ఐడియా ఆదిరింది..! ఆర్టీసీ బస్సులో కూలర్లంట
posted on: Apr 5, 2016 12:21PM
వేసవి కాలం వచ్చేసింది, రోజు రోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ప్రజలు అడుగుతీసి అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. మరి ఇలాంటి ఎండలో దూర ప్రాంతాలకు ప్రయాణం సాగించేవారి పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. ఆర్టీసీ స్థాపించినప్పటి నుంచి బస్సు వివిధ రకాలుగా రూపాంతరం చెందాయి. ప్యాసింజర్,ఎక్స్‌ప్రెస్‌ల నుంచి ప్రయాణం సుఖంగా సాగడానికి డీలక్స్, సెమీ లగ్జరీ, లగ్జరీ, ఫుష్ బ్యాక్ ఇలా చాలా రకాలుగా బస్సులున్నాయి. అయితే వీటిలో సామాన్యులు ప్రయాణించడానికి వారి ఆర్థిక పరిస్థితులు సహకరించవు. వీరి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న ప్రయోగం చేసింది.
సాధారణ ప్యాసింజర్ బస్సులో కూలర్లు ప్రవేశ పెట్టారు అధికారులు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డిపోకు చెందిన సిబ్బంది తమ సొంత ఖర్చు 30 వేల రూపాయల వ్యయంతో బస్సులో ఎయిర్ కూలర్లను అమర్చారు. ఏసీ అంత ఫీల్ రాకున్నా..ఎండ వేడిమి నుంచి కాస్తలో కాస్త ఉపశమనం పొందడానికి ఈ ప్రయత్నం మాత్రం విజయవంతమయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సు జగిత్యాల నుంచి హైదరాబాద్‌కి వస్తుంది. ఈ బస్సులో ప్రయాణించడానికి ప్రయాణికులు క్యూకడుతున్నారు.






