అభీ పిక్చ‌ర్ బాకీ హై...ఎవ‌రు ఎవ‌రికి క‌విత‌క్కా!

posted on: Feb 15, 2026 11:30AM

 

ఎవ‌రు ఎవ‌రికి  శ‌తృవులో మితృవులో రాజ‌కీయాల్లో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఇటు ఏపీ అటు తెలంగాణాలో సొంతింటి  బిడ్డ‌లే ఆయా  తండ్రి, సోద‌రుల‌పై  విరుచుకుప‌డుతుంటే.. అస‌లు సిస‌లైన ప్ర‌త్య‌ర్ధుల‌కు పెద్ద‌గా  ప‌ని లేకుండా  పోతోంది. ఏపీలో ష‌ర్మిళ రూపంలో ఆమె సోద‌రుడు జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో.. నింద‌లూ- నిష్టూరాలు- అప‌వాదులు- అభిశంస‌న‌లు.. చివ‌రికి అధికారం అత‌డికి సూటు కాలేద‌న‌డాలు.. ఇలా లెక్క‌లేన‌న్ని మాటలు తూటాల్లా పేలాయి.

ఇప్పుడు తెలంగాణ‌లో క‌విత రూపంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ,మాజీ మంత్రి హ‌రీష్‌రావు , మాజీ ఎంపీ సంతోష్ త‌దితరుల‌కు క‌విత సినిమా చూపిస్తున్నారు. తాజాగా వ‌చ్చిన మున్సిప‌ల్ ఫ‌లితాల్లో ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ తో క‌ల‌సి తాము పోటీ చేశారు.. వారి ద్వారా గుర్తింపు తెచ్చుకునే  య‌త్నం చేశారు క‌విత‌. ఎందుకంటే  ఆమెకు ఇంత వ‌ర‌కూ ఒక పార్టీ  లేదు కాబ‌ట్టి. విచిత్ర‌మైన  విష‌య‌మేంటంటే  క‌విత ద్వారా ఫార్వ‌ర్డ్ బ్లాక్ అన్న‌ది ఒక‌టి  ఉంద‌ని చాలా మందికి ఇప్పుడే తెలిసింది.

ఇదిలా  ఉంటే తాను పార్టీ పెడ‌తాన‌ని తెలిసిన  వెంట‌నే  ప్ర‌త్య‌ర్దుల‌ను ప‌క్క‌న పెడితే.. బీఆర్ఎస్ నేత‌లు చాలా  మంది త‌న‌ను ట్రోల్ చేస్తున్నార‌నీ.. వారంద‌రికీ చెప్పేదేంటంటే ఇది జ‌స్ట్ ట్రైల‌ర్ మాత్ర‌మే. ముందుంది  అస‌లు సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చారు క‌విత‌. సంద‌ట్లో స‌డేమియాలాగా.. కొంద‌రు జాగృతి పార్టీ  లీడ‌ర్లు ఏమంటున్నారంటే.. క‌విత‌క్క వ‌చ్చే రోజుల్లో సృష్టించ‌బోయే ప్ర‌భంజ‌నం ద్వార  కేసీఆర్ ఆయ‌న పార్టీ తుడిచి పెట్టుకుపోతుంద‌ని. ఈ మాట‌లంటున్న‌పుడు క‌విత  కూడా  ఏమీ అన‌లేని దుస్థితి. 

తాను రాజ‌కీయంగా ఏవో నాలుగు చిల‌క‌ప‌లుకులు ప‌లికి ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తుంటే వీరేంట్రా బాబూ.. నేను ఉత్తుత్తినే అన్న మాట‌లు నిజం చేసేలా ఉన్నారు??? అని లోలోప‌ల అనిపిస్తున్న‌దా దాన్ని బ‌య‌ట‌కు అన‌లేని సిట్యువేష‌న్లో ప‌డిపోయారు క‌విత‌. ఆవు ఒక గ‌ట్టున న‌డిస్తే దూడ మ‌రో గ‌ట్టున ఎందుకు న‌డుస్తుంది? ఇదీ అంతే అన్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి. 

క‌వితే, త‌న తండ్రి, ఆయ‌న పార్టీ, ఆయ‌న ఇత‌ర నాయ‌కుల‌పై విరుచుకుప‌డుతుంటే.. మ‌రి ఆమె సంస్థ కార్య‌క‌ర్త‌లు మాత్రం ఊరుకుంట‌రా? బ‌రాబ‌ర్ ఇలాగే మాట్లాతారన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. పాపం ఇవ‌న్నీ విని క‌విత‌క్క లోలోన ఎంత ర‌గిలిపోతున్నారో. ఆమె ఒక రాజ‌కీయ అవ‌స‌రం కోసం త‌న తండ్రీ సోద‌రుల‌పై క‌త్తి  క‌డితే.. దాన్ని సీరియ‌స్ గా తీస్కున్న కార్య‌క‌ర్త‌ల‌నే  మాట‌లు ఆమెకు గుండెకోత‌గా అంచ‌నా వేస్తున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.

google-ad-img
    Related Sigment News
    • Loading...