Latest News

సివిల్స్ ఫలితాల్లో తెలుగు సత్తా.. ఇద్దరికి వంద లోపు ర్యాంకులు

posted on: Mar 9, 2026 1:03PM

దేశంలోనే  అత్యంత కఠినమైన పరీక్షగా భావించే సివిల్ సర్వీసెస్-2025 తుది ఫలితాలను యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఈ ఫలితాలలో దేశ వ్యాప్తంగా మొత్తం  958 మంది ఎంపికవగా, తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా అభ్యర్థులు వివిధ ర్యాంకులు సాధించి సత్తా చాటారు.  

యూపీఎస్సీ  సివిల్ సర్వీసెస్-2025 ఫలితాల్లో  తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వంద లోపు ర్యాంకులు సాధించి మెరిశారు.    ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్  చంద్ర    23వ ర్యాంకుతో మెరిశాడు.   గతంలో 162వ ర్యాంకుతో ఐపీఎస్ కు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న జీను శ్రీజశ్వంత్ ఎలాగైన  ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో మళ్ళీ పరీక్ష రాసి ఈ సారి 23వ ర్యాంకు దక్కించుకుని అనుకున్నది సాధించారు.

అదే విధంగా  తెలంగాణ పెద్దపల్లి జిల్లాకు చెందిన సృజన తన 5వ ప్రయత్నంలో  53వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ప్రస్తుతం ఈమె గ్రూప్-1 ద్వారా డీఎస్పీ శిక్షణ పొందుతున్నారు. కాగా సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా అభ్యర్థులు ర్యాంకులు సాధించారు.  వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ.

 793వ ర్యాంకు సాధించిన దైనంపల్లి ప్రవీణ్..  చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి,  పారిశుధ్య కార్మికురాలైన నాయనమ్మ వద్ద కటిక పేదరికంలో పెరిగి కూడా ఉత్తమ ర్యాంకు సాధించడం విశేషం.   ఇక నల్గొండ జిల్లాకు చెందిన సోదరులు విక్రమ్ సింహారెడ్డి , విజయ్ సింహారెడ్డి  వరుసగా 541, 682 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు విద్యార్థులు ఒకే సారి  సివిల్స్ ర్యాంకులు సాధించడం విశేషం.

కాగా ఈ సారి ఫలితాల్లో చెప్పుకోదగ్గ విశేషమేంటంటే.. తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం పొందిన వారిలో  20 మంది విజయం సాధించడం. ఇక సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రాజస్థాన్ కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి సాధించగా, దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన రాజేశ్వరి రెండో ర్యాంకు సాధించింది. కాగా యూపీఎస్సీ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 958 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...