హనీమూన్ తర్వాత కొత్త జంటలకు అర్థమయ్యే చేదు నిజాలు ఇవే!

posted on: Apr 22, 2026 3:17PM


పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో..  కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్  అయిపోయాక లేదా పెళ్లైన  రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది.  ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి,  వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు.  అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి,  ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా,  డిజప్పాయింట్ గా అనిపిస్తుంది.   పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత  జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ,  పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు.  ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..

 ప్రేమ అంటే..

పెళ్లికి ముందు,  పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు  ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ  జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు.  బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది.

పర్పెక్ట్ లైఫ్ పార్టనర్..

పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు.  కానీ పెళ్ళి  తర్వాత  ఒకే ఇంట్లో కలిసి జీవించడం  మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు,   రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం,  కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి.  అయితే..  అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి,  బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి.

గొడవలు..

పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు.  గొడవ పడని  భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు.  విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే.

డబ్బు..

ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం  వంటి పరిస్థితులు ఎదురైతే.. అది  వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు.

పర్సనల్ స్పేస్..

పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు  పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ  భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.

పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

                         *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...