Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విప్లవ వీరుడు బఘా జతిన్
posted on: May 10, 2026 10:41AM

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. అయితే, కొందరి పేర్లు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడగా.. మరికొందరు వీరుల గాథలు మాత్రం ప్రాంతీయ పరిధులకే పరిమితమైపోయాయి. అటువంటి అరుదైన, అజేయమైన విప్లవకారుడు జతీంద్రనాథ్ ముఖర్జీ. అందరికీ బఘా జతిన్ గా సుపరిచితుడు బెంగాల్ గడ్డపై జన్మించిన ఈ విప్లవ సింహం. ఒకవేళ ఆయన ప్రణాళికలో విజయవంతమై ఉంటే, భారతదేశానికి 1920 ప్రాంతంలోనే బ్రిటీష్ విముక్తి లభించేదని చరిత్రకారులు విశ్లేషిస్తుంటారు.
సాయుధ పోరాటం, ఆధ్యాత్మిక చింతనల కలయికగా సాగిన ఆయన ప్రస్థానం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఒక ఉజ్వల ఘట్టం. బఘా జతిన్ వ్యక్తిత్వం కేవలం శారీరక దారుఢ్యానికే పరిమితం కాలేదు. ఆయన స్వామి వివేకానందుడి ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో పెరిగిన వ్యక్తి. దేశభక్తే పరమధర్మం అనే వివేకానందుడి సూక్తిని ఆయన త.చ. తప్పకుండా పాటించారు. ఆయన ఆధ్యాత్మికంగా గిరి సంప్రదాయానికి చెందిన సన్యాసి అయినప్పటికీ.. దేశ విముక్తి కోసం ఆయుధం పట్టడమే సరైన మార్గమని నమ్మారు. అరోబిందో ఘోష్, రాస్ బిహారి బోస్ వంటి మహనీయులతో కలిసి ఆయన విప్లవ నెట్‌వర్క్‌ను పటిష్టం చేశారు. చరిత్రకారులు ఆయనను కేవలం ఒక పోరాట యోధుడిగానే కాకుండా.. అలోచనలను ఆచరణలోకి మార్చే థింకర్ ఇన్ యాక్షన్ గా అభివర్ణిస్తుంటారు. ఆయనకు బఘా అంటే పులి అనే పేరు రావడం వెనుక ఒక ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఉంది.
ఒకానొక సందర్భంలో అడవిలో ఒక భారీ రాయల్ బెంగాల్ పులి ఎదురైనప్పుడు, కేవలం ఒక చిన్న ఖుక్రీ అంటే కత్తితో జతిన్ ఆ పులిని హతమార్చారు. ఆ పోరాటంలో తీవ్రంగా గాయపడినప్పటికీ.. వెనకడుగు వేయకుండా పోరాడిన ఆయన ధైర్యానికి గుర్తింపుగా ప్రజలు ఆయనను 'బఘా జతిన్' అని పిలుచుకోవడం ప్రారంభించారు. ఈయన పరాక్రమం ఎంతటిదంటే.. బ్రిటిష్ అధికారి చార్ల్స్ టెగార్ట్ సైతం.. ఇతను గనుక ఇంగ్లాండ్ దేశస్థుడై ఉంటే, నెల్సన్ విగ్రహం పక్కన ఈయన విగ్రహం ఉండేది అని ప్రశంసించారంటే.. ఆయన ధీరత్వం అర్థం చేసుకోవచ్చు. బఘా జతిన్ చేసిన పోరాటాలలో 1915 నాటి బురిబలం యుద్ధం అత్యంత కీలకమైనది. ఒడిశాలోని బలేశ్వర్ జిల్లాలో జరిగిన ఈ పోరాటాన్ని ఆధునిక హల్దీఘాటిగా వర్ణిస్తారు. కేవలం ఐదుగురు విప్లవకారులు సుమారు 500 మందికి పైగా ఉన్న బ్రిటీష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. జర్మన్ మౌజర్ పిస్టల్స్‌తో ట్రెంచ్ అంటే కందకాల యుద్ధం చేయడం ఆ రోజుల్లో ఒక సంచలనం. 1857 తర్వాత భారత గడ్డపై జరిగిన మొదటి ఆధునిక తరహా యుద్ధంగా దీన్ని పరిశోధకులు పేర్కొంటారు.
ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడిన జతిన్, శత్రువుల చేతిలో చిక్కడం ఇష్టం లేక.. ఆస్పత్రిలో తన గాయాలను తానే చీల్చుకుని వీరమరణం పొందారు. మనం చనిపోవచ్చు.. కానీ భారతదేశం మేల్కొంటుంది అని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తాయి. బఘా జతిన్ ప్రణాళిక చేసిన అతిపెద్ద వ్యూహం ఇండో-జర్మన్ కుట్. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారిపై దెబ్బకొట్టేందుకు జర్మనీ సాయంతో ఎస్ఎస్ మేవరిక్ (Maverick) అనే నౌక ద్వారా భారీగా ఆయుధాలను రప్పించాలని ఆయన ప్లాన్ చేశారు. ఈ ఆయుధాలతో ఫోర్ట్ విలియం సైన్యంలో తిరుగుబాటు తీసుకురావాలని భావించారు. అయితే, ఒక చెక్ గూఢచారి ద్రోహం కారణంగా ఈ రహస్య సమాచారం బ్రిటీష్ వారికి చేరడంతో ఆ భారీ ప్రణాళిక విఫలమైంది. ఒకవేళ ఈ కుట్ర విజయవంతమై ఉంటే, 1920లోనే భారత్‌కు స్వేచ్ఛ వచ్చేదని, మహాత్మా గాంధీ కంటే ముందే జతిన్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగేదని చరిత్రకారులు చెబుతారు.
దురదృష్టవశాత్తు, స్వాతంత్రాననంతర కాలంలో అహింసా పోరాటానికే అధిక ప్రాధాన్యత లభించడంతో, ఆయుధ విప్లవకారులైన బఘా జతిన్ వంటి వారి చరిత్ర పాఠ్యపుస్తకాల అంచులకు చేరిపోయింది. భగత్ సింగ్, ఆజాద్ వంటి వారికి లభించిన గుర్తింపు కూడా ఈయనకు దక్కలేదు. కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ఆయనకు సరైన స్మారకాలు లేకపోవడం విచారకరం. అయితే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాత కాలంలో చేసిన అంతర్జాతీయ పోరాటాలకు బఘా జతినే మార్గదర్శకుడని చెప్పవచ్చు. ఆయుధ సంపత్తి, ఆధ్యాత్మిక బలం, సైనిక వ్యూహం - ఈ మూడింటి కలయికతో ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎన్నటికీ మరువలేనిది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే.. దయచేసి మా పోర్టల్ https://www.teluguone.comను అనుసరించండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.






