భజనగాళ్ల త్యాగాలు లోకేశ్‌కి అక్కర్లేదు

posted on: Apr 7, 2016 4:43PM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు త్యాగాలు చేయడానికి టీడీపీ నేతలు క్యూకడుతున్నారు. లోకేశ్ కోసం మేం రాజీనామా చేస్తామంటే, మేం రాజీనామా చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌లు ఈ త్యాగాల వీరుల్లో ముందు వరుసలో ఉన్నారు. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని, ఆయన కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ బుద్దా చినబాబు మీద తెగ ప్రేమ ఒలకబోశాడు. అంతేకాదు మరో ముందడుగు వేసి రాజీనామాను చంద్రబాబుకు సమర్పిస్తానంటూ ప్రకటించారు. ఇక బోడే ప్రసాద్ విషయానికొస్తే లోకేష్ లాంటి నేతలు రాజకీయాల్లో అరుదని, అలాంటి వారి అవసరం టీడీపీకి ఎంతైనా ఉందన్నారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి పదవులు ఆశించకుండా పనిచేస్తున్న లోకేష్‌ను గౌరవించుకునే సమయం వచ్చిందన్నారు. అయితే టీడీపీ అభిమానులు వీళ్ల త్యాగం వెనుక మర్మాన్ని అంచనా వేసేశారు.

 

లోకేష్ పోటీ చేయాలనుకుంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలున్నాయి. కాల్‌మనీ పేరుతో మహిళలను ఆటవస్తువుగా మార్చి వేధింపులకు గురిచేశారని ఇప్పటికే వీరిని ప్రతిపక్షాలు, మీడియా చెడుగుడు ఆడుకుంటున్నాయి.  ఈ ఆరోపణలతో ఇప్పటికే పరువు పోవడంతో పాటు ప్రజల దృష్టిలో చులకనయ్యారు. కాల్‌మనీ వ్యవహారం తర్వాత దాదాపుగా కనిపించడం మానేసిన వీరిద్దరికి  ఎడారిలో ఒయాసిస్‌లా లోకేష్ దొరికారు. చాలా రోజుల తర్వాత మైక్ దొరకడంతో లోకేష్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నట్టు వీరిద్దరూ పూనకం వచ్చినట్టు ఊగారు.  లోకేష్ కోసం పదవి త్యాగం చేస్తే అధినేత దృష్టిలో పడటం, మీడియాలో పబ్లిసిటితో పాటు  తమ రాజకీయ జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని భావిస్తున్నారట ఈ పోటుగాళ్లు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో క్లీన్ ఇమేజ్ ఉన్న చంద్రబాబు తన వారసుడికి కూడా అలాంటి క్లీన్ ఇమేజ్ ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి భజనలకు, పొగడ్తల విషయంలో చంద్రబాబు ఆచితూచి స్పందిస్తారు. పైగా వీరి త్యాగాన్ని వాడుకుని లోకేశ్ ని ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో పోటీ చేయిస్తే కాల్‌మనీ నిందితులకు చంద్రబాబు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో బాబు అలాంటి తప్పే చేయరని టీడీపీ నేతల టాక్.  లోకేష్ దేన్నయినా కష్టపడి సాధించుకుంటారని ఒకడి త్యాగం చినబాబుకి అవసరం లేదని కార్యకర్తల ఫిలింగ్.

google-ad-img
    Related Sigment News
    • Loading...