కాకినాడ పోర్టులో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక
posted on Oct 28, 2025 4:35PM

మొంథా తుపాను తీరం వైపునకు దూసుకువస్తున్నది. మరి కొన్ని గంటలలో ఈ తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందన్న అంచనాలతో కాకినాడ పోర్టుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అలాగే గతన్నవరం, విశాఖ పోర్టులకు 9, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఎనిమిదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఉండగా తాజాగా తుపాను హెచ్చరికల కేంద్రం మొంథా తుపాను తీరం దాటే ప్రాంతంలో ఒకింత మార్పు ఉంటుందన్న అంచనాకు వచ్చింది.
ఇంత వరకూ చెబుతున్నట్లుగా కాకినాడ వద్ద కాకుండా ఈ తుపాను కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే కోనసీమ ప్రాంతమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్నాయి. తుపాను తీరం సమీపానికి వచ్చే సరికి ఈ ఈదురుగాలుల వేగం మరింత పెరుగుతుందనీ, గంటకు 110 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచే ఈ గాలులకు చెట్లు నేలకొరగడమే కాకుండా, విద్యుత్ స్తంభాలు నేల కూలే ప్రమాదం ఉందనీ హెచ్చరించింది.
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నంచి బయటకు రావద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయా అన్నట్లుగా ఆకాశంలో నల్లని మబ్బులు కమ్మేశాయి.