రాష్ట్రం అయిపోయింది.. ఇప్పుడు భాష
posted on Sep 7, 2015 1:10PM

తెలంగాణ ప్రాంతానికి.. ప్రజలకు అన్యాయం జరిగిపోతుందంటూ.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నారు. ఇక రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఎలాంటి మొహమాటం లేకుండా తెలంగాణ ప్రభుత్వం అప్పటి వరకూ ఒకటిగా ఉన్న శాఖలను రెండుగా చీల్చేసింది. ఒక్క హైకోర్టు మినహా తెలంగాణ పోలీస్ వ్యవస్థ.. తెలంగాణ అసెంబ్లీ.. టీఆర్ఎస్ ఆర్టీసీ ఇలా ఎన్నో మార్పుచేసేశారు. దీనిలో భాగంగానే విద్యుత్ ఉద్యోగుల బదిలీల పేరిట వాళ్లంతట వాళ్లే ఏపీ విద్యుత్ ఉద్యోగులను రీలీవింగ్ కింద పంపించేశారు. ఈ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.. అటు కేంద్రం మాటను కూడా పెడవ చెవిన పెట్టేసింది టీ సర్కార్.
అన్నీ తమకు వీలుగా మార్చేసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా సంతృప్తి కలగలేదేమో ఇప్పుడు భాషను కూడా వేరు చేయాలని.. మరో దుందుడుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ భాష అనేది ఒక ప్రత్యేకమైన భాష అన్నట్టు.. దానికి ఒక ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించాలని టీసర్కార్ ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి కాళోజీ జయంతి అంటే సెప్టెంబరు 9న తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా ఈ తెలంగాణ భాషా దినోత్సవం చేయాలని ఇందులో తెలంగాణ భాష గురించి చర్చలు.. వ్యాస రచన పోటీలు నిర్వహించాలని చూస్తోంది.
రాష్ట్ర విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఎన్నో వివాదాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని గొడవలు జరిగినా ఒక రకంగా ఇరురాష్ట్రాలు కాస్తంత కలిసి ఉండటానికి ప్రధాన కారణం భాష కూడా. రాష్ట్రాలు వేరైనా మాట్లాడేది ఒకే భాష.. అందుకే తెలుగు రాష్ట్రాలు అని కూడా వాడుకలో చేరిపోయింది. రెండు ప్రాంతాల వారి మధ్య అనుబంధాన్ని సజీవంగా ఉంచగల ఒకే ఒక అంశం.. భాష మాత్రమే కాగా.. తాజాగా ఆ బంధాన్ని కూడా తెలంగాణ సర్కారు పుటుక్కున తుంచేసింది. ఎన్నో అంశాల్లో ఒంటెద్దు పోకడని అనుసరించే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భాష ను కూడా మార్చేసి.. తెలుగు అక్షరమాలను కుదించి.. అదే తెలంగాణ భాష అని తమ కంటూ ఓ భాషను కూడా సృష్టించిన ఆశ్చర్యపోనక్కర్లేదు..