ఆర్టీసీ స‌మ్మె.. కార్మికుల డిమాండ్లు ఏంటి?.. ప్రభుత్వ స్పందన ఎలా ఉంది?

posted on: Apr 24, 2026 2:11PM

ప్ర‌స్తుతం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎందుక‌ని స‌మ్మె చేస్తున్నారు?  వారి డిమాండ్లేంటి? అంటే   తెలంగాణ ఆర్టీసీ  కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రధానంగా 32 డిమాండ్లు కారణ. ఆ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి ఈ సమ్మెకు దిగారు.  గతంలో విలీన ప్రక్రియ ప్రారంభమైనా, అది పూర్తిస్థాయిలో అంటే సివిల్ సర్వీస్ క్యాడర్‌తో సమానంగా..  జరగలేదని  భావిస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ సిబ్బందిని పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. 

అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం- మహాలక్ష్మి పథకం.. ప్రవేశపెట్టిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. కానీ దానికి తగ్గట్లుగా కొత్త బస్సులను కొనుగోలు చేయకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లపై పని ఒత్తిడి  పెరిగిందని వారు తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక పోతే..  30 శాతం ఫిట్‌మెంట్‌తో  వేతన సవరణ చేయాల‌న్న డిమాండ్ సైతం నెర‌వేర్చాల్సి ఉంది ప్ర‌భుత్వం. 2025 వేతన సవరణ అమలు చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ- బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఆర్టీసీలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కార్మికుల గొంతుకను వినిపించే అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు కార్మికులు.

ఇక ఇత‌ర డిమాండ్ల విష‌యానికి వ‌స్తే.. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వేగవంతం చేయడం, అద్దె బస్సుల డ్రైవర్లను కూడా సంస్థలోకి తీసుకోవడం., మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం వంటివి ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి.   రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన‌ వివరాల ప్రకారం, కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్లను ప్రభుత్వం  అంగీకరించింది. అయితే, విలీనం, యూనియన్ ఎన్నికలు వంటి క్లిష్టమైన అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల సమయం కోరుతూ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కానీ, స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతుండ‌టంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలకు తీవ్ర‌ అంతరాయం కలుగుతోంది.

దురదృష్టవశాత్తూ, ఆర్టీసీ సమ్మెల చరిత్రలో కార్మికులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. 2019లో జరిగిన 52 రోజుల సుదీర్ఘ సమ్మె సమయంలో ఇవి తీవ్ర విషాదాన్ని నింపాయి. అప్పట్లో సమ్మె తీవ్ర రూపం దాల్చినప్పుడు.. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది.  ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్ర‌భుత్వం ప్రకటించ‌డంతో.. మానసిక ఆందోళనకు గురైన‌ కొందరు కార్మికులు బ‌ల‌వన్మరణాలకు పాల్పడ్డారు. 

ఖ‌మ్మం డిపోకి చెందిన శ్రీనివాస్ రెడ్డి.. ఆనాటి సమ్మె కాలంలో ఆత్మబలిదానానికి పాల్పడిన తొలి వ్యక్తి. ఆయన మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైద‌రాబాద్ కి చెందిన సురేందర్ గౌడ్  ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ, ఉద్యోగ భద్రతపై ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరితో పాటు సుమారు 30 మందికి పైగా కార్మికులు గుండెపోటు, లేదా తీవ్ర ఒత్తిడి కారణంగా మరణించినట్లు అప్పట్లో కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రస్తుతం జరుగుతున్న నిరసనల్లో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం పట్టుబట్టినప్పటికీ, ప్రభుత్వం చర్చలకు పిలుస్తోంది.  తాజా సమ్మెలో కూడా ఒక కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డాడు.  
 
  గ‌త చ‌రిత్రను బ‌ట్టి చూసినా, ప్రస్తుత సమ్మె ఉధృతిని గమనించినా ప్రభుత్వం  ఈ స‌మ్మెను వీలైనంత‌గా  సానుకూల ప‌రిచేలా   చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది. అందుకే శ్రీధ‌ర్ బాబు వంటి మంత్రులు మీడియా ముందుకు వ‌చ్చి ఎవ్వ‌రూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని కోరుతున్నారు. కాబ‌ట్టి ప్ర‌భుత్వం వీలైనంత త్వ‌ర‌లో ఈ స‌మ్మె డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌లిగితే.. ఇటు ఉద్యోగుల‌కు, అటు ప్ర‌యాణికుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...