నాని కూడా జగన్‌కి హ్యాండ్ ఇస్తాడా..?

posted on: Apr 12, 2016 11:13AM

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడిపోతోంది. వెళ్లను..వెళ్లను..చివరి వరకు జగనన్నతోనే అన్నవారంతా ఒకరి తర్వాత ఒకరు సైకిలెక్కేపాటికి జగన్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. తాజాగా గుడివార ఎమ్మెల్యే కొడాలి నాని కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అన్న ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన నాని నందమూరి వంశానికి భక్తుడు. వారిపై ఈగ కూడా వాలనివ్వడు. గుడివాడతో పాటు ఆ చుట్టుపక్కల నియోజకవర్గంలో టీడీపీ పటిష్టతకు శాయశక్తులా కృషిచేశాడు. గుడివాడ నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాని. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న నానికి చంద్రబాబు జూనియర్ పట్ల అనుసరించిన విధానం నచ్చలేదు. అవసరమైనపుడు వాడుకొని కూరలో కరివేపాకులా తీసిపారేశారంటూ బాహాటంగానే అధినేతను విమర్శించాడు. ఈ వ్యవహారంపై బాబు సీరియస్ అవడంతో నాని టీడీపీకి వీడ్కోలు పలికి జగన్ నాయకత్వంలోని వైసీపీ చేరారు. వైసీపీ టిక్కెట్‌పైనే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 

రీసెంట్‌గా చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి చేరడంతో నాని ఆలోచనలో పడ్డారు. దానికి తోడు విజయవాడలో ఒక కార్యక్రమానికి వచ్చిన హరికృష్ణతో నాని ఒకే కారులో ప్రయాణించడంతో నాని పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి. నాని తోందరపడ్డారని, ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు గుడివాడ ప్రాంతంలో నానికి తిరుగులేని ఆధిపత్యం ఉండి వుండేదని కొందరు వ్యాఖ్యానించారు. నాని టీడీపీలోకి రావడానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అధికార పార్టీ పెద్దలు ప్రకటించారు కూడా. ఈ పరిణామాలన్నింటిని గమనించి కార్యకర్తలతో సమావేశాలు పెట్టి వారి అభిప్రాయాలను తీసుకోవాలని నాని ఆలోచిస్తున్నారని లోటస్ పాండ్ టాక్. ఇంతకీ నాని ఏం చేస్తారోనని అటు వైసీపీ, ఇటు టీడీపీ కార్యకర్తలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...