Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భవిష్యత్తును నిర్మించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్
posted on: Jun 19, 2026 9:17AM
.webp)
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టి ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్‌ది సాధారణ సక్సెస్ స్టోరీ కాదు. టెక్నాలజీ, ఫైనాన్స్, రాజకీయాలు, మీడియా, సామాజిక పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ ఎదిగిన సూపర్ స్టోరీ. ఎలాన్ మస్క్.. ఈ పేరును ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎదిగిన ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ట్రిలియనీర్ అంటే లక్ష కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ. 95 లక్షల కోట్లు. ఇప్పుడు అంతకుమించిన సంపద మస్క్ సొంతం.
మస్క్ అభిమానులు ఆయన్ని .. భవిష్యత్తును నిర్మించిన మనిషిగా అభివర్ణిస్తారు. విమర్శకులు ..అతి ధనసంపత్తితో, రాజకీయాలను అడ్డంపెట్టుకుని తప్పుడు సమాచారంతో ఎదిగారని, కార్మిక హక్కుల ఉల్లంఘిస్తారని విమర్శిస్తారు. వాస్తవానికి ఈ రెండు ధృవాల మధ్యే ఎలాన్ మస్క్ నిర్మించిన సామ్రాజ్యం నిలిచివుంది. స్పేస్‌ఎక్స్ ఐపీఓ అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయిన తర్వాత మస్క్ నికర సంపద ఇప్పుడు ఏకంగా 1.11 ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచ కుబేరుల్లో చూస్తే మస్క్ దరిదాపుల్లో మరెవరూ లేకపోవడం విశేషం. మస్క్ ఈ స్థానానికి చేరుకునేందుకు ఎన్నో సవాళ్లను అధిగమించారు.
ఎలాన్ రీవ్ మస్క్ ఆయన పూర్తి పేరు. 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. తండ్రి ఎర్రోల్ మస్క్, తల్లి మే మస్క్. వారిది ఎగువ మధ్య తరగతి కుటుంబం. దక్షిణాఫ్రికా పాఠశాలలో తోటి విద్యార్థులతో తీవ్రంగా వేధింపులకు (బుల్లింగ్) గురైన బాలుడు. బాల్యంలో కంప్యూటర్లపై ఆసక్తితో స్వయంగా కోడింగ్ నేర్చకుని, 12 ఏళ్ల వయసులో ‘బ్లాస్టర్’ అనే వీడియో గేమ్ రూపొందించి విక్రయించి బాల్యంలోనే వ్యాపారవేత్త అయ్యారు.
దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష పాలన, కంపల్సరీ మిలిటరీ సర్వీస్ వంటి వాటిపై అసంతృప్తితో 1988లో కెనడాకు, తరువాత అమెరికాకు వలస వచ్చారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఫిజిక్స్, ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేశారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసి మనీ మిషన్‌గా ఎదిగారు. విద్యుత్ కార్లు అసాధ్యం అని, రాకెట్లు మళ్లీ ఉపయోగించడం కల్పితం అని ప్రపంచం నవ్వుకున్న సమయంలో వాటిని వాస్తవంగా మార్చిన వ్యాపారవేత్త.
మస్క్ మొదటి వ్యాపార ప్రయత్నం ZIP2. తన సోదరుడు కింబల్ మస్క్‌తో కలిసి స్థాపించిన ఆ కంపెనీని 1999 లో దాదాపు 300 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఆ డబ్బుతో X.com అనే ఆన్లైన్ పేమెంట్ కంపెనీని స్థాపించి, తర్వాత దాన్నిపేపాల్‌గా మార్చి సక్సెస్ అయ్యారు. తర్వాత పేపాల్‌ను ఈబేకు 1.5 బిలియన్ డాలర్లకు విక్రయించారు. ప్రారంభ దశలోనే మస్క్ ‘హై–రిస్క్, హై–రివార్డ్’ మోడల్ స్వీకరించారు. జిప్ 2, పేపాల్ లాభాలను పూర్తిగా కొత్త రంగాలైన స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వంటి విభాగాల్లో పెట్టుబడిగా పెట్టారు.
పేపాల్ విక్రయించాక మస్క్ దాదాపు తన మొత్తం సంపదను టెస్లా, స్పేస్‌ఎక్స్‌లలో పెట్టుబడిగా పెట్టారు. 2008లో ఒక దశలో స్పేస్ ఎక్స్, టెస్లా రెండు కూడా దివాలా అంచుకు చేరుకొని పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా చాలా కష్టంగా మారింది. అయినా మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అదే సంవత్సరం నాసా నుంచి స్పేస్‌ఎక్స్‌కు పెద్ద ఒప్పందం రావడం.. టెస్లాకు కూడా పెట్టుబడులు లభించడం ఆయన జీవితాన్నే మార్చేశాయి.
ఎలక్ట్రిక్ కార్లు అంటేనే నెమ్మదిగా వెళ్లే, పరిమిత సామర్థ్యం ఉన్న వాహనాలని ప్రపంచం భావించేది. కానీ టెస్లా ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. సంప్రదాయ కార్ల తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు టెస్లానే ప్రధాన కారణమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
స్పేస్‌ఎక్స్ ద్వారా మస్క్ అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలు మరింత పెద్దవి. ఒకప్పుడు ఒక్క రాకెట్ ప్రయోగం కోసం వందల మిలియన్ డాలర్లు ఖర్చవుతుండగా.. పునర్వనియోగ రాకెట్ల ద్వారా అంతరిక్ష ప్రయాణ ఖర్చుల్ని భారీగా తగ్గించారు. స్పేస్ ఇండస్ట్రీలో కొత్త పోటీ తీసుకొచ్చారు. నాసా వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపడం నుంచి స్టార్ లింక్ ఉపగ్రహాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇంటర్నెట్ అందించడం వరకు స్పేస్‌ఎక్స్ శిఖరానికి చేరింది.
2022లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. మస్క్ జీవితంలోనే అత్యంత చెత్త వ్యాపార నిర్ణయం అని పలువురు విమర్శించారు. ప్రకటనదారులు కూడా వెనక్కి వెళ్లారు. మస్క్ మాత్రం అవేమీ ఆలోచించకుండా.. ట్విట్టర్‌ను x గా మార్చేసి సోషల్ మీడియా మాత్రమే కాకుండా.. దీనిని డిజిటల్ సేవల వేదికగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా మధ్య పోటీ కొనసాగుతున్న సమయంలో మస్క్ ఎక్స్ ఏఐను ప్రారంభించారు. ఏఐ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.
తాజాగా స్పేస్‌ఎక్స్ ఐపీఓ ద్వారా కంపెనీ 75 బిలియన్ డాలర్ల నిధుల్ని సమీకరించారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచింది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్ వాటా విలువే వందల బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో.. టెస్లా, ఎక్స్, xAI, స్టార్‌లింక్ వంటి ఇతర ఆస్తులన్నీ కలుపుకుని ఆయన మొత్తం సంపద ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఎలాన్ మస్క్‌ను అభిమానించే వారు ఆయనను మాడ్రన్ ఎడిసన్‌గా అభివర్ణిస్తారు. విమర్శించే వారు ఆయన దగ్గర అధిక శక్తి కేంద్రీకృతమై ఉందని అంటారు. కానీ ఒక విషయం మాత్రం అంతా అంగీకరిస్తారు. డిజిటల్ పేమెంట్స్ , ఎలక్ట్రిక్ కార్లు , అంతరిక్ష రంగం , ఉపగ్రహ ఇంటర్నెట్ , సోషల్ మీడియా, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఇలా ఇన్ని రంగాలను ఒకే జీవితకాలంలో ప్రభావితం చేసిన వ్యక్తులు చరిత్రలో చాలా అరుదు. ప్రపంచం 'అది అసాధ్యం' అని చెప్పినప్పుడు.. మస్క్ 'ఎలా సాధ్యం చేయాలి?' అని ఆలోచించాడు. అదే ఆయనను ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా నిలిపిందని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరి మస్క్‌ను ప్రపంచం ‘భవిష్యత్తును నిర్మించిన మనిషి’గా గుర్తుంచుకుంటుందా? లేక భవిష్యత్తును నిర్మించినప్పటికీ, దాని పరిణామాలను సమతుల్యంగా నిర్వహించలేకపోయిన వ్యక్తిగా చూస్తుందా? అనేది చూడాలి
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






