తెలంగాణ సర్కార్‌కి పరిశ్రమల ఫోబియా

posted on: Jun 4, 2014 12:58PM

 

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం ‘పరిశ్రమల ఫోబియా’తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నూతన ఆంధ్రప్రదేశ్‌లో అభివ‌ృద్ధి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ని అద్భుతంగా అభివృద్ధి చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు సీమాంధ్రను సింగపూర్ చేయాలన్న కసితో పనిచేయబోతున్నారు. హైదరాబాద్‌ని మించిన నగరాన్ని సీమాంధ్రలో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఆయన వున్నారు. దానికి సీమాంధ్ర ప్రజలు, ప్రభుత్వ అధికారుల నుంచి కూడా చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు అభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితోపాటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని దాదాపు ప్రకటించేసింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎక్కువ లాభాలు పొందే అవకాశం వుంది. ఈ వెసులుబాటును చూసుకుని హైదరాబాద్‌లో సీమాంధ్రులు నిర్వహించే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కి తరలి వెళ్లిపోయే అవకాశం వుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ లాభాల విషయంలో మాత్రమే కాకుండా, హైదరాబాద్‌లోనే తమ పరిశ్రమలను కొనసాగించి టీఆర్ఎస్ బెదిరింపులను ఎదుర్కోవాల్సిన ఖర్మ తమకేమిటని కూడా సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. ఆ ఉద్దేశంతో కూడా తమ పరిశ్రమలను సీమాంధ్రకు తరలించే ఆలోచనలో వున్నారు. ఈ అంశం టీఆర్ఎస్ సర్కారు గుండెల్లో బాంబులా పేలింది. సీమాంధ్రుల పరిశ్రమలన్నీ వరసబెట్టి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోతే పారిశ్రామికంగా తెలంగాణ పరిస్థితి దిగజారిపోతుందన్న భయం టీఆర్ఎస్ నాయకులను వేధిస్తోంది. ఈ విషయంలో మనసులో భయం వున్నప్పటికీ, తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం తెలంగాణ నుంచి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళే అవకాశం లేదని చెబుతున్నారు. తెలంగాణలోని పరిశ్రమలు ఏపీకి తరలి పోతాయని కొందరు రూమర్లు స‌ృష్టిస్తున్నారని, కానీ తెలంగాణ ముందు ముందు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన అంటున్నారు. దానికోసం తమ దగ్గర పక్కా ప్రణాళిక వుందని ఆయన చెబుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...