Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫత్వాల మార్గం.. అరుణ్‌శౌరీ వాదనతో తర్కబద్దమైన చర్చలు
posted on: Jun 24, 2026 4:02PM

ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో షరియాగా పేర్కొన్న ఫత్వా అనేది మతపరమైన, దైవిక విషయాలపై అర్హత కలిగిన ముఫ్తీ జారీ చేసే చట్టపరమైన అభిప్రాయం. ఇది ముస్లింల దైనందిన జీవితాలు, సామాజిక, నైతిక సమస్యలకు పరిష్కారాలను మార్గనిర్దేశిస్తోంది. ఇస్లామిక్ చట్టాలపై లోతైన పరిజ్ఞానం ఉన్న పండితుడిని ముఫ్తీ అంటారు. ఫత్వాలు జారీ చేసే ప్రక్రియను ఇఫ్తా అని పిలుస్తారు. ఒక వ్యక్తి లేదా సంఘం అడిగిన నిర్దిష్ట ప్రశ్నకు సమాధానంగా, పవిత్ర ఖురాన్ , హదీసుల ఆధారంగా ఈ తీర్పు ఇస్తారని ముస్లీం పెద్దలు చెప్తారు. వివాహాలు, విడాకులు, వ్యాపార లావాదేవీలు, నైతిక సమస్యలు, ఆధునిక శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలపై స్పష్టతనివ్వడానికి ఫత్వాలు ఉపయోగపడతాయి. ఒక ముస్లిం తన విశ్వాసానికి అనుగుణంగా ఎలా ప్రవర్తించాలో షరియా చట్టం ఆధారంగా ఇవి దిశానిర్దేశం చేస్తాయి. ఫత్వాలు అనేవి కేవలం మతపరమైన అభిప్రాయాలు మాత్రమే, అవి భారతదేశం వంటి లౌకిక దేశాలలో న్యాయస్థానాలు విధించే శిక్షలు లేదా శాసనాలు కావు. ముఫ్తీలు ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ బోధనలు, ఇజ్తిహాద్ వంటి ప్రామాణిక గ్రంథాల ఆధారంగా ఫత్వాలు జారీ చేస్తారని చెప్తారు. ప్రముఖ పాత్రికేయులు అరుణ్‌శౌరీ వాదన ప్రకారం ఫత్వాలు కేవలం మత నిర్ణయాలు మాత్రమే . అవి ముస్లిం సమాజ జీవనాన్ని సంపూర్ణంగా నియంత్రించే చర్యలో ఉన్న షరీయత్.
భారతదేశ ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, మాజీ కేంద్ర మంత్రి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన అరుణ్ శౌరీ 1995లో ద వరల్డ్ ఆఫ్ ఫత్యాస్... షరీయత్ ఇన్ యాక్షన్ పుస్తకాన్ని విస్తృత పరిశోధనల ఆధారంగా రచించారు. భారత ఉపఖండంలో 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్యకాలం వరకు ఇచ్చిన ఫత్వాలను అధ్యాయనం చేసి దాన్ని రచించారు. శౌరీ ప్రధానంగా ఐదు ఫత్వా సంకలనాలు.. ఫతావా-ఎ-ఆలంగీరీ, ఫతావా-ఎ-రషీదియా, ఇమ్దాద్-ఉల్-ఫతావా, ఫతావా-ఎ-దేవ్బందియా, ఫతావా-ఎ-రహీమియాలను అధ్యాయనం చేశారు. ఆ సంకలనాలు ముఖ్యంగా దేవ్బంది పాఠశాల ఆలిమ్లు రచించారు. అది 1867లో ఉత్తర ప్రదేశ్లోని దేవ్బంద్లో స్థాపించబడిన ఇస్లామిక్ విద్యా సంస్థ.
•1867లో స్థాపించిన దేవ్బంద్ దారుల్ ఉలూమ్ .. ఆధునిక కాలంలో అతిపెద్ద ఫత్వా సంస్థకు ఆధారం.
* 1880-1920 మధ్య రషీద్ అహ్మద్ గంగోహీ రచించిన ఫతావా-ఎ-రషీదియా .. ప్రభావవంతమైన ఫత్వా సంకలనం
* 1895-1974 కాలంలో దారుల్ ఇఫ్తా దేవ్బంద్ అభివృద్ధి చెంది వేల ఫత్వాలు జారీ అయ్యాయి
* 1947 నాటికి దేశ విభజన తర్వాత ఫత్వా సంస్థ పాత్ర పెరగి, ముస్లిం వ్యక్తిగత చట్టం కొనసాగుతూ వచ్చింది
* 1986లో షాహ్ బానో తీర్పు వివాదంతో ఫత్వాల రాజకీయ ప్రభావం దేశవ్యాప్తంగా అందరి దృష్టికి వచ్చింది.
* 1995తో అరుణ్ శౌరీ 'ద వరల్డ్ ఆఫ్ ఫత్యాస్’ప్రచురణతో ఫత్వాలపై దేశవ్యాప్త వివాదం మొదలై చర్చలు దారి తీస్తోంది.
శౌరీ వాదన ప్రకారం ఉలమా (ఇస్లామిక్ విద్వాంసులు) ముస్లిం సమాజంపై అనుచిత అధికారాన్ని కలిగి ఉన్నారు. ఖురాన్ , హదీస్ (ప్రవక్త ముహమ్మద్ యొక్క సంప్రదాయాలు)లు గుత్తాధిపత్యంతో సాధారణ ముస్లింలపై నిర్ణయాత్మక అధికారాన్ని సాగిస్తున్నారు. ఫత్వాలు ప్రశ్నించడానికి వీలు కాని, దైవిక ఆదేశాల రూపంలో ఉంటాయి . మత గ్రంథాలలో స్పష్టంగా లేని విషయాలపై కూడా ఉలమా 'ఇజ్తిహాద్' ద్వారా నిర్ణయాలు ప్రకటిస్తారు. ఈ నిర్ణయాలను నిరాకరించడం అంటే 'బిద్అత్' లేదా మతద్రోహంగా పరిగణిస్తారు.
ఒక సాధారణ ముస్లిం ఉలమాను ప్రశ్నించే అవకాశం లేకుండా, వారి నిర్ణయాలను పాటించాల్సి వస్తుంది. ఇది ఒక రకమైన 'మత నిరంకుశత్వం' అని శౌరీ వాదిస్తారు. శౌరీ తన పుస్తకంలో ఫత్వాలు అత్యంత సూక్ష్మ విషయాలను కూడా నిర్దేశిస్తాయని వందలాది ఉదాహరణలతో చూపించే ప్రయత్నం చేశారు. టాయిలెట్‌కు వెళ్ళేటప్పుడు ఏ కాలు ముందు పెట్టాలి.
గడ్డం ఎంత పొడవు ఉండాలి ; నమాజు సమయంలో ఒక మిడత తినడం రోజువారీ ఉపవాసాన్ని భంగపరుస్తుందా?; ఫోటో తీయించుకోవడం హరాం (నిషిద్ధం) ;సినిమాలకు వెళ్ళడం, సంగీతం వినడం నిషిద్ధం; బ్యాంకు వడ్డీ 'రిబా' (వడ్డీ మీద నిషేధం) కింద వస్తుందా; విమాన ప్రయాణం, రైలు ప్రయాణం సందర్భంగా నమాజ్ ఎలా చేయాలి?.. వంటివి నిర్ధేశిస్తారని, అంటే జీవితంలోని ప్రతి సూక్ష్మ వివరాన్ని నియంత్రించే హక్కు ఇస్లాంకు ఉందని శౌరీ వాదించారు. ఇది ఒక ప్రజాస్వామ్య, బహుళత్వ సమాజంలో వ్యక్తి స్వేచ్ఛకు విరుద్దమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
శౌరి పుస్తకంలో అత్యంత వివాదాస్పద భాగం మహిళలకు సంబంధించిన ఫత్వాలు. శౌరీ ఉటంకించిన ఫత్వాల ప్రకారం. .. స్త్రీలు 'అక్లు (తెలివి), దీన్ (విశ్వాసం)లో లోపభూయిష్టంగా ఉంటారు. ఇది హదీస్ ఆధారంగా ఉటంకించబడింది. భార్య సమ్మతితో పని లేకుండా, భర్తకు తలాక్ మూడుసార్లు చెప్పే ఏకపక్ష అధికారం ఉంటుంది. భర్త అనుమతి లేకుండా భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. సమాన న్యాయం షరతుతో భర్త బహువివాహాలకు అనుమతి. స్త్రీ సాక్ష్యం పురుష సాక్ష్యం కంటే సగం విలువ మాత్రమే కలిగి ఉంటుంది. ఇవన్నీ లింగ వివక్షే అని శౌరీ పేర్కొన్నారు. అయితే ఈ ఫత్వాల్లో అనేకం ఖురాన్, సున్నా (ప్రవక్త అభ్యాసాలు)ను తప్పుగా అర్థం చేసుకోవడం, వక్రీకరించడం వల్ల వచ్చినవని ముస్లిం సంస్కర్తలు, ఉదారవాద పండితులు వాదిస్తారు.
ఫత్వాలు ఆధునిక జీవనశైలిపై విస్తృత నిషేధాలు విధిస్తాయని శౌరీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ నిషేధాలు ముస్లింలను ఆధునిక ప్రపంచం నుంచి వేరుచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దానికి సంబంధించి ఆయన కొన్నిటిని ఎత్తిచూపారు.
* వడ్డీ (రిబా)పై నిషేధం. అంటే బ్యాంకు వడ్డీ, బీమా, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు హరాం(నిషిద్దం). దాంతో ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పాల్గొనడం కష్టం
* సంగీతం వినడం, వాయించడం, ఫోటో తీయడం, చిత్రలేఖనం అన్నీ నిషిద్ధం
* పాశ్చాత్య వైద్యంపై ఆంక్షలు: ఆల్కహాల్ కలిగిన మందుల వినియోగం నిషిద్దం. ఆధునిక ఔషధాలలో అనేకం ఆల్కహాల్ ఆధారితమైనవే.
* హిందూ, పాశ్చాత్య గ్రంథాల అధ్యయనం నిషిద్ధం. ఇది విద్యా రంగంలో వెనుకబాటుకు దారితీస్తుంది.
• ప్రజాస్వామ్య ఎన్నికలలో పాల్గొనడం గురించి విభిన్న ఫత్వాలు. కొన్ని నిషిద్ధం అంటాయి.
* ముస్లింలు.. హిందువులు, ఇతర సమాజాల నుంచి 'వేరుగా' ఉండాలి.
•హిందువులతో కలిసి పండుగలు జరుపుకోకూడదు. దీపావళి దీపాలు వెలిగించడం నిషిద్ధం
* కొన్ని ఫత్వాల ప్రకారం హిందువులు వండిన ఆహారం తినడం నిషిద్ధం
* హిందువులకు 'నమస్కారం' చెప్పడం, వారి గుళ్ళలో ప్రవేశించడం నిషిద్ధం
* భారత జాతీయ గీతం పాడడం, విగ్రహ పూజ వంటివి ముస్లింలు చేయకూడదు
•ముస్లిం స్త్రీ ఇతర మతం పురుషుడిని పెళ్ళి చేసుకోకూడదు
ఇలాంటి ఫత్వాలతో 'వేర్పాటు' వాదన ప్రభలి, భారతీయ ముస్లింలను జాతీయ మూలస్రవంతిలో కలవనివ్వకుండా చేస్తుందని అరుణ్‌శైరి వాదించారు. ఇది ముస్లిం సమాజంలోని ఒక వర్గానికి సమానత్వం, అభివృద్ధి అందకుండా అడ్డుపడుతుందని పేర్కొన్నారు.
భారతదేశంలో ముస్లింలకు ముస్లిం పర్సనల్ లా వర్తిస్తుంది. ఇది మహమ్మదన్ లా (1937 షరియత్ అప్లికేషన్ యాక్ట్) ఆధారంగా ఉంటుంది. ఈ చట్టం ఫత్వాలకు అనుకూలంగా ఉండి, స్త్రీలకు నష్టం కలిగిస్తుందని శౌరీ వాదిస్తారు.
* షాహ్ బానో కేసు (1985): సుప్రీం కోర్ట్ 62 సంవత్సరాల విడాకుల మహిళకు భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఉలమా తీవ్రంగా వ్యతిరేకించి ఫత్వాలు జారీ చేశారు. దాంతో అప్పటి రాజీవ్ గాంధీ సర్కార్ ముస్లిం మహిళా చట్టం 1986 ద్వారా తీర్పును చెల్లుబాటు చేయలేదు
* ట్రిపుల్ తలాక్: భర్త మూడుసార్లు తలాక్ చెప్పిన వెంటనే విడాకులు. సుప్రీం కోర్ట్ 2017లో దీన్ని రాజ్యాంగవ్యతిరేకంగా ప్రకటించింది. 2019లో మోడీ ప్రభుత్వం చట్టం ద్వారా ట్రిపుల్ తలాక్ నేరంగా నిర్ణయించింది.
* దారుల్-ఖజా (ఇస్లామిక్ కోర్టులు): కొన్ని ముస్లిం సంస్థలు నడిపే అనధికారిక కోర్టులు ఫత్వాలు అమలు పరుస్తాయి. ఇవి రాజ్యాంగ న్యాయ వ్యవస్థకు సమాంతరంగా పని చేస్తాయి.
భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), వివక్ష నిషేధం (ఆర్టికల్ 15), వ్యక్తి స్వేచ్ఛ (ఆర్టికల్ 21) హామీ ఇస్తుంది. అయితే మత స్వేచ్ఛ (ఆర్టికల్ 25-28) , ముస్లిం వ్యక్తిగత చట్లాలు సంఘర్షణలకు దారితీస్తాయని శౌరీ వాదిస్తారు. ఉమ్మడి పౌర స్మృతి (UCC) ఈ సమస్యకు పరిష్కారం అని ఆయన స్పష్టంగా వాదిస్తారు.
అరుణ్‌సౌరీ ఫత్యాల పుస్తకంపై రాజకీయ, సామాజిక, మీడియా కోణాల్లో విభిన్న వాదనలున్నాయి. శౌరి అభిప్రాయాలు మద్దతిచ్చే వారు, వ్యతిరేకించే వారు వాదనల్లో పోటీ పడుతుంటారు. బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ వంటి హిందూ జాతీయవాద సంస్థలు ఫత్వాల ద్వారా ఇస్లాం 'ప్రత్యేకత' వాదాన్ని ఖండిస్తున్నాయి. వారి వాదనను బలపరచే ఆధారాలుగా ఈ పుస్తకాన్ని ఉపయోగించారు. ముస్లిం సంస్కరణవాదులు అంటే.. సయ్యద్ అహ్మద్ ఖాన్ సంప్రదాయంలో నిలిచే అభ్యుదయ ముస్లింలు ఉలమా అధికారాన్ని ప్రశ్నించడాన్ని స్వాగతించారు. అలాగే సెక్యులర్ పాత్రికేయులు, మహిళా హక్కుల ఉద్యమకారులు తలాక్, మహిళల హక్కులపై శౌరీ విశ్లేషణను ప్రశంసించారు.
మరోవైపు దేవ్బంది ఉలమా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిశులు శౌరి పుస్తకాన్ని 'ఇస్లాంఫోబిక్'గా.. అంటే 'ముస్లింలను అవమానించే' రచనగా ఖండించారు. కాంగ్రెస్, వామపక్షాల నేతలు 'మైనారిటీ విరోధి' అజెండాను ఫోకస్ చేసి రాజకీయప్రయోజనం కోసం చేసే ప్రయత్నంగా చూశారు. ముస్లిం మేధావులు ప్రొఫెసర్ ముషీరుల్ హసన్ వంటివారు.. ఫత్వాలను సందర్భం నుంచి వేరు చేసి చూపించారని విమర్శించారు. కొంతమంది ముస్లిం మహిళా కార్యకర్తలు .. ఫత్వాల విమర్శ సరైనదే అయినా, శౌరీ విధానం 'ముస్లింలను మొత్తంగా ముద్ర వేస్తుంది' అని అభ్యంతరం చెప్పారు
ఏదేమైనా శౌరీ పుస్తకం తర్వాత , ఫత్వా సంస్కృతిపై చర్చలు విస్తృతమయ్యాయి. ఉత్తరాఖండ్ 2024లో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు చేసిన మొదటి రాష్ట్రమైంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశానికి యూసీసీ వర్తింపజేయాలని ఆలోచిస్తుంది.
ఒక వైపు యూసీసీ వివాహం, విడాకులు, వారసత్వంలో అందరికీ సమాన చట్టాన్ని తీసుకొస్తుంది. మరో వైపు ముస్లిం పర్సనల్ లా బోర్డు దీన్ని 'ఇస్లామిక్ మత స్వేచ్ఛపై దాడి' అని ఖండిస్తుంది. అభ్యుదయ ముస్లిం మహిళా సంస్థలు యూసీసీ సంస్కరణలను స్వాగతిస్తున్నాయి.
శౌరీ పుస్తకం 'ఫత్వాలు .. చర్యలో ఉన్న షరీయత్(సరైన మార్గం)' అని నిరూపించే ప్రయత్నంలో తర్కబద్ధమైన వాదన, ఎంపికతో కూడిన ఉటంకింపులు రెండూ ఉన్నాయి. ఇస్లామిక్ సంస్కర్తలు, మహిళా హక్కుల ఉద్యమకారులు, మరియు ముస్లిం ఉదారవాదులు తమ సమాజంలోని అధికార నిర్మాణాన్ని బహిరంగంగా ప్రశ్నించే వాతావరణం సృష్టించడానికి ఈ పుస్తకం దోహదం చేసింది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






