Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ నేతల విమర్శలు సరికాదు : సీఎం చంద్రబాబు
posted on: Jun 3, 2026 3:57PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
తాను ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు, అక్కడ కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలు ప్రచారం చేశారని తెలిపారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ కూడా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించాలని ప్రయత్నించిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వివిధ దేశాల్లో కీలక రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే సహా అనేక దేశాల్లో తెలుగువారు ఆయా దేశాల రాజ్యాంగాల ప్రకారం సేవలందిస్తూ నాయకులుగా ఎదుగుతున్నారని చెప్పారు.
ప్రజలకు మంచి సేవలు అందించే వారే నాయకులుగా గుర్తింపు పొందుతారని పేర్కొన్న ఆయన, తెలంగాణలో పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు మంచి రాజకీయ సంస్కృతికి నిదర్శనం కావని అన్నారు. ప్రజా చైతన్యం, అభివృద్ధి, సేవల విషయంలో పోటీ పడాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు.
అనవసర వ్యాఖ్యలతో లేనిపోని సమస్యలు సృష్టించడం మంచిది కాదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, రెండు రాష్ట్రాలు తమ తమ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఎవరు ఏ ప్రాంతానికి ఎంత సేవ చేశారో ప్రజలకు తెలుసని, తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.





