తెలంగాణ టీడీపీ నాయకులకు మైండుందా?
posted on Mar 1, 2018 11:09AM

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. చాలామంది నాయకులు, కార్యకర్తలు పార్టీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీలో వున్న వారిలో చాలామంది టీఆర్ఎస్‌లోకి వెళ్ళడానికి అవకాశం లేనివారు మాత్రమే అనే అభిప్రాయాలు వున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందిన వారు కూడా కష్టకాలంలో పార్టీకి అండగా వుండకుండా టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి మరికొందరు కూడా వెళ్ళరని గ్యారంటీ ఏమీ లేదు. మోత్కుపల్లి నర్సింహులు లాంటి సీనియర్ నాయకులు పార్టీలోనే వుంటూ పార్టీకి నష్టం కలిగే కామెంట్లు చేస్తూ వుంటారు... అలాంటి వారిని భరించక తప్పని పరిస్థితిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ వుంది. అయితే పార్టీ అధినేత మాత్రం ఎంతమంది పార్టీని విడిచి పెట్టినా ఏమాత్రం జంకకుండా ఆశావాదంతో వ్యవహరిస్తున్నారు. మళ్ళీ ఏనాటికైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్న నమ్మకంతో వున్నారాయన. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లో ఈ నమ్మకమే వ్యక్తమైంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఓవర్ యాక్షన్ మాత్రం అసలు వీళ్ళకు మైండుందా.. లేదా అనే సందేహం కలిగేలా చేసింది.
చంద్రబాబు నాయుడితో భేటీ అయిన సందర్భంగా కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడానికి తాము ఎంతమాత్రం ఒప్పుకోమని, అలా విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి తలా తోకా లేని స్టేట్‌మెంట్లు ఇచ్చి కన్నీరు పెట్టుకోవడం అనేది ఓవర్ యాక్షన్ కిందే వస్తుంది మరి! అసలు ఇలా కన్నీళ్ళు పెట్టుకుని లబోదిబోమన్నది ఎప్పటి నుంచో టీడీపీలో వున్నవాళ్ళేనా... లేక ఈమధ్యకాలంలో పార్టీలో చేరినవాళ్ళా అనే సందేహాలు కలుగుతున్నాయి. చంద్రబాబు నాయకత్వం గురించి తెలిసినవాళ్ళెవరూ ఇలా లబోదిబోమనరు. చంద్రబాబు లాంటి నాయకుడు తన పార్టీ తెలంగాణ శాఖను టీఆర్ఎస్‌లో విలీనం చేస్తారని ఎవరైనా గట్టిగా నమ్మితే వాళ్ళకి మానసికంగా ఏదో సమస్య వున్నట్టే భావించాల్సి వుంటుంది. తనకు గవర్నర్ గిరీ అందడం ఆలస్యం అవుతోందన్న ఆవేదనలో మోత్కుపల్లి నర్సింహులు లాంటి పెద్దమనిషి ఏదో నోరు జారి వుంటారు. అంతమాత్రాన తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తారని ఎవరైనా ఎందుకు అనుకోవాలి? అవసరమైతే సింహం ఆకలితో మాడి చస్తుందిగానీ, గడ్డి తినదు.. తెలుగుదేశం పార్టీ కూడా అంతే! ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఆ పార్టీలో కొనసాగడం వేస్ట్!