కాక్రోచ్ జనతా పార్టీకి మోదీ భయపడ్డారా?

posted on: May 28, 2026 7:58PM

 

తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితులపై జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన  విశ్లేషణాత్మక చర్చ జరిగింది. భారతీయ రాజకీయ ముఖచిత్రంలో ఒకప్పుడు ప్రజా సమస్యలు, సిద్ధాంతాలపై జరిగే చర్చలే ప్రధానంగా ఉండేవి. కానీ, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం గమనిస్తే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇటీవల అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తులు దేశ యువతను, ఆర్టీఐ కార్యకర్తలను ఉద్దేశించి "కాక్రోచెస్" (బొద్దింకలు), "పారాసైట్స్" (పరాన్నజీవులు) వంటి అగౌరవ పదాలను ఉపయోగించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రశ్నించే హక్కును ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా భావించాల్సింది పోయి, అలా ప్రశ్నించే వారిని "అర్బన్ నక్సలైట్లు" అని ముద్రవేయడం ప్రస్తుత రాజకీయాలలోని అసహనానికి నిదర్శనంగా నిలుస్తోందని  జమీన్ రైతు సంపాదకుడు విశ్లేషించారు.

దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, నైరాస్యం వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. యువత తమ ప్రతిభకు మరియు నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించక తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే, ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాలకులు విమర్శకులను అణచివేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 

ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి, రోజులో 24 గంటలూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడే తత్వం పెరిగిపోయింది. సమాజంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడం కంటే, అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తించే యువతను కూడా మనం చూస్తున్నాం. ఇది యువతలో నైతిక విలువల క్షీణతను సూచిస్తోంది.

ప్రస్తుత రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మరియు దేశవ్యాప్తంగా బీజేపీ వంటి పార్టీలు యువతను లేదా సరికొత్త తరం (జెన్-జీ) ను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయి. ప్రజల్లో ఈ పార్టీల పట్ల నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. ఏ ఒక్క ప్రజా సమస్యపైనా సరైన చర్చ గానీ, కఠినమైన చర్యలు గానీ లేకపోవడం వల్ల ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులలో ఒక రకమైన తీవ్ర నిరాశ, ఫ్రస్ట్రేషన్ నెలకొంది.

ఈ పరిణామాలు భవిష్యత్తులో దేశ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి. సమాజంలో పేరుకుపోతున్న ఈ అసంతృప్తి ఒక అగ్నిపర్వతం లాంటిది, ఇది ఏ క్షణంలోనైనా బద్దలు కావచ్చు. ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుని, యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను రక్షించకపోతే, భవిష్యత్తులో రాజకీయ పార్టీలపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం కాకుండా, ప్రజాస్వామ్యంపై ప్రజలకు మళ్లీ విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత పాలకులపై ఎంతైనా ఉందని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇలాంటి వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...