తెనాలి జంట హత్యల కేసు.. నిందితులు ఎవరంటే?
posted on Jun 23, 2025 12:53PM

గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు భేదించారు. పరిమి రోడ్డులో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలు రాజేశ్వరి, అంజమ్మలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కీలక సూత్రధారి మారిసి పేటకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ పెరవలి కుసుమ కుమారిగా పోలీసులు నిర్ధారించారు.
ఆటో డ్రైవర్ గోపి మరో మైనర్ బాలుడు తో కలిసి పక్క ప్రణాళికతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం( జూన్ 23) ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నిందితుల వివరాలను తెలియజేశారు. డొంకలో అప్పడాల కంపెనీ పై భాగంలో ఉంటున్న వియ్యపురాళ్లయిన రాజేశ్వరి, అంజమ్మల ఒంటిపై ఉన్న బంగారం, నగదు కోసమే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు.
కీలక సూత్రధారి కుసుమ కు గతంలో ఇదే తరహాలో జరిగిన మరో హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. జంట హత్యల కేసు విచారిస్తుండగా గతంలో చేసిన మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తో పాటు సిబ్బందిని డి.ఎస్.పి బీ జనార్ధన రావు అభినందించారు.