తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇంటర్ కార్యాలయం ముట్టడి.. ఉద్రిక్తత
posted on: Feb 21, 2026 3:45PM

తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్ నాంపల్లిని ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని శనివారం (ఫిబ్రవరి 21) ముట్టడించారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు తున్న పలువురువిద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించి, హాల్ టికెట్లు జారీ చేసి, పరీక్షలకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి ప్రవేశించేందుకు విద్యార్థులు, నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నియంత్రించారు.


.webp)



