్వం నిర్దేశించుకొన్న మొత్తం 30,000 ఎకరాల భూసేకరణలో ఎక్కడయినా అవరోధాలు ఏర్పడినచోటనే ఈ చట్టం ప్రయోగించవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...