Latest News

తెలంగాణ కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరంటే?

posted on: Mar 11, 2026 11:48AM

 

తెలంగాణలో కొత్త డీజీపీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర నూతన పోలీస్‌ బాస్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌  పేరు దాదాపు ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ  శివధర్‌రెడ్డి  పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో ఆనంద్‌ను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపింది. ఈ జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు సౌమ్యమిశ్రా, వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, శిఖాగోయల్‌ పేర్లు ఉన్నాయి. వీరిలో సీనియారిటీ పరంగా ముందున్న సీవీ ఆనంద్‌కే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

కొత్త డీజీపీ ఎంపికపై ఢిల్లీలో యూపీఎస్సీ ఎంప్యానెల్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ కూడా సభ్యుడిగా ఉండటంతో ఆయన ఈ సమావేశంలో పాల్గొననున్నారు. యూపీఎస్సీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన నాలుగు పేర్లను పరిశీలించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముగ్గురి పేర్లతో తుది జాబితాను రాష్ట్రానికి పంపిస్తుంది. ఆ జాబితాలోని ఒకరిని తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తుంది.

డీజీపీ నియామకానికి సంబంధించి ప్రకాశ్ సింగ్ కేసులో  సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ ఇటీవల తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు లేఖలు పంపి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. సీనియారిటీ, అనుభవం దృష్ట్యా సీవీ ఆనంద్‌నే రాష్ట్ర తదుపరి డీజీపీగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...