ఇది ప్ర‌పంచంలోనే అత్యంత అదృష్ట‌వంతుడి బ‌యోగ్ర‌ఫీ!

సాధ‌న‌మున స‌మ‌కూరు పనులు ధ‌ర‌లోన అంటారు. చంద్ర‌బాబు అంటే ఎన్నో గెలుపులకు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ మాత్రమే కాదు, ఎన్నో ఓటముల నుంచి ప‌దే ప‌దే కోలుకుని తిరిగి తిరిగి పున‌రుజ్జీవం పొంద‌డంలో నిష్ణాతుడు. ఆయ‌న అదృష్ట‌మ‌ల్లా ఇదే.  ఇదే వైయ‌స్, కేసీఆర్ కుటుంబాల‌ను చూడండి.. ప్ర‌స్తుతం అవి ఎంత దారుణ‌మైన ప‌రిస్థితుల్లోకి దిగ‌జారి పోయాయంటే.. ఇద్ద‌రు పిల్ల‌లుంటే మంచిద‌ని క‌న‌డం అటుంచితే.. వారి ద్వారా ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు అనుభ‌విస్తున్న ఆత్మక్షోభ అంతా ఇంతా కాదు.

గ‌తంలో వైయ‌స్ఆర్ కుమారుడు, కుమార్తె బ‌జార్న ప‌డ్డం వ‌ల్ల ఆ కుటుంబం ఎంత ఇబ్బందుల పాలైందంటే.. ఏకంగా ఆ త‌ల్లి విజ‌య‌మ్మ మా కుటుంబ గొడ‌వ‌ల‌ను మీ రాజ‌కీయాల‌కు, జ‌ర్న‌లిజాల‌కూ వాడుకోవ‌ద్ద‌ని  మ‌న‌వి చేసేంత‌.  ఆ అన్నా చెల్లెళ్లు.. వాళ్ల‌ల్లో వాళ్లు శ్రీకృష్ణ‌, సుభ‌ద్ర‌ల్లా ఉంటే ఎవ‌రు మాత్రం వారి గురించి చెడుగా రాస్తారు? లోపం త‌న పిల్ల‌ల్లో పెట్టుకున్న ఆమె ఇత‌రుల‌పై నింద వేశారు. 

ఇక చూస్తే కేసీఆర్ కి కూడా స‌రిగ్గా వైయ‌స్ఆర్  లాగానే ఇద్ద‌రు పిల్ల‌లు. అచ్చం జ‌గ‌న్, ష‌ర్మిళ‌లా ఒక కుమారుడు, ఒక కుమార్తె.. కేటీఆర్, క‌విత‌.  ప్ర‌స్తుతం క‌విత చేస్తున్న ఆరోప‌ణ‌ల దెబ్బ‌కు ఫామ్ హౌస్ లో గంట‌ల త‌ర‌బ‌డి మంత‌నాలు చేస్తున్నా అవి ఒక కొలిక్కి రావ‌డం లేదు. ఇక కేటీఆర్ అయితే త‌న చెల్లెలి మాట‌ల దెబ్బ‌కు ఫామ్ హౌస్ లో గ‌త కొన్నాళ్లుగా బిక్కు బిక్కుమంటున్నారు.

మొద‌ట్లో కేసీఆర్ దేవుడు, ఆపై కేటీఆర్ దెయ్యం అన్న అర్ధ‌మొచ్చేలా కామెంట్ చేసిన ఆమె.. త‌ర్వాత హ‌రీష్‌, రావు సంతోష్ రావు అతి పెద్ద విల‌న్లుగా చిత్రించ‌డంతో.. అది వారి సంగ‌తేమోగానీ ప్ర‌త్య‌ర్ధుల పాలిట అణ్వాయుధంగా మారింది. మీ ఇంటి మ‌నిషే మీరు అతి పెద్ద అవినీతి ప‌రుల‌ని అంత‌లేసి ఆరోప‌ణ‌లు చేస్తుంటే.. మీరు కాళేశ్వ‌రం మీద క‌మిష‌న్ ర‌ద్దు చేయాల‌ని పిటీష‌న్లు ఎలా వేస్తార‌ని నిల‌దీస్తున్నారు ప్ర‌త్య‌ర్ధి పార్టీల వారు.  అందుకసలు మీకు నైతిక హ‌క్కుందా? అన్న కోణంలో వినిపిస్తున్న కామెంట్ల‌తో నేన‌స‌లు  కుమార్తెను కన్నానా?  క‌న్నానా లేక   ప్ర‌త్య‌ర్ధిని క‌ని.. ఇన్నాళ్ల పాటు  న‌ట్టింట తిర‌గ‌నిచ్చానా? అన్న మ‌నోవేద‌న‌తో కుమిలిపోతున్నారు కేసీఆర్.

అదే చంద్రబాబు విష‌యానికి వ‌స్తే ఇలాంటి గొడ‌వ‌లేమీ లేవు. ఉన్న‌ది ఒకే ఒక్క‌డు. ఆ ఒక్క‌డు కూడా.. బుద్ధి మంతుడు, చ‌దువుకున్న‌వారు. అన్నింటా ఆరితేరుతున్న‌వారు. భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగా ఎదుగుతున్న వారు. యోధాను యోధుల‌ను మ‌ట్టిక‌రిపించిన మ‌హావీరుడిగా పేరు సాధిస్తున్నవారిగా గుర్తింపు పొందుతున్న వారు.. ఆయనే లోకేష్.

బేసిగ్గా రాజ‌కీయ నాయ‌కుల పుత్ర‌ర‌త్నాలు ఎలా ఉంటారు? వారి వారి చుట్టూ ఎన్నేసి అలిగేష‌న్లు, ఇత‌ర‌త్రా గొడ‌వ‌లు వ్య‌వ‌హారాల‌తో అంట‌కాగుతుంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ మాట‌కొస్తే వైయ‌స్ కుమారుడు జ‌గ‌న్ అవినీతిలో అతి పెద్ద సామ్రాజ్య నిర్మాత‌గా ప్ర‌పంచ ప్ర‌సిద్ధి. భార‌త న్యాయ సంహిత‌కే స‌వాలు విసురుతున్న వారిగా ప్ర‌ఖ్యాతి.  ఇక కేటీఆర్ సంగ‌తి స‌రే స‌రి. ఆయ‌న ఫామ్ హౌస్ లీల‌లు బ‌య‌ట పెడ‌తామంటూ సాక్షాత్ సొంతింటి  వారే కామెంట్లు చేస్తుంటే ఏం చేయాలో పాలు పోని ప‌రిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇద్ద‌రు మ‌హానేత‌ల వార‌సులు ఇద్ద‌రికిద్ద‌రే అన్న పేరు వ‌చ్చేసింది.

అదే లోకేష్ విష‌యానికి వ‌స్తే.. చిన్న‌ప్ప‌టి  నుంచి స‌రైన చ‌దువు చ‌దువుకోవ‌డం మాత్ర‌మే కాదు.. త‌న టాలెంట్ తో స్టాన్ ఫ‌ర్డ్ స్థాయి చ‌దువు, ఆపై వ‌ర‌ల్డ్ బ్యాంక్, సింగ‌పూర్ సీఎం ఆఫీసుల వంటి వాటిలో కొలువు చేసి.. త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా నిల‌వాల‌న్న కోరిక‌తో ఇక్క‌డికి వ‌చ్చి అనుకున్న‌ది అనుకున్న‌ట్టు సాధించ‌డంలో స‌వ్య‌సాచిగా ఎదుగుతున్నారు.

పాద‌యాత్ర చేయాల్సి ఉంటుందంటే చేస్తారు. తండ్రి జైలుకెళ్లిన‌పుడు యాత్ర‌ల‌న్నీ ఆపి బెయిలు కోసం ఢిల్లీ వెళ్లి పోరాడారు. ఆపై క‌ష్ట‌సాధ్య‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో ఒక సారి ఓడినా వెర‌వ‌క మళ్లీ అక్కడ నుంచే పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. ఇప్పుడు చూస్తే విద్యా మంత్రిగా.. విద్యా శాఖ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చి.. అద్భుత‌మైన ఫ‌లితాలను సాధిస్తున్నారు.  ఇక ఐటీ మంత్రిగా ఆయ‌న హ‌యాంలో గూగుల్ విశాఖ‌లో పాతిక వేల మందికి ఉద్యోగాలొచ్చేలాంటి డాటా సెంట‌ర్ పెట్ట‌డానికి ముందుకొచ్చింది. ఇంకా ఎన్నో కంపెనీలు ఏపీ బాట ప‌డుతున్నాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే విజ‌యాలు. నిజానికి ఇలాంటి కొడుకును క‌న్న తండ్రి అదృష్ట‌మే అదృష్టం క‌దా? అన‌క మాన‌రు ఎవ‌రైనా స‌రే. 

ఇక చంద్ర‌బాబుకు త‌న‌యుడే కాదు.. స‌తీమ‌ణి  ద్వారా కూడా  చంద్రబాబు  అదృష్టవంతులనే చెప్పాలి. ఒక స‌మ‌యంలో ఇంటికొక ఐటీ ఎంప్లాయి ఉండాల‌ని నిన‌దించిన చంద్ర‌బాబు, ప్ర‌స్తుతం భువ‌నేశ్వ‌రి స్ఫూర్తితో ఇంటికొక ఎంట‌ర్ ప్రైన్యూర్ ఉండాల‌ని అంటున్నారు. ఈ దిశ‌గా ర‌త‌న్ టాటా హ‌బ్ పెట్టి ప్రోత్స‌హిస్తున్నారు. ఇటు కొడుకును ప్ర‌యోజ‌కుడిగా తీర్చిదిద్ద‌డం మాత్ర‌మే కాదు.. అటు త‌న భ‌ర్త చెప్పింది చెప్పిన‌ట్టు చేసే భార్య క‌లిగి ఉండ‌టం అతి పెద్ద అదృష్టాల్లోకే అతి పెద్ద అదృష్టం.

ఇక  ఆయన  సొంత విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని అంద‌రూ అనుకుంటుండ‌గా.. అలాంటిదేం లేదు. కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు. ఆ కృషి ప‌దే ప‌దే చేస్తూ పోతే మ‌హారుషుల‌వుతారు అన్న మాట‌లకు నిద‌ర్శ‌నంగా.. నిలుస్తున్నారు బాబు. బాబు   చ‌రిత్ర‌గానీ, ట్రాక్ రికార్డ్ కానీ అందుకోవ‌డం సాధ్య‌మేనా? అన్న‌ది  రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోన్న మాట‌. ఒక ఫినిక్స్ ప‌క్షి  త‌న‌కు తాను తిరిగి కోలుకునేలా ఎలా చేస్తుందో అలా చేస్తూ.. ఈ రోజు బాబు 4. 0 పాల‌న అందిస్తూ ముందుకెళ్తున్నారు.  ఒక ర‌కంగా  చెబితే.. ఇది ఒక ప్ర‌పంచంలోనే అత్యంత అదృష్ట‌వంతుడి తాలూకా బ‌యోగ్ర‌ఫీ. ఈ అదృష్టం మ‌హానేత‌లుగా పేరున్న పెద్ద పెద్ద వారికి లేని అదృష్టంగా చెప్పాలంటారు ప‌లువురు విశ్లేష‌కులు. మ‌రి మీరేమంటారు???

Online Jyotish
Tone Academy
KidsOne Telugu