Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...1971 బెంగాల్ మారణహోమం.. అప్పుడు- ఇప్పుడూ ఒక చారిత్రక, వర్తమానం!
posted on: May 25, 2026 10:27AM

1971లో తూర్పు పాకిస్తాన్ అంటే, నేటి బంగ్లాదేశ్.. భూభాగంలో జరిగిన సంఘటనలు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దక్షిణాసియాలో జరిగిన అతిపెద్ద మారణహోమంగా చరిత్రలో నిలిచిపోయాయి. పాకిస్తానీ సైన్యం, దానికి అనుబంధ మిలీషియా బలగాలైన రజాకార్‌లు, అల్ బదర్, అల్ షమ్స్ కలిసి బెంగాలీ హిందువులు, బంగ్లా జాతీయవాదులు, మేధావులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలపై నిర్వహించిన వ్యవస్థీకృత హింసను అనేక పరిశోధకులు, మానవ హక్కుల సంస్థలు జనసంహారం గా వర్ణిస్తున్నాయి.
మిలియన్ల ప్రాణాలు, మిలియన్ల శరీరాలు, కోట్ల జీవితాలు.. ఒకే రాజకీయ,సైనిక నిర్ణయాల బలి.. ఇదీ ఒక్క మాటలో చెబితే ఆనాటి పరిస్థితి. పలు పరిశోధనల ప్రకారం, 1971లో పాకిస్తానీ సైన్యం, అనుబంధ మిలీషియా బలగాలు సుమారు 3 మిలియన్ల మందిని హతమార్చినట్లు అంచనాలు ఉన్నాయి. సుమారు ఆరు లక్షల నుంచి మిలియన్లలో బెంగాలీ మహిళలపై అత్యాచారాలు జరిగాయని, కొందరు రచయితలు అంటోన్న మాట. సుమారు 2 నుంచి 4 లక్షల మంది మహిళలు.. అనే కన్సర్వేటివ్ అంచనాలున్నాయి. మరికొందరు ఆరు మిలియన్ల వరకు ఉన్నారంటూ కాస్త పెద్ద సంఖ్యలను చెబుతారు. కానీ, ఏకాభిప్రాయం మాత్రం ఒకటే. ఇది ఒక వ్యవస్థీకృత లైంగిక నేరం అనడంకంటే లైంగిక యుద్ధం అనడం సరిగ్గా ఉంటుందేమో.
పాకిస్తానీ సైన్యం, మహిళలను హ్యూమన్ కా మాల్ అంటే అందరికీ చెందిన ఆస్తి గా పిలిచిందని, శిబిరాల్లో వారిని సామూహిక అత్యాచారాలకు గురిచేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు, స్మృతులు, పరిశోధన గ్రంథాలు చెబుతాయి.
సుమారు 10 మిలియన్ల బెంగాలీ హిందువులు భారతదేశానికి శరణార్థులుగా పారిపోయి వచ్చారు.
1971 మార్చి 26 నుంచి డిసెంబర్ 16 వరకు, మొత్తం 30 మిలియన్ల మంది స్థాన చలనం చెందారని, ఇది ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మానవ స్థానచలనాల్లో ఒకటిగా చెబుతారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, స్థానచలనాలు నమోదైన ఘటనలు అరుదు. 1971 బెంగాల్ మారణహోమం వాటిలో అగ్రస్థానంలో నిలుస్తుందని చెబుతారు చరిత్రకారులు.
ఇది కేవలం యుద్ధం కాదు. మహిళల శరీరాలపై నడిపిన ఒక వ్యవస్థీకృత దాడి. పాకిస్తానీ సైన్యం, బెంగాలీ మహిళలను హ్యూమన్ కా మాల్ అని పిలుస్తూ, వారిని సైనిక శిబిరాలకు, తాత్కాలిక నిర్బంధ కేంద్రాలకు తరలించి, సామూహిక అత్యాచారాలకు గురిచేసినట్లు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఈ లైంగిక హింసకు మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు పరిశోధకులు.
ఇందులో ముఖ్య ఉద్దేశాలేంటంటే, బెంగాలీ సమాజాన్ని మానసికంగా కూల్చివేయడం. ఆపై వారిని దారుణంగా అవమానించడం మరీ ముఖ్యంగా హిందూ, బంగ్లా జాతీయవాద కుటుంబాలను సామాజికంగా అవమానించడం. వారిని మా రక్తంతో కలిపేస్తాం అనే భయానక వ్యాఖ్యలు, బలవంతపు గర్భధారణల ద్వారా ఒక డెమోగ్రాఫిక్ వార్ నడిపే ప్రయత్నం చేయడం.
యుద్ధం ముగిసిన తర్వాత, బంగ్లాదేశ్‌లో బిరంగనా అంటే వీర మహిళలుగా గుర్తింపు పొందిన వేలాది మహిళలు, జీవితాంతం శారీరక–మానసిక గాయాలతో జీవించాల్సి వచ్చింది. 1971లో బుల్లెట్లు పురుషులపై నడిచినా, యుద్ధం అసలు బరువు మహిళల శరీరాలపై పడిందన్న మాట వినిపించింది.
భారత తూర్పు సరిహద్దులపై మానవ ప్రవాహం ఎలా సాగిందంటే, 10 మిలియన్ల హిందువుల పారిపోవడం, 30 మిలియన్ల మంది స్థాలచలనం చెందడం వంటి ఘటనలు నమోదయ్యాయి.
ఒక దేశం నుంచి మరో దేశానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి.. మానవ సముద్రం కదిలిన దృశ్యం కనిపించింది.
పాకిస్తానీ సైన్యం, ముఖ్యంగా బెంగాలీ హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్యలు, అత్యాచారాలు, గ్రామాల దహనం చేయడంతో, లక్షల కుటుంబాలు తమ ఇళ్లు, భూములు, ఆస్తులు వదిలి పారిపోవాల్సి వచ్చింది. సుమారు 10 మిలియన్ల హిందువులు భారతదేశానికి శరణార్థులుగా వచ్చారని, వీరిలో చాలా మంది పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోం, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందారు.
మొత్తం 30 మిలియన్ల మంది హిందువులు, ముస్లింలు, ఇతర సమూహాలు.. తమ నివాస ప్రాంతాల నుంచి బలవంతంగా తరలించబడ్డారు లేదా పారిపోవాల్సి వచ్చింది.
ఈ స్థాన చలనం కారణంగా, స్థానిక వనరులపై ఒత్తిడి, ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక భారంతో పాటు, ఒక దీర్ఘకాలిక సామాజిక మానసిక గాయాన్ని కూడా మిగిల్చింది. 1971లో తూర్పు బెంగాల్ నుంచి భారత తూర్పు సరిహద్దుల దాకా కదిలిన మానవ ప్రవాహం, గంగ–బ్రహ్మపుత్ర నదుల వరదలకంటే పెద్దదే అని చెప్పాలి. అయితే అది నీటి ప్రవాహం కాదు, భయంతో పారిపోయిన మనుషుల ప్రవాహం.
జనసంహారం అనే పదం విషయానికి వస్తే.. చరిత్ర, న్యాయం, రాజకీయాల మధ్య పాకిస్తానీ సైన్యం చర్యలను ఎలా వర్ణిస్తున్నారు? అనేక పరిశోధకులు, మానవ హక్కుల సంస్థలు, బంగ్లాదేశ్ ప్రభుత్వం—ఇవన్నీ 1971 సంఘటనలను జనసంహారం గా పిలుస్తున్నాయి. కానీ అంతర్జాతీయ న్యాయస్థాయిలో పూర్తి గుర్తింపు ఇంకా అసంపూర్ణం. పలు చరిత్రకారులు, జనసంహార అధ్యయన నిపుణులు, మానవ హక్కుల సంస్థలు 1971లో పాకిస్తానీ సైన్యం, మిలీషియా బలగాలు నిర్వహించిన హింసను జెనోసైడ్ గా వర్ణిస్తున్నారు.
ముఖ్యంగా బెంగాలీ హిందువులు ప్రత్యేక లక్ష్యంగా ఉండటం, వారి మీద జరిగిన హత్యలు, అత్యాచారాలు, బలవంతపు స్థలాంతరాలు.. ఇవన్నీ ఒక నిర్దిష్ట జాతి లేదా మత సమూహాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో జరిగిన చర్యలు”గా పరిగణించబడుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం, 1971 సంఘటనలను అధికారికంగా జనసంహారం గా గుర్తించి, అంతర్జాతీయ వేదికలపై కూడా అదే పదజాలాన్ని ఉపయోగిస్తోంది.
అయితే, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల స్థాయిలో, 1971 బెంగాల్ మారణహోమానికి ప్రత్యేకంగా జెనోసైడ్ గా అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ఇంకా పూర్తిగా నెరవేరలేదు.
మరణాల సంఖ్య, అత్యాచారాల పరిమాణం, లక్ష్యంగా ఎంచుకున్న సమూహాన్ని చూసినప్పుడు, 1971 సంఘటనలను జనసంహారంగా పిలవకపోవడం చరిత్రపరమైన అన్యాయమని అనేక మంది నిపుణులు అంటున్నారు.
బంగ్లాదేశ్‌లో 1971 సంఘటనలు.. ముక్తి యుద్ధంగా, పాకిస్తానీ సైన్యం చేసిన హింస జనసంహారంగా పాఠ్యపుస్తకాల్లో, స్మారక స్థలాల్లో, జాతీయ చైతన్యంలో బలంగా నిలిచాయి. పాకిస్థాన్‌లో మాత్రం, 1971లో జరిగిన హింసపై పూర్తి స్థాయి ఆత్మపరిశీలన, బాధ్యతల స్వీకరణ, న్యాయ ప్రక్రియలు చాలా పరిమితంగా జరిగాయి. హమీదుర్ రెహ్మాన్ రిపోర్ట్ వంటి కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో లేవు.
అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా శీతల యుద్ధ కాలపు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, 1971 బెంగాల్ మారణహోమంపై తగినంత దృష్టి సారించలేదనే విమర్శ ఉంది.
హత్యలు జరిగినప్పుడు ప్రపంచం చూసింది. కానీ చరిత్ర రాయాల్సినప్పుడు, బాధితుల కన్నీళ్లను పూర్తిగా పేజీలపై ముద్రించలేదనే మాట వినిపిస్తోంది.
నేటి సందర్భం ఏంటంటే జలవాయు మార్పు, మహిళల భద్రత, శరణార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైనపుడు.. గత కాలపు హింస, వర్తమాన సవాళ్లకు ఎలా ముడిపడుతోంది? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 1971లో జరిగిన హింస, నేటి బంగ్లాదేశ్ సమాజంలో ప్రత్యేకంగా మహిళలు, శరణార్థుల వారసులు, పేద రైతుల జీవితాల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది.
ఉమెన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ బంగ్లాదేశ్ వంటి పరిశోధన గ్రంథాలు, 1971లో జరిగిన హింస, స్థలాంతరం, పేదరికం, సామాజిక అసమానతలు అన్నీ కలిసి నేటి బంగ్లాదేశ్‌లో మహిళల రక్షణ లేని స్థితిని, వలసలను, వాతావరణ మార్పు ప్రభావాలను మరింత తీవ్రమయ్యేలా చేశాయని చూపిస్తున్నాయి.
తీర ప్రాంతాల్లో, నదీ తీరాల వద్ద నివసించే పేద కుటుంబాలు వీరిలో చాలామంది 1971 శరణార్థుల వారసులే. ఇప్పుడు వరదలు, చక్రవాతాలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి కొత్త ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు వీరు.
గతంలో యుద్ధం, నేడు వాతావరణ మార్పు.. రెండింటి భారం ఎక్కువగా పడేది మహిళలపై, పిల్లలపై, పేదలపైనే. ఇదే అసలైన కఠిన వాస్తవం. 1971లో గన్ శబ్దాలు వినిపించాయి.. నేడు గాలి, నీటి, వాతావరణ మార్పుల రూపంలో మరో మౌన యుద్ధం కొనసాగుతోంది. బాధితులు మాత్రం వాళ్లే, అప్పుడూ ఇప్పుడూ వాళ్లే.
1971 బెంగాల్ మారణహోమం, పాకిస్తానీ సైన్యం, అనుబంధ మిలీషియా బలగాలు నిర్వహించిన హింస, బెంగాలీ హిందువులపై జరిగిన టార్గెటెడ్ దాడులు, మహిళలపై వ్యవస్థీకృత అత్యాచారాలు.. చూసినప్పుడు, ఇది కేవలం ఒక సివిల్ వార్ కాదు. ఒక జాతి, ఒక భాష, ఒక మత సమూహాన్ని మౌనంగా నశింపజేయాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది.
చరిత్రపరంగా, నైతికంగా, న్యాయపరంగా చూస్తే.. ఈ సంఘటనలకు జనసంహారం అనే పేరు ఇవ్వడం,
బాధితుల జ్ఞాపకాలను గౌరవించడం, భవిష్యత్తులో ఇలాంటి హింస పునరావృతం కాకుండా ఉండేలా పాఠాలు నేర్చుకోవడం.. ముఖ్యం. అంతర్జాతీయ సమాజం, దక్షిణాసియా దేశాలు, ముఖ్యంగా భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కు ఒక సమిష్టి బాధ్యతగా భావించాల్సి వస్తుంది.
1971 బెంగాల్ మారణహోమం, కేవలం గతం మాత్రమే కాదు. నేటి రాజకీయ చర్చల్లో, శరణార్థుల ప్రశ్నల్లో, మహిళల భద్రత, జలవాయు న్యాయం, ప్రాంతీయ భద్రత లో ప్రతిధ్వనించే ఒకానొక నిరంతర చరిత్ర.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





