చౌద‌రి వ‌ర్సెస్ రెడ్డి..!

posted on: Apr 6, 2016 5:36PM


 

అనంత‌పురం జిల్లా తెలుగు దేశం పార్టీలో కుమ్ములాట‌లు రచ్చ‌కెక్కాయి. తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అనంత‌పురం  ఎమ్మెల్యే  ప్ర‌భాక‌ర్ చౌద‌రి మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉప్పు నిప్పులా ఉన్న వీరిద్ద‌రూ ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ప‌ర‌స్ప‌రం దూషించుకుంటున్నారు.  జిల్లా గ్రంథాల‌య సంస్థ మాజీ అధ్య‌క్షుడు ర‌షీద్ ను పార్టీలోకి చేర్చుకోవాలనుకున్నారు చౌద‌రి అయితే ర‌షీద్ రాక‌ను అడ్డుకున్నారు ప్ర‌భాక‌ర్ రెడ్డి అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. అనంత న‌గ‌రంలోని పాతూరు రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్లో ఇద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన వివాదం ముదిరి పాకాన ప‌డింది. రోడ్డును విస్త‌రించాల‌ని జేసీ బ్ర‌ద‌ర్స్, విస్త‌ర‌ణ చేప‌డితే ప్రార్థ‌నా మందిరాలు తొల‌గించాల్సి వ‌స్తుందని చౌద‌రి ప‌ర‌స్ప‌రం ఆందోళ‌న‌కు దిగారు.

 

అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టు న‌గ‌రంలో ఆర్య‌వైశ్యులకు చెందిన కొత్తూరు అమ్మ‌వారి క‌ళ్యాణ మండ‌పాన్ని మునిసిపల్ కార్పోరేష‌న్ అధికారులు ఇటీవ‌లే సీజ్ చేశారు. దీనికి మేయ‌ర్ స్వ‌రూప‌, ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్  చౌద‌రి కార‌ణ‌మంటూ న‌గ‌రంలో తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ ఆర్య‌వైశ్యులు జేసీ అనుచ‌రుడు కోగ‌టం విజయ్ భాస్క‌ర‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ర్యాలీ చేప‌ట్టి కార్పోరేష‌న్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. దీనిని పోలీసులు అడ్డుకోవ‌డంతో కోగ‌టం తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆయ‌న్నిప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చిన ప్ర‌భాక‌ర్ రెడ్డి నేను అనుకుంటే వాడి ఇంటికాడికి స‌క్క‌గా వ‌చ్చి కొడ‌తానంటూ చౌద‌రిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనికి చౌద‌రి కూడా ఘాటుగానే స్పందించారు. న‌న్ను కొట్టాలంటే మ‌రో జ‌న్మ ఎత్తాల‌ని అన్నారు. వీరిద్ద‌రి చ‌ర్య‌ల‌తో తెలుగు త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మీరు మీరు కొట్టుకుని పార్టీ ప‌రువు తీయోద్ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. చివ‌రికి పంచాయ‌తీ అధినేత వ‌ద్ద‌కు చేర‌డంతో బాబు ఈ త‌గ‌వును ఎట్లా ప‌రిష్క‌రిస్తారో వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...