అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తున్న వీసా కుంభకోణం

posted on: May 13, 2026 3:04PM

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి, ఆపై నిబంధనలకు విరుద్ధంగా అక్కడే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులకు గడ్డుకాలం మొదలైంది. విద్యార్థి వీసా నిబంధనలను తుంగలో తొక్కి.. నకిలీ పద్ధతుల్లో పని హక్కులను (ఓపీటీ) పొందుతున్న భారీ కుంభకోణాన్ని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ఛేదించారు.  దాదాపు 10,000 మంది విదేశీ విద్యార్థులు పలు అనుమానాస్పద సంస్థలతో చేతులు కలిపి అమెరికా చట్టాలను తుంగలో తొక్కుతున్నట్లు  ఐసిఈ యాక్టింగ్ డైరెక్టర్ టాడ్ లియోన్స్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విభాగాల్లో చదువుకున్న విద్యార్థులకు ఇచ్చే మూడేళ్ల పొడిగింపు   (స్టెమ్ ఓపీటీ) ఈ మోసాలకు ప్రధాన వేదికగా మారిందని అధికారులు గుర్తించారు.  దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఓపీటీ కార్యక్రమం ప్రస్తుతం అక్రమార్కులకు ఒక సులభమైన మార్గంగా మారింది. చాలామంది విద్యార్థులు, స్వార్థపూరిత యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని నకిలీ నియామక పత్రాలను సృష్టిస్తున్నారు. కేవలం కాగితాల మీద మాత్రమే ఉనికిలో ఉన్న  డొల్ల కంపెనీల (ఫెల్ కంపెనీలు) ద్వారా వీరు ఉపాధి పొందుతున్నట్లు తప్పుడు రికార్డులు సమర్పిస్తున్నారు. 

కేవలం వీసా హోదాను కాపాడుకోవడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ వ్యవహారం వెనుక భారీ ఆర్థిక నేరాలు, మేధో సంపత్తి చోరీ వంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా దాగి ఉన్నాయని ఐసిఈ అధికారులు చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఇటువంటి ఉల్లంఘనలను ఇసుమంతైనా  ఉపేక్షించబోమని డైరెక్టర్ లియోన్స్  హెచ్చరించారు.  అమెరికాలోని పలు కీలక రాష్ట్రాల్లో ఈ మోసాలు వేళ్లూనుకున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జార్జియా, టెక్సాస్, వర్జీనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్,  ఫ్లోరిడా వంటి ప్రాంతాల్లో అనుమానాస్పద కంపెనీల నెట్‌వర్క్ విస్తరించి ఉంది. అధికారులు కొన్ని చిరునామాలను స్వయంగా తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వందలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు రికార్డుల్లో ఉన్న కంపెనీల కార్యాలయాలు,  పోస్ట్ ఆఫీస్ బాక్సులుగానో లేదా ఖాళీగా ఉన్న భవనాలుగానో దర్శనమిచ్చాయి. ఒక ప్రత్యేక కేసులో..  కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారని ఒక కంపెనీ ప్రకటించగా..  ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆ కంపెనీలో  500 మందికి పైగా విద్యార్థులు  పనిచేస్తున్నట్లు నమోదు చేసుకోవడం గమనార్హం.  ఈ కుంభకోణం వెనుక అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత నేరగాళ్ల ప్రమేయం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

ముఖ్యంగా భారతదేశం నుండి కొన్ని కంపెనీలు తమ హెచ్‌ఆర్ (హెచ్ ఆర్),  పేరోల్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు చూపిస్తూ దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే..  గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ గెస్ట్ వర్కర్ ప్రోగ్రామ్ ఇప్పుడు నియంత్రణ లేని ఒక పైప్‌లైన్‌లా మారిందని లియోన్స్ విమర్శించారు. ప్రస్తుతం బయటపడిన పదివేల కేసులు కేవలం ఆరంభం మాత్రమేననీ.. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వేల మంది   దొరికే అవకాశం ఉందని ఐసిఈ స్పష్టం చేసింది.  ఈ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు ఉండబోతున్నాయి. నిబంధనలు మీరిన విద్యార్థులు,  వారికి సహకరించిన కంపెనీల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, వారిని తక్షణమే దేశం నుండి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించనున్నారు.  ఇది పొరపాటున జరిగిన తప్పు కాదు, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన నేరం అని అభివర్ణించిన అధికారులు..  తప్పు చేసిన వారు వెంటనే లొంగిపోవాలని లేదా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించారు. 

లేనిపక్షంలో అమెరికా చట్టాల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ కన్సల్టెన్సీల పేర్లు, డొల్ల కంపెనీల వివరాలను బహిర్గతం చేస్తామని ఐసిఈ ప్రకటించింది. స్టెమ్ విభాగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు మేలు చేయాల్సిన ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడమే  ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, నిబంధనలను అనుసరిస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలు ప్రస్తుతం ఓపీటీలో ఉన్న, భవిష్యత్తులో అమెరికాలో పనిచేయాలనుకునే విదేశీ విద్యార్థులలో ఆందోళన కలిగిస్తున్నాయి.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...