Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంతర్జాతీయ విమానయాన రంగం కుదేలు!
posted on: Apr 27, 2026 3:08PM

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం యూరప్ ఖండాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు గొంతుకగా ఉన్న హోర్ముజ్ జలసంధి మూతపడటం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని కుదేలు చేస్తోంది. అతలాకుతలం చేస్తోంది. కుదిపేస్తోంది. హెర్మూజ్ మూత కారణంగా జెట్ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అదే సమయంలో ఇంధన లభ్యత విషయంలోనూ తీవ్ర అంతరాయం ఏర్పడింది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇంధన ధరలు దాదాపు రెట్టింపు అయ్యియి. ఈ పరిస్థితి యూరప్‌లోని ప్రముఖ విమానయాన సంస్థలు తమ సర్వీసులను భారీగా తగ్గించుకోవడానికి దారి తీసింది.
ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధి ద్వారా 20 శాతం చమురు, 30 శాతం వరకు జెట్ ఇంధనం సరఫరా అవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో ఐరోపా దేశాలకు అందే ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా ప్రకారం, ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే యూరప్ వద్ద ఉన్న నిల్వలు మరో ఆరు వారాలకు సరిపోవడమే గగనం. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా సంక్షోభంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభానికి అద్దం పడుతూ జర్మనీకి చెందిన దిగ్గజ ఎయిర్‌లైన్ లుఫ్తాన్సా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వేసవి సీజన్ నుంచి శరదృతువు వరకు దాదాపు ఇరవై వేల విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా లాభదాయకం కాని చిన్నపాటి దూరాల ప్రయాణాలను నిలిపివేస్తోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటూ ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం లుఫ్తాన్సా మాత్రమే కాకుండా కేఎల్ఎం, ఎస్ఏఎస్ వంటి ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.
పర్యాటక రంగంపై ఈ ప్రభావం ఊహించని స్థాయిలో ఉండనుంది. సాధారణంగా వేసవిలో యూరప్ పర్యాటక రంగం ద్వారా బిలియన్ల కొద్దీ ఆదాయం, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు లభిస్తాయి. కానీ ప్రస్తుత ధరల పెరుగుదల.. విమానాల రద్దు వల్ల పర్యాటకులకు ప్రత్యామ్నాయాలు తగ్గిపోయాయి. మిగిలి ఉన్న కొన్ని విమానాల్లో కూడా టికెట్ ధరలు భారీగా పెరగడంతో పాటు, చెక్-ఇన్ బ్యాగేజీ మరియు ఇతర సేవలపై అదనపు రుసుములు వసూలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇంధన రేషనింగ్ విధానాన్ని కూడా అమలు చేయాల్సి రావచ్చని అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ ఐఏటిఏ అంచనావేస్తోంది. మరోవైపు, అమెరికా వంటి దేశాలు సొంతంగా ఇంధన ఉత్పత్తిని కలిగి ఉండటం వల్ల యూరప్‌తో పోలిస్తే కొంత మేర రక్షణలో ఉన్నాయి. అయితే ఆసియాలోని వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలు మాత్రం మధ్యప్రాచ్య చమురుపై ఆధారపడటం వల్ల ఇప్పటికే షెడ్యూల్ కోతలను ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఒక చోట ఏర్పడిన ఇంధన ఒత్తిడి ప్రపంచమంతటా విస్తరిస్తోంది. దీర్ఘకాలికంగా చూస్తే, ఈ సంక్షోభం విమానయాన రంగానికి కొత్త పాఠాలు నేర్పుతోంది.
కేవలం మధ్యప్రాచ్యంపైనే ఆధారపడకుండా ఇంధన సరఫరా మార్గాలను వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పర్యావరణ హితమైన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్) వంటి ప్రత్యామ్నాయాలపై పెట్టుబడులను వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఎయిర్‌లైన్స్ తమ పాత, ఎక్కువ ఇంధనాన్ని వినియోగించే విమానాలను పక్కన పెట్టి ఆధునిక సాంకేతికత వైపు మళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. వేసవి సెలవుల కోసం ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణికులు ప్రస్తుతానికి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఫ్లెక్సిబుల్ టికెట్లను ఎంచుకోవడం అలాగే.. ఎయిర్‌లైన్స్ ఇచ్చే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించడం మేలని అంటున్నారు. ఆకాశంలో ఎగిరే విమానాల వెనుక ఇప్పుడు కేవలం ఇంజిన్ శక్తి మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన సమీకరణాలు కూడా కీలకంగా మారాయి.
-సీతారాం కంఠంనేని



.webp)


