Latest News

లొంగిపోలేదు...అరెస్ట‌య్యా...పార్టీలో కోవ‌ర్టు గేమ్

posted on: Mar 22, 2026 2:55PM

 

లొంగిపోలేదు అరెస్ట‌య్యాన‌ని అంటారు తిప్పిరి  తిరుప‌తి  అలియాస్ దేవ్ జీ. నిజంగా అరెస్ట‌యితే ఇంత  స్వేచ్ఛ‌గా ఎలా తిరుగుతారు?  మీడియా ఇంట‌ర్వ్యూలు ఎలా ఇస్తారు? అన్న‌ది  అటుంచితే.. పార్టీలోని కోవ‌ర్టు వ్య‌వ‌హారాలు, ఆ లుక లుక‌ల గురించి చాలానే మాట్లాడారు తిరుప‌తి.

ప్ర‌భుత్వం ప్ర‌చారం చేస్తున్న‌ట్టు తామేమీ లొంగిపోలేద‌నీ.. అరెస్ట‌య్యామ‌నీ.. కింద ప‌డ్డా  పై చేయి మాదే అన్న‌ట్టుగా మాట్లాడుతున్నారు తిరుప‌తి. తాము ప్రాణాల‌పై ఆశ‌లు వ‌దులుకున్నాకే.. అడ‌వి బాట ప‌ట్టిన‌ట్టు చెబుతున్నారాయ‌న‌. గ‌త సెంట్ర‌ల్ క‌మిటీలో జ‌రిగిన  చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన కీల‌క ఎజెండాకు సంబంధించి ప‌లు కీల‌క‌మైన అంశాల‌ను బ‌య‌ట పెట్టారాయ‌న‌. ఆప‌రేష‌న్ క‌గార్ ఎఫెక్ట్ పైనా త‌న మ‌నోభావాల‌ను పంచుకున్నారు తిరుప‌తి.

మావోయిస్టు పార్టీ  చీలిపోవ‌డానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణం.. మ‌ల్లోజుల వేణుగోపాల్ అంటూ తేల్చి చెబుతున్నారు తిప్ప‌రి తిరుప‌తి. తొలి  నుంచీ కూడా మ‌ల్లోజుల- అలియాస్ సోనూ- అలియాస్ అభ‌య్ పార్టీకి ద్రోహం చేస్తూనే వ‌చ్చార‌ని ఆరోపిస్తున్నారు దేవ్ జీ. కేంద్రం గుప్పెట్లో ఉంటూ.. పార్టీకి తీర‌ని న‌ష్టం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆల్రెడీ మ‌ల్లోజుల‌పై ఉన్నాయి. వాటినే ఆయ‌న నిజం చేసిన‌ట్టు భావిస్తున్నారు దేవ్ జీ. 

మిగిలిన కామ్రెడ్ల‌ను మాన‌సికంగా కుంగిపోయేలా చేస్తూ.. రాజ్యం నీడ‌లో ఉంటూ ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు, పిలుపుల‌పై త‌మ‌కు ఎప్ప‌టి నుంచో అనుమానం ఉండేద‌ని.. ఇప్పుడ‌వ‌న్నీ వాస్త‌వ రూపం దాల్చిన‌ట్టు చెబుతారు తిరుప‌తి. 

ఇక పార్టీపై నిషేధం ఎత్తివేయాల‌ని.. అలాకాకుండా ఎంత తీవ్రంగా అణ‌గ‌దొక్కే య‌త్నం చేస్తే.. అంత‌గా పార్టీ ప్ర‌తిఘ‌టించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు తిరుప‌తి. అర్బ‌న్ న‌క్స‌ల్స్ రూపంలో మ‌రింత‌గా పెట్రేగే అవ‌కాశ‌ముంద‌ని కూడా అన్నారాయ‌న‌. 

కేంద్రం క‌గార్ రూపంలో చేసిన న‌ష్టం క‌న్నా పార్టీలో ఉంటూ కోవ‌ర్టుగా ప‌ని చేసిన మ‌ల్లోజుల ద్వారానే ఎక్కువ‌గా న‌ష్టం జ‌రిగిన‌ట్టు.. చెబుతున్నారు దేవ్ జీ. నంబాల కేశ‌వ‌రావు, హిడ్మాల ఎన్ కౌంట‌ర్ లో.. ఇలాంటి  కోవ‌ర్టు  ఆప‌రేష‌నే బ‌లంగా ఉన్న‌ట్టు చెప్పారు తిరుప‌తి. 

వారు ఆయుధాల‌తో లొంగిపోవ‌డం మాత్ర‌మే కాకుండా.. మిగిలిన వారిని కూడా తుపాకుల‌తో లొంగిపోవాల‌ని మ‌ల్లోజుల, ఆశ‌న్న ఇచ్చిన పిలుపు ప్ర‌స్తుత దుస్థితికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌నీ.. వారు ఎప్ప‌టికీ ఉద్య‌మ ద్రోహుల‌నే అంటున్నారు దేవ్ జీ. ఈ విష‌యంపై కామ్రెడ్ బ‌స‌వ‌రాజు కూడా అంగీక‌రించార‌ని అన్నారు తిప్ప‌రి  తిరుప‌తి.

పార్టీ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా.. త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం మాత్ర‌మే కాకుండా, పార్టీని చీల్చుతూ కేంద్ర ప్ర‌భుత్వం, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి వీరు ట‌చ్ లోకి వెళ్లిన‌ట్టు ఆరోపిస్తున్నారు తిప్ప‌రి తిరుప‌తి. 

తాము స‌రెండ‌ర్ అన్న మాట అవాస్త‌వం. పార్టీ ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఇదంతా చేస్తున్న‌ట్టు చెప్పారాయ‌న‌. గ‌ణ‌ప‌తి ఎక్క‌డున్నారో త‌మ‌కు తెలీద‌నీ.. ఏది ఏమైనా పార్టీ ఒక అనుకూల స‌మ‌యం కోసం ఎదురు చూస్తోంద‌ని.. ఉద్య‌మం తిరిగి అనేక మార్గాల ద్వారా ఊపందుకునే అవ‌కాశం లేక పోలేద‌ని కూడా చెప్పుకొచ్చారు తిప్ప‌రి తిరుప‌తి, అలియాస్ దేవ్ జీ.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...