ప్రపంచ శక్తుల మధ్య నిశబ్ద యుద్ధ కేంద్రాలు ఈ సముద్ర మార్గాలు

posted on: Apr 16, 2026 4:23PM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే సన్నని సముద్ర మార్గాలు. వీటిలో ఏర్పడిన  ఒక చిన్న అడ్డంకి కూడా మహాశక్తుల సమతుల్యాన్ని కదిలించేస్తుంది.  ప్రపంచం ఎంత పెద్దదైనా,  దాన్ని నిలిపివేయడానికి కొన్ని కిలోమీటర్ల సన్నని సముద్ర మార్గమే చాలనేది నేటి జియోపాలిటిక్స్ చెబుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం కంటే ఎక్కువ భాగం సముద్ర మార్గాల ద్వారా  జరుగుతోంది. అందులో కూడా అత్యంత కీలకమైన  చమురు, సహజవాయువు, గోధుమలు, ఎలక్ట్రానిక్స్, కంటైనర్లు  కొన్ని చోక్ పాయింట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి.
ఈ చోక్ పాయింట్స్ కేవలం భౌగోళిక మార్గాలు కాదు, ఇవి ప్రపంచ శక్తుల మధ్య జరిగే వ్యూహాత్మక పోరాటాల కేంద్రాలు.
 ఎందుకు ఇవి జియోపాలిటికల్ హాట్ స్పాట్స్ అయ్యాయంటే.. ?
- చమురు ధరలు ఇక్కడే నిర్ణయించబడతాయి
- ప్రపంచ సరఫరా గొలుసులు ఇక్కడే నిలిచిపోతాయి
- మహాశక్తుల నౌకాదళాలు ఇక్కడే ఢీకొంటాయి
-  యుద్ధాలు, ఆంక్షలు, తిరుగుబాట్లు మొదట ఇక్కడే ప్రభావం చూపుతాయి
ఒక చోక్ పాయింట్ మూసుకుపోతే, అది కేవలం ఒక దేశాన్ని కాదు,  ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది.

 1. పానామా కాలువ.. అమెరికా ప్రభావం తగ్గితే మొదట దెబ్బ తినేది ఇదే. పానామా కాలువ అమెరికా వ్యూహాత్మక ఆధిపత్యానికి ప్రతీక. అమెరికా–ఆసియా వాణిజ్యానికి కీలకం.      చైనా, జపాన్, కొరియా సరుకులకు ప్రధాన రవాణా మార్గం. వాతావరణ మార్పులకు అత్యంత సున్నితమైనది. ఇటీవలి సంవత్సరాల్లో ఎండలు, నీటి కొరత కారణంగా నౌకల సంఖ్య తగ్గడం, వాతావరణ మార్పు కూడా జియోపాలిటికల్ ఆయుధంగా మారుతోందని సూచిస్తోంది.

 2. సూయజ్ కాలువ యూరప్ కు ఆసియా ప్రాణవాయువు. ఈ సూయజ్ కాలువ మూసుకుపోతే..  యూరప్ కు ఇంధనం, ఆసియాకు మార్కెట్లు, ఆఫ్రికాకు సరఫరాలు అన్నీ నిలిచిపోతాయి.  
2021 ఎవర్ గివెన్  ఘటన ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒకే ఒక్క నౌక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలిపివేయగలదు.

ఈ మార్గం మీద నియంత్రణ ఎవరిదో… యూరప్, ఆసియా వాణిజ్యంపై వారి ప్రభావం అంత ఎక్కువ.
 3. మలక్కా జలసంధి..  చైనా యొక్క గొంతు పట్టే మార్గం.  చైనా ఇంధన దిగుమతుల్లో 80శాతం  ఈ మార్గం మీద ఆధారపడి ఉంది. అందుకే చైనా దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు నిర్మిస్తోంది. నౌకాదళాన్ని విస్తరిస్తోంది.  మలక్కా డైలెమా నుంచి బయటపడేందుకు  బెల్ట్ అండ్ రోడ్  ప్రాజెక్టులు వేగవంతం చేస్తోంది. మలక్కా జలసంధి మూసుకుపోతే..    చైనా ఆర్థిక వ్యవస్థకు నేరుగా దెబ్బ. అందుకే ఈ జలసంధి   అమెరికా–చైనా వ్యూహాత్మక పోరాటంలో కీలకం.
4. హార్ముజ్ జలసంధి ఇది గల్ఫ్ చమురు ప్రపంచానికి చేరే మార్గం. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చోక్ పాయింట్. రోజుకు 20 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ జలసంధి గుండానే వెడుతుంది. ప్రపంచ సహజవాయువు రవాణాలో 20 శాతం ఈ మార్గంలోనే రవాణా అవుతుంది. అందుకే ఇది అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. 
 
 ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తానని పలుమార్లు హెచ్చరించింది. అమెరికా నౌకాదళం ఇక్కడే శాశ్వతంగా మోహరించింది. ఇది కేవలం వాణిజ్య మార్గం కాదు,  ఇది కేవలం వాణిజ్య మార్గం కాదు.. మధ్యప్రాచ్య శక్తి సమతుల్యాన్ని నిర్ణయించే యుద్ధరంగం.
 5. బాబ్ ఎల్-మందెబ్ — రెడ్ సీకి ప్రవేశ ద్వారం, ఇప్పుడు యుద్ధరంగం. 2023లో  ఈ మార్గంగుండా 26,000 నౌకలు వెళ్లేవి. వాటి సంఖ్య  హౌతీ దాడుల కారణంగా 2025లో 12,700 నౌకలకు పడిపోయింది. ఇది కేవలం యెమెన్ యుద్ధం కాదు.. ఇరాన్–సౌదీ–అమెరికా మధ్య జరుగుతున్న ప్రాక్సీ పోరాటం.
ఈ మార్గం మూసుకుపోతే..  సూయజ్ కాలువ విలువ తగ్గుతుంది.     యూరప్ కు సరఫరాలు నిలిచిపోతాయి. చమురు ధరలు పెరుగుతాయి
అందుకే ఇది ప్రపంచ శక్తులన్నిటికీ అత్యంత సున్నితమైన ప్రాంతం.
 6. టర్కిష్ స్ట్రైట్..  రష్యా, ఉక్రెయిన్, యూరప్ మధ్య వ్యూహాత్మక నాడి
బోస్పరస్  అండ్ డార్డనెల్స్.. ప్రపంచ గోధుమ రవాణాలో  పాతిక శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది.  రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం నేరుగా ఇక్కడే కనిపిస్తుంది. టర్కీ ఈ మార్గాన్ని నియంత్రించడం వల్ల..రష్యాపై ఒత్తిడి, యూరప్ పై ప్రభావం పడుతుంది. నాటోలో తన ప్రాధాన్యం పెరగడం అన్నీ సాధ్యమవుతున్నాయి.
 మహాశక్తుల వ్యూహం: చోక్ పాయింట్లను నియంత్రిస్తే ప్రపంచాన్ని నియంత్రించినట్టే.  ఈ మార్గాలపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందో .. వారి చేతుల్లోనే.. చమురు ధరలు, గ్లోబల్ సరఫరా చెయిన్లు, స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు, యుద్ధాలు, శాంతి ఒప్పందాలు ఉంటాయి.
అందుకే..     అమెరికా హార్ముజ్, బాబ్ ఎల్-మందెబ్ వద్ద నౌకాదళాన్ని ఉంచుతోంది. చైనా మలక్కా జలసంధికి  ప్రత్యామ్నాయాలు నిర్మిస్తోంది.     రష్యా టర్కిష్ జలసంధులపై  ప్రభావం పెంచడానికి ప్రయత్నిస్తోంది. యూరప్ సూయజ్ కాలువ భద్రతపై ఆధారపడుతోంది. ప్రపంచ శక్తులన్నీ ఈ సన్నని మార్గాల చుట్టూ తమ వ్యూహాలను నిర్మిస్తున్నాయి. చివరిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం  ఈ సన్నని సముద్ర మార్గాల మీదే ఆధారపడి ఉంది.  
ఈ చోక్ పాయింట్లలో ఏ ఒక్కదానిలోనైనా యుద్ధం, దాడి ప్రమాదం, ఆంక్షలు,  వాతావరణ మార్పు
జరిగితే..  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెంటనే కుదేలవుతుంది. ఇవి కేవలం సముద్ర మార్గాలు కాదు..  ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధాల కేంద్రాలు.

సేకరణ, సంకలనం : సీతారాం కంఠమనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...