తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. ఈ అర్థరాత్రి నుంచి బస్సులు బంద్!

posted on: Apr 21, 2026 7:28AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె సెగ మొదలైంది. తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. మంగళవారం (ఏప్రిల్ 21) అర్ధరాత్రి నుంచి బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. దీంతో బుధవారం(ఏప్రిల్ 22)  ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోనుంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.  ప్రభుత్వంతో జరిగిన ప్రాథమిక చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, సమ్మె అనివార్యమని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. దాదాపు అన్ని ప్రధాన యూనియన్లు ఈ సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపించాలని చూస్తే సహించేది లేదని, ఈ పోరాటాన్ని మరో 'సకల జనుల సమ్మె'లా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేత అశ్వత్థామ రెడ్డి సమ్మెకు మద్దతును ప్రకటిస్తూ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.

ఈ స సమ్మె నిర్ణయంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు, విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. ఇలా ఉండగా ప్రభుత్వం కార్మిక సంఘాలతో మరో సారి చర్చించాలని భావిస్తున్నది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...