భక్తుల ఇంటికే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు
posted on: Feb 21, 2026 5:15PM
.webp)
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి హాజరుకాలేని భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. పవిత్రమైన కల్యాణ తలంబ్రాలను వారి ఇంటి వద్దకే చేరవేసే సేవలను సంస్థ మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో లభించిన విశేష స్పందనతో ఈ ఏడాది కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారం తో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి తలంబ్రాల బుకింగ్ గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎండి నాగిరెడ్డి మాట్లాడుతూ... భద్రాద్రి సీతారాముల కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలకు అపూర్వమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉందన్నారు. నియమనిష్ఠలతో గోటితో ఒలిచిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఉపయోగించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల కోసం ఈ సేవ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. రూ.151 చెల్లించి తలంబ్రాల ప్యాకెట్‌ను బుక్ చేసుకోవచ్చని, బుకింగ్స్ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.
టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లాజిస్టిక్స్ కౌంటర్లలో నేరుగా కూడా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తుల గృహాలకే హోం డెలివరీ ద్వారా చేరవేస్తామని సంస్థ పేర్కొంది. భక్తుల వద్దకు వెళ్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఆర్డర్లు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ సేవకు గత మూడేళ్లుగా అపారమైన ఆదరణ లభిస్తోందని, 2022లో దాదాపు 89 వేల మంది భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోగా, ఆ తర్వాత లక్షలాది మందికి ఈ పవిత్ర ప్రసాదాన్ని అందజేశామని నాగిరెడ్డి తెలిపారు. సంస్థపై ఉన్న విశ్వాసమే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తోందన్నారు.
తలంబ్రాల బుకింగ్‌కు సంబంధించిన వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440069లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని అన్ని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీటీఎం (మార్కెటింగ్ & కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్స్ ఏటీఎం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఇంటికే భద్రాద్రి రాముల వారి కల్యాణ తలంబ్రాలను అందించే ఈ పవిత్ర సేవకు మరోసారి శ్రీకారం చుట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా భక్తుల్లో ఆనందం నెలకొంది. శ్రీరామనవమి పర్వదినాన రాములోరి కృప పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది






